‘మద్దతు ధర’ అసలు మతలబు! | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 10 2018 1:31 AM

ABK Prasad Article On MSP Hike By Central Government - Sakshi

ప్రపంచ మార్కెట్‌కు భారతదేశ ఎగుమతులు ఎక్కకుండా నిరోధిస్తూ భారత దిగుమతులపై సుంకాలు విపరీతంగా పెంచడానికి అమెరికా నిర్ణయించింది. మన వ్యవసాయ రంగాన్ని సరళీకరించడం పేరుతో ప్రపంచ బ్యాంక్, అమెరికా ప్రోత్సాహంతో విదేశీ సరుకు దిగుమతుల కోసమే భారత మార్కెట్లలోని కొన్ని విభాగాల్ని ధారాదత్తం చేసుకున్నాం. విదేశీ దిగుమతులపైన మనం విధించాల్సిన సుంకాలను తొలగించుకుంటున్నాం. బ్రిటిష్‌వారి పరిపాలనలో మాదిరిగా సంప్రదాయ పరిశ్రమల్ని నాశనం చేస్తున్న కారణంగా కోట్లాదిమంది దేశ ప్రజలు ఉపాధి కోల్పోయే దుస్థితిలో పడుతున్నారని గుర్తించాలి.

‘‘రైతాంగం పండించే వరి, పత్తి వగైరా పంటలకు ప్రభుత్వం క్వింటాల్‌కు కనీస ధరను రూ.200 పెంచాలని నిర్ణయించింది. ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం. పంటలు పండించడానికి రైతు భరించే ఖర్చు కన్నా అదనంగా 50 శాతం ధరను రైతుకు ముట్టజెప్పబోతున్నట్టు లెక్క. అంటే, పంటకయ్యే విత్తనాల కొనుగోలుపైన, సేద్యపు నీటి వాడకంపైన రైతు కుటుంబం ప్రత్యేకించి కూలి చెల్లించాల్సిన పని లేదు. కాబట్టి, ఈ కనీస ధరను 50 శాతం పెంచాం.’’
– ప్రధాని మోదీ ప్రకటన (4–7–18)

‘‘రైతాంగం వ్యవసాయ ఖర్చులు, పంట ధరలను బేరీజు వేసుకునే అన్ని రకాల వ్యయాన్ని సమగ్రంగా అంచనా వేశాకే జాతీయ స్థాయి సాధికార కమిషన్‌ రైతులు పండించే పంటలకు హెచ్చు మద్దతు ధరను నిర్ణయించింది. ఎందుకంటే, దేశ రైతాంగ ప్రజల ఆర్థిక సమస్యలను గుర్తించబట్టే కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.  నేడు ప్రభుత్వం పెంచిన పంట కనీస ధర మొత్తంమీద చూస్తే (రూ. 200) పైకి ఎక్కువగానే కనిపిస్తుంది కానీ, పెరిగిన సాగు ఖర్చుల దృష్ట్యా వ్యవసాయ పంటల ధరల నిర్ణాయక కమిషన్‌ (2006) సిఫారసు చేసిన ప్రతిపాదనల కన్నా తక్కువ అని గమనించాలి.’’
– దేశంలో వ్యవసాయ సంక్షోభం నివారణకు ఏర్ప డిన జాతీయ స్థాయి సాధికార కమిషన్‌ అధ్యక్షుడు ఎం.ఎస్‌. స్వామినాథన్‌ (4–7–18)

గత నాలుగున్నరేళ్ల బీజేపీ ఏలుబడిలో రైతుల బాధలు ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తొచ్చాయి. కొన్ని పంటలకు కనీస మద్దతు ధరను గుర్తించడాన్ని ఆయన చారిత్రక నిర్ణయంగా ప్రకటించుకున్నారు. బీజేపీ సర్కారు పెంచిన తాజా కనీస ధర లోతు పాతులు పరిశీలిస్తే ఆ నిర్ణయంలోని డొల్లతనం బట్ట బయలవుతుంది. 2019 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ప్రభుత్వం కనీస ధర పెంచుతూ చేసిన ప్రకటన వెలువడిన మూడు రోజులకే 36 దేశాలు సభ్యులుగా ఉన్న ప్రపంచ ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) తాజా నివేదిక వెలు వడింది.

ఈ నివేదిక భారత దేశంలో వ్యవసాయ సంబంధిత విధానాలను సమీక్షిస్తూ, ‘‘ఇండియాలో రైతులు ప్రధాన వ్యవసాయ సబ్సిడీల వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కాని, నరేంద్ర మోదీ అధికా రంలోకి వచ్చాక 2014 నుంచి 2016 దాకా అనుసరిం చిన విధానాల నిర్ణయాల మూలంగా రైతులకు అందిన ఆదాయాలు ఏటా సగటున ఆరు శాతం చొప్పున తరిగిపోతూ వచ్చాయి. అదే సమయంలో ప్రభుత్వ విధానాల వల్ల రైతులకు దక్కాల్సిన శ్రమ ఫలితంలో ఆ పంటను అనుభవించే వినియోగదా రుల నుంచి 25 శాతం తక్కువ ఆదాయం లభి స్తోంది!’’ అని పేర్కొంది.

అందుకనే వరి పంట కనీస ధరను క్వింటాల్‌కు రూ.1550 నుంచి రూ.2000కు అంటే అదనంగా రూ.450 పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. పంటలు పండించడానికి అవసరమైన ఎరువుల (యూరియా, ఫాస్ఫేట్‌ వగైరా) ధరలు, ఇంకా సాగుకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, యంత్రాల ధరలూ బాగా పెరిగిపోయాయి. వీటిని సరఫరా చేసే ప్రైవేట్‌ కంపెనీలపై నియంత్రణ లేదు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి సకాలంలో సంతలకు తరలించే సరైన ప్రొక్యూర్‌మెంట్‌ విధానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు.

ధాన్యం సేకరణకు అవసరమైన గిడ్డంగుల సౌకర్యం కొరవడింది. ఇంకా, ఈ విషయంలో కీలకమైన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ను 1991లో ప్రపంచ బ్యాంకు అమల్లోకి తెచ్చిన సంస్కరణలు బలహీనపరిచాయి. ఫలితంగా ప్రైవేటు గుత్త వ్యాపార సంస్థల ప్రవేశంతో రైతుల కష్టాల పెరిగాయి. రైతులను, వ్యవసాయ రంగాన్ని ముట్టడించిన ఇన్ని అనర్థాలకు మౌలిక పరిష్కారాలు వెతకడం లేదు. ఈ పనిచేయకుండా మోదీ ప్రకటిం చిన ‘కనీస మద్దతు ధర’ ఎన్నికల కోసం నడిపే తంతుగా లేదా మోసంగా మిగిలిపోతుందే తప్ప ‘చారిత్రక నిర్ణయం’గా నిలదొక్కుకోలేదు.
మాట తప్పిన మోదీ సర్కారు!

ధాన్యాలకు కనీస ధరను మొత్తం ఖర్చులకు అద నంగా 50 శాతం ధర చేర్చి ఇస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. కానీ, నాలుగేళ్ల నుంచీ ‘మాట తప్పిన మోదీ’ గానే ప్రధాని మిగిలిపోయారు. మాటలు నేర్వకపోతే పూటలు గడవవన్న సామెతకు విలువ లేకుండా పోవాలంటే మాట ప్రకారం 2014 నుంచే కనీస మద్దతు ధరను అమలు చేయాల్సింది. అదే చేసి ఉంటే ఈ సరికే రూ.2 లక్షల కోట్ల మేర ప్రయోజనం దేశ రైతాంగానికి కలిగేదని నిపుణుల అంచనా! ఈ చారిత్రక మోసం లేదా వైఫల్యం వల్ల నష్టపోయినవారు రైతులు, వ్యవసాయ కార్మికులేనని గమనించాలి.

పెంచుతామన్న ప్రకటిత కనీస ధర హామీ అమల్లోకి రానందున 2014–17 మధ్య కాలంలో ప్రతి ఏడాదికి రైతాంగానికి దక్కిన కనీస మద్దతు ధర పెరుగుదల కేవలం 3.6 శాతం మాత్రమేగానీ, దక్కాల్సిన సగటు ధర 13 శాతమని పరపతి అంచనా (క్రెడిట్‌ రేటింగ్‌) సంస్థ ప్రకటిం చింది. 2009–13 మధ్య నాలుగేళ్లలో కనీస మద్దతు ధర 19.3 శాతం పెరిగింది. ఎరువులు, వ్యవసాయ పనిముట్ల ధరలు పెరుగుతూ రైతుల రుణభారాన్ని కూడా పెంచేశాయి. కార్పొరేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పాలకులు రైతులు, వ్యవసాయ కార్మికులను సాగు నుంచి క్రమంగా సాగ నంపడానికి వారు పట్టణాలు, నగరాలకు వలస పోయే పరిస్థితులు సృష్టిస్తున్నారు.  

ఈ దుస్థితికి పరిణామాలు దారితీయక ముందే పాలకులు రైతులకు చెల్లించే మద్దతు ధరకు తోడుగా ఆహార భద్రతా చట్టాన్ని, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కూడా స్వామినాథన్‌ పట్టుబడుతున్నారు. అమెరికా మార్కెట్‌లోకి  వచ్చే సరకులపై సుంకాలు పెంచాలన్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తాజాగా చైనా, భారత్‌లను ముమ్మ రించే మరో బెడద. 20 ప్రధాన పంటలను ప్రభుత్వం గానీ, సహకార రంగ సంస్థలుగాని కాపాడేలా ధాన్యం సేకరణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని నేషనల్‌ శాంపిల్‌ సర్వే సంస్థ తన 70వ నివేదికలో ప్రతిపాదించింది. 9 కోట్ల 20 లక్షల రైతు కుటుంబాల  రుణభారం రూ.4 లక్షల 23 వేల కోట్లు.

ఇందులో రుణదాతలు, వర్తకులు, ఉద్యోగులు, భూస్వాములు, దుకాణదారులు వడ్డీలకు ఇచ్చిన రుణాల మొత్తం రూ. 1 లక్షా 23 వేల కోట్లు. ఈ పెట్టుబడిదారీ మార్కెట్‌ ‘దందా’ వ్యవస్థలో వరికి, గోధుమ పంట లకు వర్తక వ్యాపారులు తమ లావాదేవీల్లో రైతులకు చెల్లింపజూచే వెల తక్కువగా ఉంటుంది. ఈ కారణం గానే ప్రభుత్వం అనుసరించే ప్రొక్యూర్‌మెంట్‌ (ధాన్య సేకరణ) ధరను కనీస మద్దతు ధరగా పేర్కొంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్‌ బాధ్యత నుంచి క్రమంగా అమెరికా సలహాలపైన, ప్రపంచబ్యాంకు సంస్కరణల ప్రభావం వల్ల తప్పుకుంటూ వచ్చిందో అప్పటి నుంచే రైతుల పరిస్థితి అనాథల స్థితికి వచ్చింది. కాగా ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్‌ పరిధిలోకి రానివి దేశంలో విస్తారంగా, భారీ స్థాయిలో పండించే బంగాళా దుంపలు (ఆలుగడ్డలు), ఉల్లి, వేరుశెనగ పంటలు. ఇందుకు కారణం– ఈ పంటలను ధాన్యా దుల మాదిరిగా నిల్వ ఉంచడం సాధ్యం కాదు. కానీ నిలవ ఉండగలిగే కంది, పెసర పంటలతో పోల్చితే తేడా స్పష్టం అని నిపుణుల అంచనా.పెరుగుతున్న పండ్లు, కూరగాయల సాగు!

అలా బేరసారాలతో రైతులు బలహీనులు కావడం వల్ల, ప్రభుత్వం బాధ్యత నుంచి పక్కకు తప్పుకో వటం వల్ల కూడా గత పదేళ్లకు పైగా ధాన్యాదులు పండే భూముల్ని పండ్లు, కాయగూరల పంటలకు భారీగా మళ్లించడమూ జరిగిందని వ్యవసాయ పరి శోధకులు అభిప్రాయపడుతున్నారు. రైతు ‘వ్యధాభ రిత కథా చిత్రం’ అంతటితో ముగియలేదు. తీరా దొంగ బేరాలు చేయలేక పంట పొలాల్ని పండ్లు, కాయగూరలకు మళ్లించినా వాటికీ సరైన ధరలు లేక మార్కెట్లకు ఎక్కడం లేదని బీజేపీ పాలకులు చెబు తున్నారు. ఈ సాకుతో నింపాదిగా చాప కింద నీరులా విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబడులను భారత ‘రైతుల అవసరాలను, ఆహారశుద్ధి పరిశ్రమను ఆదుకునే’ పేరిట ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ దేశం లోకి దించేశారు. కునారిల్లుతున్న వ్యవసాయ రంగం బలోపేతం కావడానికి అవసరమైన పెట్టుబడులను రైతాంగానికి దన్నుగా సమకూర్చకుండా ఆహార భద్ర తకు స్వయంగా పాలకులు కీడు చేస్తున్నారు.

విచిత్రమేమంటే, 1990ల చివరి నుంచీ వ్యవ సాయ, వాణిజ్య వ్యాపారీకరణ ముఖ్యంగా పత్తి లాంటి వాణిజ్య పంటల వైపు అవసరానికి మించిన విస్తరణకు రైతుల్ని, వ్యవ సాయాన్ని ప్రోత్సహించిన ప్రాంతాలున్నాయి. ఈ విలోమ (తారుమారు) పద్ధ తుల్లో భారత వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్ని ప్రోత్సహించిన అమెరికా తీరా నేడు చేస్తున్న విద్రో హం ఏమిటి? ప్రపంచ మార్కెట్‌కు ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య సంస్థకూ భారతదేశ ఎగుమతులు ఎక్కకుండా నిరోధిస్తూ అమెరికాలో భారత దిగుమ తులపై సుంకాలు విపరీతంగా పెంచడానికి నిర్ణయిం చింది.

మన వ్యవసాయరంగాన్ని సరళీకరించడం లేదా ‘ఉదారవాద సంస్కరణ’లను ప్రవేశపెట్టించే పేరుతో ప్రపంచ బ్యాంక్, అమెరికా ప్రోత్సాహంతో విదేశీ సరుకు దిగుమతుల కోసమే భారత మార్కెట్ల లోని కొన్ని విభాగాల్ని ధారాదత్తం చేసుకున్నాం. ఉదాహరణకు మనం వంటనూనెల్ని (ఖాద్య తైలాలు) దిగుమతి చేసుకునే ఖర్మ పట్టింది. విదేశీ దిగుమతుల పైన మనం విధించాల్సిన సుంకాలను తొలగించుకుంటున్నాం. బ్రిటిష్‌వారి పరిపాలనలో మాదిరిగా సంప్రదాయ పరిశ్రమల్ని నాశనం చేస్తున్న కారణంగా కోట్లాదిమంది దేశ ప్రజలు ఉపాధి కోల్పోయే దుస్థితిలో పడుతున్నారని గుర్తించాలి.
ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@ahoo.co.in

Advertisement
Advertisement