చెప్పేదొకటి, చేసేదొకటి అంటే ఇదే! | Sakshi
Sakshi News home page

చెప్పేదొకటి, చేసేదొకటి అంటే ఇదే!

Published Sun, Nov 26 2017 2:42 AM

Karan Thapar writes on Kashmir issue - Sakshi

కశ్మీర్‌ గురించి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చెబుతున్నదానికి, వారు వ్యవహరిస్తున్నదానికి మధ్య తేడా ఉందా? నా అనుమానాలు నాకు ఉన్నప్పటికీ నిజాయితీతో కూడిన సమాధానం ఏమిటంటే నాకు తెలీదు అన్నదే. కాబట్టి ఈ సమస్యను మరింత నిశితంగా పరిశీలిద్దాం. వాస్తవానికి కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌ అంశంపై కాస్త మృదువుగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి ఒకటి లేదా రెండు ఉదాహరణలను మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. కానీ, అవి తెచ్చిన ఫలితాలేమిటి అని పరిశీలిస్తే మీరు ఆశ్చర్యపోతారని నేను పందెం కాస్తాను.

మొదటగా, స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, ‘కశ్మీరీలను కౌగలించుకోవడమే తప్ప వారిని కాల్చివేయడం లేక నిందించడం’ సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శ్రీనగర్‌లో మాట్లాడుతూ ‘ఎవరితో మాట్లాడటానికైనా’ తాను సిద్ధంగా ఉన్నానని, కశ్మీరీల ‘మనోభావాలకు వ్యతిరేకంగా’ తాను వ్యవహరించబోనని వాగ్దానం చేశారు. ‘అవసరమైనట్లయితే, సంవత్సరానికి 50 సార్లు’ కూడా కశ్మీర్‌ను సందర్శిస్తానని ఆయన చెప్పారు.

ఈ నెలలో రాజ్‌నాథ్‌ సింగ్‌ మరింత ముందుకెళ్లారు. కశ్మీర్‌లో రాళ్లు విసిరి అరెస్టయిన పిల్లలను జైళ్ల నుంచి రిమాండ్‌ హోమ్‌లకు మార్చాలని వారి కేసులను సానుభూతితో పరిశీలించాలని కోరి నట్లు చెప్పారు. రాళ్లు విసిరిన వారికి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించవచ్చని,  తొలిసారి రాళ్లు విసిరి నేరం చేసిన వారిపై కేసులను ఉపసంహరించవచ్చని నవంబర్‌ 21న మీడియా పేర్కొంది కూడా. కానీ ఇవన్నీ పత్రికా ప్రకటనలు మాత్రమే అయినప్పటికీ, వీటిని కీలకమైనవిగానే భావించాలి. నిజాయితీతో కూడినవిగానే కాకుండా అవి కృతనిశ్చయాన్నే సూచిస్తున్నాయి.

అయితే వీటిలో అద్భుతమైన వాగ్దానం ఎవరినీ పెద్దగా ఆకర్షించలేదు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హురియత్‌తో మాట్లాడతారా అని మీడియా నవంబర్‌ 17న సంధించిన ప్రశ్నకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ అవునని నిర్ధారించడమే కాకుండా కశ్మీరీలతో ‘ఎలాంటి దాపరికం లేకుండా, బేషరతుగా సంభాషిస్తామని’ స్పష్టం చేశారు. నిజానికి ఇది గత సంవత్సరం ఆగస్టు నెలలో రామ్‌ మాధవ్‌ చెప్పిన దానికి ప్రతిధ్వని మాత్రమే. అప్పట్లో, తమ ప్రభుత్వం ‘కశ్మీర్‌ లోయలోని అన్ని సామాజిక వర్గాలతో చర్చించడానికి,’  సిద్ధంగా ఉందని, కశ్మీరీలు ‘భారత రాజ్యాంగం పరిధిలో చంద్రుణ్ణి కూడా అడగవచ్చని’ రామ్‌ మాధవ్‌ చెప్పారు.
ఈ వ్యాఖ్యానాలన్నీ పైపైన, యాదృచ్ఛికంగా చేసినవిగా ఎవరూ కొట్టిపడేయలేరు. ఇవి బాధ్యతాయుత స్థానాల్లోని వ్యక్తులు చెప్పినవి. పైగా ఇవి స్థిరమైన గొలుసుకట్టు రూపంలో స్పష్టంగా, పదేపదే తరచుగా చేసిన ప్రకటనలు. కాబట్టి సహజంగానే ఈ వ్యాఖ్యలు తప్పకుండా కీలక మార్పులకు దారితీస్తాయని ఎవరైనా భావిస్తారు. కాని అలా మార్పులు చోటు చేసుకోకపోతే, కచ్చితంగా ప్రారంభంలో నేను సంధించిన ప్రశ్నే చెల్లుబాటవుతుంది.

ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రధాని కేవలం మాటల్లో వాటిని పునరావృతం చేయడానికి ముందుగా, 2016 ఆగస్టులో రామ్‌ మాధవ్‌ చేసిన వాగ్దానాలు సంవత్సరం పాటు విస్మరణకు గురయ్యాయి. నిస్సందేహంగానే కేబినెట్‌ స్థాయి కలిగిన ప్రత్యేక ప్రతినిధిని నియమించారు కానీ, హురియత్‌తో మాట్లాడటానికి అతడు ఇంతవరకు ఎలాంటి విశ్వసనీయ ప్రయత్నం కూడా చేయలేదు. ప్రకటించిన మేరకు చర్చలకు ఎలాంటి ముందస్తు షరతులు ఉండవు. భారత్‌లో విలీనం సమయంలో కశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించేటటువంటి సంస్కరణలను భారత్‌ పరిగణించాల్సి ఉందని చిదంబరం ప్రకటించిన వైఖరిని ప్రధాని మోదీ గుచ్చి చెప్పినట్లుగా కశ్మీరీలు చంద్రుణ్ణి కూడా కోరవచ్చు. కానీ అమలు కోసం కాకుండా ప్రభావం కలిగించడానికే ఈ మాటల్ని చెప్పినట్లు ధ్వనిస్తోంది.
 
కాబట్టి సరైన విషయాలను ఎలా చెప్పాలో బీజేపీకి బాగా తెలుసు కానీ, వాటిని అమలు చేయకపోవచ్చు లేదా మెల్లగా అమలు చేయవచ్చునని మీరు ఇప్పటికే అభిప్రాయానికి వచ్చేశారు కదా? పనిలోపనిగా ఆర్టికల్‌ 35 (ఎ), 370లను ఎత్తేయడం లేక సైనిక కాలనీలను నిర్మించడం గురించి కూడా మాట్లాడవచ్చు. అయితే ఇదంతా కశ్మీరీలను తిరిగి నమ్మించడానికి కాకుండా రెచ్చగొట్టడానికి ఉద్దేశించినది కావచ్చు.
 
నేను ముందే చెప్పినట్లుగా, కశ్మీర్‌పై బీజేపీ, కేంద్రప్రభుత్వం చెబుతున్న దానికి, చేస్తున్న దానికి సంబంధం ఉండకపోవచ్చని నాకు కచ్చితంగా తెలీదు కానీ ఇవన్నీ అదే అర్థాన్ని సూచిస్తున్నాయి. అయితే నాకు స్పష్టంగా బోధపడింది ఏమిటంటే బీజేపీ, కేంద్ర ప్రభుత్వ ఆలోచనల్లోనే ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. తాము చెబుతున్నది ఏమిటో వారు గుర్తించక పోవచ్చు లేక తమ ప్రకటనలను కార్యరూపంలో పెట్టాలని వారు భావించక పోవచ్చు. ఇదంతా వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే నిర్ధారణను మీలో కలిగించినట్లయితే మీతో నేను విభేదించాల్సిన అవసరం లేదు.


- కరణ్‌ థాపర్‌

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : karanthapar@itvindia.net

Advertisement
Advertisement