వలస కార్మికుల కన్నీళ్లు తుడుస్తున్న ఏపీ ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

వలస కార్మికుల కన్నీళ్లు తుడుస్తున్న ఏపీ ప్రభుత్వం

Published Wed, May 20 2020 12:25 AM

Gautham Reddy Article On AP Government Help To Migrant Workers - Sakshi

కోవిడ్‌–19 ఉపద్రవాన్ని నియం త్రించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ వలస కార్మికుల విషయంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. ఉన్న ఊర్లో పనుల్లేక పొట్ట చేతబట్టుకుని తమది కాని దూర ప్రాంతాలలో పనిచేసుకుని పొట్ట నింపుకునేందుకు వెళ్లిన వారికి కరోనా మహమ్మారి అక్కడ కూడా పనిలేకుండా చేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మన ఇంటికి మనం వెళ్లి, అయినవాళ్ల మధ్య గడిపితే చాలనుకునే విధంగా చేసింది. అయితే ఎక్కడివ క్కడ రవాణా సౌకర్యాలు ఆగిపోవడం వారిని గందరగోళంలోకి నెట్టి వేసింది.

ఇటు పనులు లేకా, అటు పోవడానికి వాహనాలు లేకా వారిని కాలిబాట పట్టేలా చేసింది. వేలాది మంది వందలకొద్దీ కిలోమీటర్లు నడిచి వెళ్తున్న దృశ్యం చూపరుల గుండెలను తరుక్కు పోయేలా చేసింది. వారి పాదాల నెత్తుటితో తడిసి రోడ్లు ఎరుపెక్కాయి. ఇందులో యువకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గర్భిణులు ఉన్నారు, నెలల బిడ్డను చంకన ఎత్తుకొని పోతున్న తల్లులు ఉన్నారు, ఊళ్లో క్షేమ సమాచారం తెలియని తండ్రులు ఉన్నారు, మండుటెండలో నెత్తిన బండెడు మూటలు పెట్టుకుని నడుస్తున్న దంపతులు ఉన్నారు. ఒకరు ఎక్కడో తమిళనాడు నుంచి పట్నా పోవాలి. మరొకరు ఎక్కడినుంచో ఒడిశాకి రావాలి. పగవాడికి కూడా రాకూడని కష్టం!

ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికుల వెతలను చెవికెక్కించుకోవడం హర్షింపదగ్గ విషయం. వివిధ వృత్తుల్లో పనిచేస్తూ వేర్వేరు రాష్ట్రాల్లో స్థిరపడిన వారు కూడా స్వంత రాష్ట్రానికి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం బక్కచిక్కిన వలస కార్మికుల గోడుపైనే దృష్టి పెట్టింది. నిన్నమొన్నటి వరకూ దశలవారీగా మత్స్యకారులు, ఇతర వృత్తుల వారిని రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రభుత్వ చర్యలు వలస కూలీలకు ఎడారిలో ఒయాసిస్సులా ఆశలు రేపాయి. ఇందులో కొందరు పాదాలకు చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్తుండటం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హృదయాన్ని కలచివేసింది.
 

మానవత్వాన్ని చూపించాల్సిన సమయం ఇదే అని ఆయన గుర్తించారు. అదే అధికారులను ఆదేశించారు. నడిచి వెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ తారసపడ్డా  వారిని బస్సులో ఎక్కించి,  రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలి. వారి పట్ల ఉదారంగా ఉండాలి.  భోజనం, తాగునీరు ఏర్పాటు చేయాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రిలీఫ్‌ క్యాంపులు నెలకొల్పి కూలీలు సేద తీర్చేందుకు  ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో దేశంలోని బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, జార్ఖండ్, అసోం, మణిపూర్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లాంటి ఎన్నో రాష్ట్రాలకు చెందిన  వారు ఉన్నారు. 

కార్మికులకు సంబంధించి ప్రభుత్వ స్పందన రెండు రకాలు. బయటి రాష్ట్రాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ వారిని సురక్షితంగా ఇక్కడికి రప్పించడం, ఇక్కడ చిక్కుబడి పోయిన వివిధ రాష్ట్రాల వారిని వారి స్వస్థలాలకు తరలించడం. అయితే అక్కడి నుండి ఇక్కడకు, ఇక్కడి నుంచి అక్కడకు రావడానికి, పోవడానికి అవసరమైన ఏర్పాట్లు లేకపోయినప్పటికీ అందరూ మూకుమ్మడిగా ఎగబడటం, కరోనా అంటువ్యాధి కావడంతో ముఖ్యమంత్రి అప్రమత్తమై, అధికారుల్ని మేల్కొల్పారు.

ముందుగా వలస కార్మికులను ఆంధ్రరాష్ట్రంలోకి వచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించారు. ఇప్పుడు ఏకంగా వలస కార్మికులు మన రాష్ట్రానికి రావాలన్నా, మన రాష్ట్రానికి వలస వచ్చిన ఇతర రాష్ట్రాల కార్మికులు వారివారి ప్రాంతాలకు వెళ్లాలన్నా ఎవరి కాళ్లావేళ్లా పడాల్సిన పనిలేకుండా నేరుగా స్పందన వెబ్‌ సైట్‌లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఇది వలస కార్మికులకు మరింత భరోసానిచ్చే విధంగా ఉంది. 

వాస్తవానికి ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఎక్కడికి వెళ్లి, ఎవరిని కలవాలి...ఇందులో రాజకీయ పైరవీల వంటివి ఉంటాయా... అనేది తెలియని వాళ్లు అక్షరం ముక్క రాక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడా పరిస్థితి నుండి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వలస కార్మికులకు విముక్తి కల్పిం చారు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే సంబంధిత కార్మిక శాఖ కార్యాలయానికిగానీ, లేదా ఎవరితోనైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తుగానీ చేసుకుంటే వారి అభ్యర్థనను పరిశీలించి వారికి న్యాయం జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఒక ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమించి కంట్రోల్‌ రూమ్‌లో 24/7 పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇది నిజంగా ప్రభుత్వానికి కార్మికుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమనే చెప్పాలి.

అలాగే క్వారంటైన్‌కు వెళ్లేవారికి రూ. 2 వేలు, మంచి పౌష్టికాహారం, మంచి పండ్లతో కిట్‌ ఇవ్వడం మరో ఎత్తు. ఇది పాలకులకు ప్రజల పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ రాష్ట్రం నుండి మొత్తం 12,794 మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసేందుకు వెళ్లారు. వారిలో అత్యధికంగా 2,062 మంది ఉత్తరప్రదేశ్‌కు, 1,110 మంది బిహార్‌కు, 1,086 మంది తెలంగాణకు, 822 మంది కర్ణాటకకు, వివిధ పనుల నిమిత్తం వలస వెళ్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఇంతకుమించే ఈ వలస కూలీల సంఖ్య ఉంటుందని అనధికారిక అంచనా. వీరందరినీ కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని  ఏర్పాట్లు చేశారు.

ఇక ఇతర రాష్ట్రాల వలస కూలీలకు అందిస్తున్న భోజనం, వసతి, వారికోసం ఏర్పాటు చేసిన శ్రామిక రైళ్లు, ఆర్టీసీ బస్సులు, అందులో వారి తరలింపునకు అయ్యే ఖర్చు మొత్తం మానవతా దృక్పథంతో ప్రభుత్వమే భరిస్తోంది. ఈ చర్యలు చేపట్టడం వల్ల రాష్ట్రం మీదుగా నడిచి వెళ్తున్న వలస కూలీల సంఖ్య బాగా తగ్గిందని కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ చైర్మన్‌ కృష్ణబాబు చెబుతున్నారు. ఇప్పటి వరకు 31 రైళ్లలో 36,823 మందిని వారి రాష్ట్రాలకు పంపించారు. రాష్ట్రంలోనే వేర్వేరు జిల్లాలకు చెందిన 1,09,742 మందిని వారి వారి స్వస్థలాలకు పంపించారు. కార్మికుల వెతలకు గుండె కరిగే జగన్‌ లాంటి ముఖ్యమంత్రి చర్యలు ఆదర్శనీయం, ఆచరణీయం.
వ్యాసకర్త: గౌతమ్‌ రెడ్డి, వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు

మొబైల్‌ : 98481 05455

Advertisement

తప్పక చదవండి

Advertisement