ద్రోహంలో ఇద్దరూ భాగస్తులే! | Sakshi
Sakshi News home page

ద్రోహంలో ఇద్దరూ భాగస్తులే!

Published Fri, Jun 1 2018 1:01 AM

Ap Vittal Guest Columns On Central And AP Governments - Sakshi

మన నూతన రాష్ట్ర అభివృద్ధి జరగకపోవడానికి, మనకు ప్రత్యేక హోదా రాకపోవడానికి, మన రాష్ట్రం అవినీతికి, అకృత్యాలకు, అధికార దాహానికి, కులమత తత్వాలకు విలయమవుతున్న పరిస్థితికి మోదీ ఎంత కారణమో, చంద్రబాబు అంతకుమించి కారణం. నిజానికి మన రాష్ట్రంలో మోదీ, బీజేపీ బలమెంత? అలాంటి మోదీకి ఈ రాష్ట్రంలో చోటు కల్పించిందెవరు? మోదీకి ఏపీలో కొత్త ఊపిరిలూది వస్తాదునుచేసి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తున్నది చంద్రబాబు కాదా? ఈ స్థితిలో రానున్న సాధారణ ఎన్నికలలో ఇటు శాసనసభ స్థానాలలోనూ, అటు పార్లమెంట్‌ స్థానాలలోనూ తెలుగుదేశం (ఏపీ)ని, బీజేపీని ఓడించటమే తెలుగు ప్రజల కర్తవ్యం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కనీసం ఆవిర్భావ దినోత్సవం కూడా లేకుండా, ఊరూపేరూ లేని అనాథగా మార్చిన ఘనత తెలుగుదేశం (వి.సి)  అధినేత చంద్రబాబుదే. ఇక్కడ తెలుగుదేశం (వి.సి) అనడంలో నా ఉద్దేశం తెలుగుదేశం (వెన్నుపోటు చంద్రబాబు) పార్టీ అనే. ఇప్పుడున్న ఏపీ అధికార పార్టీని ప్రతిసారీ చంద్రబాబు తెలుగుదేశం అనడాన్ని సులభతరం చేయడమే నా ఉద్దేశం. ఎవరెంత నటనా చాతుర్యం చూపి, గావుకేకలేసి దీన్ని ఎన్టీఆర్‌ స్థాపించిన ఒరిజినల్‌ తెలుగుదేశం అని చెప్పబూనినా అది వాస్తవం కాదు అని అందరం ఎరి గిందే. పైగా కమ్యూనిస్టుపార్టీలతో సహా అన్ని రాజ కీయ పార్టీలకు బ్రాకెట్లలో పేర్లు పెట్టి అసలు పేర్లుగా చలామణి అవడం మనమెరిగిందే కదా. పైగా తెలుగుదేశం (వి.సి) అనకుండా తెలుగుదేశం పార్టీ అని అంటే ఎన్టీఆర్‌ ఏలోకంలో ఉన్నా, నా ప్రథమ విరోధి, నా జామాత దశమగ్రహం అధీనంలో ఉన్న పార్టీని, నేను తెలుగుజాతి పట్ల భక్తిశ్రద్ధలతో స్థాపించిన పార్టీపేరుతో పిలుస్తారా అని ఆగ్రహిస్తారేమో అన్న భయం ఏమూలో నాలో దాగివుంది.

ఈ అంశానికి ఇంత ప్రాధాన్యత ఎందుకిస్తున్నానంటే నిజమైన ఎన్టీఆర్‌ అభిమానులు, ఆరాధకులు ఎవరైనా ఉంటే ఆనాడు ఎన్టీఆర్‌ తాను గెలిపించినవారితోనే చెప్పుదెబ్బలు తిన్న స్థితిని, అలా తనను అవమానించినవారి దుశ్చర్యల గురించి ఈ తరానికి కూడా స్పష్టంగా, మారు మర్చిపోలేనట్లు నిరంతరం గుర్తుచేస్తూ ఉండాలనే భావనతోనే తప్ప మరొకటి కాదు. ఇది వ్యక్తిపట్ల ద్వేషంతో రాస్తున్నది కాదు. మానవునిలో ఉండదగని అతి దుర్మార్గమైన గుణం ‘కృతఘ్నత’ పట్ల ద్వేషంతోనే అని పాఠకులు గ్రహించాలి.

జనం దేవునిగా కొలిచే ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని వెంకన్న చౌదరి అని సంబోధించి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం (వి.సి.) పార్టీ కులతత్వాన్ని బాహాటంగా ప్రదర్శించిన ఎంపీ మురళీమోహన్‌ కానీ, బ్రాహ్మణ వ్యతిరేకతతో రగిలి పోతూ, దాన్ని రగిలిస్తున్న తన పార్టీ విధానాన్ని నిర్లజ్జగా బహిర్గతం చేస్తూ, తిరుమల దేవుని ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గూర్చి ఎవడీ రమణ దీక్షితులు? బొక్కలో తోసి, పోలీసులు నాలుగు తగిలిస్తే సరి అంటూ అధికార దురహంకారాన్ని ప్రదర్శిస్తూ మంత్రి సోమిరెడ్డి అన్న సుభాషితాలను కానీ ప్రపంచమంతా నివ్వెరపోయి చూడటం తెలిసిందే. అలాగే తాను స్వయంగా దళితుడై ఉండి కూడా తోటి దళిత యువకుడిని కులంపేరుతో పరుష దూషణతో అవమానించిన ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య వంటివారందరూ బడుగు బలహీన ప్రజాసమూహాలకు సంఘం లో తగు గౌరవం, రాజకీయ ప్రాధాన్యం కల్పించిన ఎన్టీఆర్‌ అసలు తెలుగుదేశం పార్టీ వారసులు కాగలరా? అయితే వీరందరూ తర్వాత నాలుక కరుచుకుని, ఏదో నోరు జారి అన్నామనీ, ఆవేశంలో అన్నామనీ, కొడుకును మందలించినట్లు మందలించామనీ తమ తమ దుర్బాషితాలకు సంజాయిషీ చెప్తూ క్షమాపణ చెప్పారనుకోండి. 

గత నాలుగైదు ఏళ్లుగా మన రాష్ట్రంలో ఇసుక నమిలే ఇసుకాసురులు, మట్టి బొక్కే మహిమాన్వితులు, కంకరను కూడా కరకరలాడించే కాంట్రాక్టాసురులు ఇలా మానవులకు సంబంధించిన ప్రతి భౌతిక సంపదను బొక్కుతున్న పాలక దోపిడీదారులను కళ్లారా చూస్తున్నప్పుడు, అలాంటివారికి పాలనా తాళాలను అప్పచెప్పి అమాయకంగా, ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్లుగా పాలకుల వంచనాత్మక వాగ్దానాలను నమ్మి ఓటేసిన మన ప్రజలు కోల్పోయిన సంపద, సుఖసంతోషాల ముందు– ఆ‘వెం కన్న’ కోల్పోయిన ఐశ్వర్యం ఏపాటి అనిపిస్తుంది.

ఈ తెలుగుదేశం (వి.సి.) తరఫున మన ముఖ్యమంత్రి చంద్రబాబు అఖండ ‘రాజకీయ చాణక్యానికి’ ఎక్కడో ఒక మూల విరుద్ధభాసాలంకారం మాదిరి ఒకింత అభినందన కూడా లేకపోలేదు. ఎంత గుండెలు తీసిన బంటు అయితే తప్ప నాలుగు సంవత్సరాలు కేంద్రంలో మోదీ పాలనతో చెట్టపట్టాలేసుకుని హనీమూన్‌ తిరిగి, ఆయనను ఇంద్రుడు, చంద్రుడు, అవతార పురుషుడు అంటున్న నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి జంట కవుల మాదిరి ఎన్డీఏని కీర్తించిన పెద్దమనిషి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు, మోదీ హోదా వద్దు.. ఇవ్వం అంటే, అవును– మాకు హోదా ఎందుకు? వద్దే వద్దు అన్నదీ చంద్రబాబే. అంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రారంభోత్సవానికి హాజరైనప్పుడు తెచ్చిన మంచినీళ్లు, ఆ పాత్ర అవే ముద్దు అన్నది మర్చిపోయారా?  మీకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా! అది చాలు తీసుకోండి అని మోదీ గద్దిస్తే ‘అవునవును హోదావల్ల ఏం ఒరుగుతుంది? అవి పొందిన రాష్ట్రాలలో ఏం అభివృద్ధి ఉంది? (ఆయన మంత్రివర్గంలో మంత్రులు కొందరు అవి పొందిన రాష్ట్రాలలో పరిశ్రమలు స్థాపించేందుకు పరుగులు తీస్తున్నా) మాకు ప్యాకేజీనే కావాలి’ అని అనగల ఎన్నో నాలుకలున్న నాయకుడు. అంతేకాదు నరేంద్రమోదీ ముందు ఎంతో వినయంగా అణకువ ప్రదర్శించిన పెద్దమనిషి మన చంద్రబాబు. 

అయితే మన చంద్రబాబు కేవలం మోదీ భక్తుడే అనుకుంటే పొరపడతాం. ఈయన తన స్వార్థం లేకుండా ఏ నిర్ణయం తీసుకోడు. ‘హోదా’ అయితే పరిశ్రమలు పెట్టేవారు తమంతతాముగా ప్రత్యేక లాభాపేక్షతో మన రాష్ట్రానికి వస్తారు. అది లేకపోతే మన ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిం చాలి. అలా ‘ప్రత్యేకత’ చూపడంలో అమ్యామ్యాలు తదితర వ్యక్తిగత ప్రయోజనాలకు ఆస్కారం ఉంటుంది. అలాగే పోలవరం కేంద్రమే నిర్మిస్తానన్నప్పటికీ, అది మాకే ఇవ్వండి మేము నిర్మించుకుంటాం అని అర్థించి మరీ తెచ్చుకున్నారు. అదీ భోక్త హోదా కోసమే. తవ్వుకోదలచుకుంటే ‘బంగా రుగని’ అన్ని కాంట్రాక్టులలోనూ అంతో ఇంతో తమకు, తమ అనుచర గణానికి తగిన ‘వాటా’కు ఆస్కారం ఉంటుంది.

2014 ఎన్నికల్లో అవసరార్థం అవకాశవాదంతో మోదీ ఆకర్షణను వాడుకుందాం అని మోదీ ఎన్డీఏలో చేరి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ చుట్టూ ప్రదక్షిణాలు చేసి అతనితో కూడా కలిసి, చావుదప్పి కన్ను లొట్టబోయినట్లు కేవలం 1.6 శాతం ఓట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ‘అధికారాంతమునందు చూడవలెరా ఆ అయ్య సౌఖ్యముల్‌’ అన్నట్లు.. ఇంకో ఏడాదిలో సాధారణ ఎన్నికలు రానున్నాయి. ఈ నాలుగేళ్ల అనుభవంతో అటు కేంద్రంలో మోదీ పాలనపైన అంతకంటే ఎక్కువగా ఇంతవరకు ఆయన జిగ్నీ దోస్త్‌గా ఉన్న మన చంద్రబాబు అసలు రంగు, స్వార్థ దురహంకార, కుల మతతత్వ పాలక స్వభావంపై దేశ ప్రజలతోపాటు తెలుగు ప్రజలలో గ్రహింపు పెరిగింది. ప్రధానంగా వైసీపీ, వామపక్షాలు, ఇతర స్వతంత్ర ప్రజా సంస్థల కృషి వలన ప్రత్యేక హోదా పట్ల ప్రజలలో చైతన్యం పెరిగింది. ఇన్నాళ్లూ ప్రత్యేక హోదా రాక పోవడంపట్ల వారిలో, అటు మోదీ, ఇటు బాబుల తోడు దొంగల వ్యవహారం క్రమేపీ బయటపడసాగింది. ఇకనేం. ఊసరవెల్లి నుంచి (రాజకీయ) రంగులు మార్చగల చంద్రబాబు తాను ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా పోరాడుతున్న నేతగానూ, అలాగే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోవడానికి ఇన్నాళ్లు తాను ‘సహజీవనం’ నెరపిన మోదీయే అసలు దొంగ అయినట్లు– తాను ఆ మోదీ చేతిలో మోసపోయినట్లు ఫోజు పెట్టి– ఒక అవకాశవాద నాటకానికి తెరలేపారు. ఆయన భక్త బ్యాండ్‌ మీడియా చేసే భజన సారాంశం జనం చూస్తున్నదే, గ్రహిస్తున్నదే.

ఇక్కడ చివరిగా చెప్పవలసిన ప్రధానాంశం ఉంది. మన నూతన రాష్ట్ర అభివృద్ధి జరగకపోవడానికి, మనకు ప్రత్యేక హోదా రాకపోవడానికి, మన రాష్ట్రం అవినీతికి, అకృత్యాలకు, అధికార దాహానికి, కులమత తత్వాలకు విలయమవుతున్న పరిస్థితికి మోదీ ఎంత కారణమో, చంద్రబాబు అంతకుమించి కారణం. నిజానికి మన రాష్ట్రంలో మోదీ, బీజేపీ బలమెంత? అలాంటి మోదీకి ఈ రాష్ట్రంలో చోటు కల్పించిందెవరు? మోదీకి ఏపీలో కొత్త ఊపిరిలూది వస్తాదునుచేసి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తున్న బాబు నైజం అందరికీ తెలిసిందే. ఈ స్థితిలో రానున్న సాధారణ ఎన్నికలలో ఇటు శాసనసభ స్థానాలలోనూ, అటు పార్లమెంట్‌ స్థానాలలోనూ టీడీపీ (ఏపీ)ని, బీజేపీని ఓడించటమే తెలుగు ప్రజల కర్తవ్యం. ఇప్పుడు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో పెరుగుతున్న బాబు వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారానో బాబుకు మేలుచేసే యత్నం తెలుగు ప్రజలకు అన్యాయం చేసినట్లే. మోదీ, చంద్రబాబులు ఇరువురూ చేసిన ద్రోహానికి ఈ రెండు పార్టీలనూ వచ్చే ఎన్నికలలో మట్టి కరిపించాలి. ఇది కాకుండా, ‘తృతీయ ఫ్రంట్‌’ అంటూ లేదా ముక్కోణపు పోటీ అంటూ విన్యాసాలు చేస్తే అది తెలిసో తెలియకో చంద్రబాబును ఓటమి నుండి కాపాడే చర్యే అవుతుంది. ఈ కీలక ఎన్నికల వరకైనా వైఎస్సార్సీపీ గెలుపునకు దోహదపడి ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలపాలి!

డాక్టర్‌ ఏపీ విఠల్‌, వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్‌ : 98480 69720
 

Advertisement

తప్పక చదవండి

Advertisement