తెలంగాణ శతపత్రం | Sakshi
Sakshi News home page

తెలంగాణ శతపత్రం

Published Tue, Mar 6 2018 2:53 AM

Chennaiah Writes On Ramakrishna Sharma 100 Years - Sakshi

సందర్భం
శర్మ 1947 ఆగస్టు 15న చెన్నిపాడు, మానవపాడు, ఇటిక్యాలపాడు, తక్కశిల, ఉండవల్లి మొదలైన చోట్ల జాతీయ పతాకం ఎగురవేశారు. అదేకాలంలో ఆయన సంఘ సంస్కరణోద్యమం చేపట్టారు.

అతడు నిజంగానే అనేక యుద్ధములలో ఆరితేరిన వృద్ధ మూర్తి. జీవించింది ఎనభై ఏడేళ్లు. బాల్యం తప్ప, మిగిలిన 80 ఏళ్లు స్వాతంత్య్రోద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభలు, సంఘ సంస్కరణ, నిజాం వ్యతిరేక పోరాటం, ఆంధ్ర సారస్వత పరిషత్తు మొదలైన ఉద్యమాల్లో పాల్గొన్న వజ్ర సదృశ నాయల కత్వం వారిది. సాంస్కృతిక అభ్యుదయ శాఖల్లో సాంద్రతరమైన కృషితో తాను సంచరించిన తెలంగాణను వెలిగించిన ప్రతిభామూర్తి గడియారం రామకృష్ణశర్మ.

1919 మార్చి 6 న అనంతపురం జిల్లాలో ఆయన జన్మించారు. బాల్యంలోనే తెలంగాణలో ఆలంపురం వచ్చారు. ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్య సాఫీగా సాగలేదు. 4వ తరగతిలో లెక్కల్లో ఉత్తీర్ణులు కాలేకపోవడంతో ఆగిపోయింది. తెలుగు మీద విశేషమైన అభిమా నాన్ని ఏర్పరుచుకొని నవలలు, కాశీమజిలీ కథలు, ప్రబంధాలు అధ్యయనం చేశారు. ‘శ్రీపార్వతి వరపుత్రా/నీ పాదములంటి కొలుతు నిపుణత తోడన్‌/నా పాపము పోకార్పుము/ ఓపికతో నన్ను కావు ఓ కరి వదనా’ అంటూ 16 ఏళ్ల వయసులో పద్యరచన ప్రారంభించారు. పద్యపఠనానికి తగిన గొంతు ఆయనకు వాగ్దేవి వరం. వేలూరి శివరామశాస్త్రి ప్రాపకం లభించి గడియారం అనే బంగారం మెరుగుపెట్టుకొంది.

20 ఏళ్ల వయసులో ఆలంపురీ క్షేత్రాన్ని తమ కార్యక్షేత్రం చేసుకున్నారు శర్మగారు. అప్పుడే సురభి వారు అక్కడ ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం ప్రదర్శించారు.  బాగా తాగి వచ్చిన పోలీసు మొహరీల్‌ నాటకాన్ని ఆపించి గజళ్లు పాడమని రభస చేస్తే శర్మగారు తమ మిత్రులతో కలసి అడ్డుకు న్నారు. ఆ విధంగా ఆంధ్ర యువజన నాట్యమండలిని స్థాపించి పదేళ్లు తానే నిర్వహకునిగా, దర్శకునిగా, ప్రధాన పాత్రల నటునిగా  బాధ్యతలు నిర్వహించారు. ఆ సంఘటన తర్వాత గడియారం వారిని దుంపల్లి రామిరెడ్డి ఆంధ్ర మహాసభకు పరిచయం చేశారు.

మహా సభ తాలూకా కమిటీ కార్యదర్శి అయ్యారు. 1942 మే నెలలో వరంగల్లు సమీ పంలోని ధర్మవరంలో నవమ ఆంధ్ర మహాసభ, 1943 మే నెలలో హైదరాబాద్‌ రెడ్డి హాస్టలులో దశమాంధ్ర మహాసభలు జరిగాయి. అప్ప టికే ఆంధ్ర మహాసభలు రాజకీయ అంశాలకు ప్రాధాన్య మిస్తూ సాంస్కృతిక వికాసాన్ని విస్మరించినట్లు నాయ కులు భావించారు. దశ మాంధ్ర మహాసభరోజే అంటే 1943 మే 26న రెడ్డి హాస్టల్‌లోనే ‘నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు’ ప్రారంభమైంది. ఆ తర్వాత ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ‘తెలంగాణ సారస్వత పరిషత్తు’గా మారింది.

గడియారం స్టేట్‌ కాంగ్రెస్‌ సభ్యునిగా నిజాం వ్యతిరేక పోరాటంలోనూ, దేశ స్వాతంత్య్రోద్యమంలోనూ ఏకకాలంలో పాల్గొన్నారు. స్టేట్‌ కాంగ్రెస్‌ కార్యాచరణ సమితి ఆదేశాల ప్రకారం నిజాం ప్రభుత్వానికి వ్యతిరే కంగా వార్తా బులెటిన్లు విడుదల చేస్తూ ‘భాగ్యనగర్‌ రేడియోను’ ప్రారంభించారు. అప్పుడు నిజాం ప్రభు త్వం దక్కన్‌ రేడియో నిర్వహించేది. శర్మ 1947 ఆగస్టు 15న చెన్నిపాడు, మానవపాడు, ఇటిక్యాలపాడు, తక్క శిల, ఉండవల్లి మొదలైన చోట్ల జాతీయ పతాకం ఎగుర వేశారు. అదేకాలంలో ఆయన సంఘసంస్కరణోద్యమం చేపట్టారు. కొన్ని వితంతు పునర్వివాహాలు చేయించ డమే గాక స్వయంగా వితంతువును వివాహం చేసుకు న్నారు. కుల బహిష్కార దండనను ధైర్యంగా ఎదుర్కొని నిలిచారు.

1953 సంవత్సరంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆలంపురంలో సప్తమ మహాసభలు జరుపుకున్నది. 30 వేల మంది పాల్గొనడం ఒక రికార్డు. ఆనాటి అధ్యక్షుడు దేవులపల్లి రామానుజరావు, కార్యదర్శి రామకృష్ణశర్మ. ముఖ్యఅతిథి ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కూడా తప్పనిసరై పాల్గొనవలసి వచ్చింది. శ్రీ శ్రీ సహా దిగ్దంతులెందరో పాల్గొన్నారు.

కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని అక్కడే ఆవిష్కరిం చారు. విశ్వనాథ స్నాతకోపన్యాసం చేశారు. సురవరం ప్రతాపరెడ్డి గారి సహకారంతో పి.ఎన్‌. శర్మ ప్రారం భించిన ‘సుజాత’ పత్రిక మూడేండ్లు నడిచి ఆగిపోయింది. 1953లో గడి యారం దాన్ని తిరిగి ప్రారంభించి మూడేళ్లపాటు నడిపారు. ఆరవ తర గతిలో చదువుకు స్వస్తి చెప్పిన శర్మ శాసన శాస్త్రానికి సంబంధించిన ఆంగ్ల గ్రంథాలను పఠిం చడం కోసం ఆంగ్లం నేర్చుకున్నారు. ఆలంపురంలోని దాదాపు అన్ని శాసనాలకు పాఠాలు తయారు చేశారు.

లక్ష్మణరాయ పరిశోధక మండలిలో వున్న శాసన ప్రతి కృతులను చదివి ‘తెలంగాణ శాసనాల రెండో భాగానికి సంపాదకత్వం వహించారు. మంచన ‘కేయూర బాహు చరిత్ర’, కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’లను పరిష్కరించి విపుల పీఠికలు రాశారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యునిగా, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘ సభ్యునిగా పనిచేశారు.

ఆయన 1954 నుండి 30 సంవత్సరాల పాటు ఆలంపూరు దేవస్థాన ధర్మకర్తల సంఘానికి అధ్యక్షుడు. అప్పటి పురావస్తుశాఖ డైరెక్టర్‌ పుట్టపర్తి శ్రీనివాసా చార్యుల సహకారంతో ఆలంపురంలో ఒక మ్యూజియం ప్రారంభించారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీ వనం కోసం యావజ్జీవితం పాటుపడిన రామకృష్ణ శర్మ 99వ జయంతి సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్తు మంగళవారం సభ నిర్వహిస్తున్నది. (రామకృష్ణ శర్మ శతజయంత్యుత్సవాల సందర్భంగా)

వ్యాసకర్త సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం పీఆర్‌వో
డా.జె.చెన్నయ్య

Advertisement
Advertisement