ఉల్లిపాయ–ఉక్కు మనిషి | Sakshi
Sakshi News home page

ఉల్లిపాయ–ఉక్కు మనిషి

Published Thu, Nov 15 2018 12:31 AM

Gollapudi Maruthi Rao Article On Sardar Vallabhbhai Patel Statue - Sakshi

ఉల్లిపాయకీ ఉక్కుమనిషికీ దగ్గర సంబంధం ఉన్నదని చెప్పడం తాటిచెట్టుకీ తాత పిల కకీ ముడిపెట్టడం అని చాలామందికి అనిపించవచ్చు. ముఖ్యంగా మన దేశంలో ఉల్లిపాయని చిన్నచూపు చూడటానికి వీలు లేదని అనుభవజ్ఞులకు ఈపాటికే అర్ధమయివుంటుంది. నిజానికి ఉల్లిపాయని ‘రాజకీయ’ ఆయు ధంగా మనం గుర్తించాలి. 1998లో ఉల్లిపాయ బిజేపీ ప్రభుత్వాన్ని అల్లల్లాడించింది. ఈ సందర్భంగా రెండు జోకులు గుర్తుచేసుకోవాలి. ఆ రోజుల్లో ఢిల్లీలో ఉల్లిపాయ ధర కిలో 60 రూపాయలు కాగా, ఒక వ్యాపారి ఒక కిలో ఉల్లిపాయ కొన్నవారికి రెండు టీ–షర్టులు ఉచితమని ప్రకటించాడట! గ్రేటర్‌ కైలాష్‌లో దొంగలు ఒక ఇంట్లో దొంగతనానికి వచ్చారు. 500 రూపాయలు దోచుకుని బొత్తిగా ఇంట్లో ఏమి విలువైన వస్తువులు ఉంచనందుకు యజమానిని హింసించబోయి–5 కిలోల ఉల్లిపాయలు చూశారట. తృప్తిపడి ఉల్లిపాయ సంచీతో వారు నిష్క్రమించారట! 

అలనాడు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారు తమ రాష్ట్రంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని నిర్మించడానికి నిర్ణయించారు. ప్రపంచంలోకెల్లా ఎల్తైన ఈ విగ్రహాన్ని ప్రధానిగా మొన్న ఆవిష్కరిం చారు. కేవలం 33 నెలలలో నిర్మితమైన ఈ విగ్రహం 2,989 కోట్ల ఖర్చుతో నిర్మితమైంది. ఈ స్ఫూర్తితోనే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ మొన్న సరయు నదీతీరాన 151 మీటర్ల ఎత్తున శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మింపజేయనున్నట్టు ప్రకటించారు.  ఇంతకూ ఉల్లిపాయకీ పటేల్‌గారికీ ఏం సంబంధం? పటేల్‌గారు ‘ఐరన్‌ మాన్‌’ మాత్రమే కాక ‘ఆనియన్‌ మాన్‌’ అని ఒకానొక పత్రికలో పేర్కొన్నారు. రెజినాల్డ్‌ రేనాల్డ్స్‌ అనే గాంధీజీ అనుయాయుడు సబర్మతి ఆశ్రమంలో తన అనుభవాల గురించి ఒక పుస్తకాన్ని (టు లివ్‌ ఇన్‌ మాన్‌కైండ్‌) రాశారు. ఒకసారి ఎవరో ఆశ్రమానికి కూరగాయల సంభారాన్ని బహుకరించారట. అందులో ఉల్లిపాయలున్నాయి. ఉల్లిపాయలు బ్రహ్మచారులకు నిషిద్ధం–అవి రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి కనుక

. ఆశ్రమంలో ఉన్న మరో బ్రిటిష్‌ అనుయాయురాలు మిరాబెన్‌–అందరికన్నా చాదస్తురాలు. ఈ ఉల్లిపాయలని వెంటనే నిషేధించాలని అన్నారట. కాని పటేల్‌ గారు ‘‘ఉండనీయండి. నేనూ రెజినాల్డ్‌ ఈ ఉల్లిపాయల్ని తింటాం’’ అన్నారట. వీరిద్దరూ నరభక్షణ చేస్తున్నట్టు అందరూ నిర్ఘాంతపోయి చూస్తుండగా వీరు భుజించారట. తరు వాత తరువాత గాంధీజీ ఉల్లిపాయ ఉపకారాన్ని గ్రహిం చారు. ముఖ్యంగా వెల్లుల్లిపాయ చేసే మేలుని ఆయన గుర్తించారు.  కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలకు అనుగుణంగా పటేల్‌ తన కర్తవ్యాన్ని మలుచుకోవడానికి ఈ సందర్భం ఒక గుర్తుగా నిలుస్తుంది. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సమైక్య భారత స్థాపనకు–ఆస్థానాల విలీనానికి అప్పటి వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యమించిన ఉక్కుమనిషి కర్తవ్య మూలాలు ఇలాంటి సందర్భాలలో కనిపిస్తాయి. ఒకే ఒక సంస్థాన విలీనానికి నెహ్రూగారు తలదూర్చారు–కశ్మీర్‌. ఆ సమస్య ఇప్పటికీ రావణకాష్టంలాగా రాజుకుం టూనే ఉంది.

మరొక సంస్థానంలో నెహ్రూ కలగజేసుకోబోయారు–హైదరాబాదు. అదృష్టవశాత్తూ పటేల్‌ ఆయన్ని దృష్టి మళ్లించి పోలీసు యాక్షన్‌ జరిపించారు. లేకపోతే దక్షిణాన మరో కాష్టం ఈనాటికీ రాజు కుంటూ ఉండేది. మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి వచ్చి–అక్కడ ఆచరించిన సత్యాగ్రహాన్ని మన దేశంలో అమలు జరపాలనుకున్నప్పుడు–1918లో ఖేడాలో–గ్రామీణులని మేల్కొల్పడానికి పటేల్‌ ఉల్లిపాయను గాంధీగారికి తీసుకువచ్చారట. ఆ ప్రాంతంలో ఉల్లి రైతులకు జీవనాధారం. అయితే పంటలు పండకపోయినా రైతులు శిస్తుకట్టాల్సిందేనని బ్రిటిష్‌ ప్రభుత్వం పట్టుబట్టారు. అప్పటి స్థానిక కలెక్టరు ఫెడిరిక్‌ ప్రాట్‌ బ్రిటిష్‌ ఆదాయానికి ఆటపట్టు ఉల్లి పంటల భూముల శిస్తు అని గాంధీకి హెచ్చరించి చెప్పారట. అప్పుడే పాలకవర్గాన్ని గద్దె దించేది ‘ఉల్లిపాయ’ అని గాంధీజీ గ్రహించారు. దండి యాత్రలో కూడా గాంధీజీ ‘బ్రిటిష్‌ వారి జులుంకి మనం తలవొంచం. అవసరమైతే ఉల్లిపాయలు కారణంగా వెయ్యిసార్లు జైలుకి వెళ్తాం’’ అన్నారట.  

ఈవిధంగా పటేల్‌ గారి ప్రమేయంతో, స్ఫూర్తితో–సామాన్య రైతు జీవనాన్ని, తద్వారా ప్రజానీకానికంతటికీ వినియోగపడే ఉల్లిపాయ ‘జాతీయో ద్యమం’లో భాగమైనది అంటే పరోక్షంగా ‘ఉప్పు’ సత్యాగ్రహంలో ‘ఉల్లి’ సత్యాగ్రహం భాగమన్నమాట. నాకనిపిస్తుంది–ఇదంతా వింటున్నప్పుడు–కొద్దిలో తప్పిపోయింది కానీ–అది ప్రపంచ ప్రఖ్యాత ‘‘ఉప్పు–ఉల్లి సత్యాగ్రహం’’ అయ్యేదని.  ఆవిధంగా 1998లో ఉల్లిపాయకీ అప్పటి ప్రభుత్వానికీ, 1918లో ఉల్లిపాయకీ బ్రిటిష్‌ ప్రభుత్వానికీ సంబంధించిన ‘చరిత్ర’ ఉన్నది. మొదటి చరిత్రకి మూలపురుషుడు–సామాన్య ప్రజానీకం అవసరాలను తీర్చి, ప్రతీక్షణం వారి జీవికకు ఆసరాగా నిలిచే ప్రాణ ధాతువుని పట్టుకున్న ఘనుడు–నేడు ప్రపంచంలో అందరికన్నా ఎత్తుగా నిలిచిన ఉక్కుమనిషి–సర్దార్‌ పటేల్‌.

గొల్లపూడి మారుతీరావు

Advertisement
Advertisement