రాహుల్‌ ప్రకటన దుస్సాహసమే | Sakshi
Sakshi News home page

Published Sat, May 12 2018 3:16 AM

Pentapati Pulla Rao Political Comment On Rahul Gandhi - Sakshi

బెంగళూరులో మే 8న ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవిస్తే ప్రధాని పదవికి తానే బరిలో ఉండవచ్చని చెప్పారు. ఇది సంచలన ప్రకటన అయింది. తాను ప్రధానిగా కావచ్చని రాహుల్‌ చెప్పారు. భారత్‌లో ఏ రాజకీయ నేత, వాణిజ్యవేత్త కూడా తనకు అధికారం లేదా డబ్బు కావాలని కోరుకునేవారు కాదు. కానీ రోజులు మారుతున్నాయి కనుక భారతీ యులు ఇప్పుడు సంపద ప్రదర్శనకు సీట్ల కొనుగోలు పట్ల ఉత్సాహం చూపుతున్నారు.

తాను ప్రధాని కావాలని అనుకుంటున్నానని రాహుల్‌ చెప్పడానికి ఆయనపై ఒత్తిళ్లు పనిచేసి ఉంటాయి. కర్ణాటక ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినా ప్రధాని కావాలనుందని రాహుల్‌ చేసిన ప్రకటనకు ఎలాంటి ఫలితాలూ చేకూరవు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందితే ఇతర పార్టీలు రాహుల్‌ ముందు మోకరిల్లుతాయని కాదు. ఎందుకంటే..

1. మమతా నేతృత్వంలో కూడిన ప్రాంతీయ పార్టీలు తాము రాహుల్‌ నాయకత్వాన్ని అనుసరించబోమని చెప్పాయి. కొన్ని నెలల క్రితం రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ, మాయావతితో సహా ప్రాంతీయ పార్టీ నేతలు ఎవరూ ఆయనకు సెల్యూట్‌ చేయలేదు. ఎందుకంటే ఎంపీల సంఖ్యరీత్యా చూస్తే ప్రాంతీయ పార్టీలు పెద్దవి, కాంగ్రెస్‌ పార్టీ చిన్నది. అందుకే రాహుల్‌ని ప్రాంతీయ పార్టీలు గొప్ప నేతగా చూడటం లేదు.

2. ప్రధాని పదవి చేపట్టడానికి తాను సిద్ధమని ముందే ప్రకటించకపోతే ఇతర ప్రాంతీయ నేతలు పోటీలో ముందుకొస్తారని రాహుల్‌ భావిస్తున్నారు. మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌ ప్రధాని కావడానికి విస్తృత ఆమోదం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సైతం జాతీయ ఆకాంక్షలను వ్యక్తీకరిస్తున్నారు. ఇక ఇతర ప్రాంతీయ పార్టీలైన వైఎస్‌ఆర్‌ సీపీ, టీడీపీ, తెరాస, దేవెగౌడ జనతాదళ్, మాయావతి, చివరకు అఖిలేష్‌ యాదవ్‌ కూడా వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నాయకత్వ స్థానాన్ని చేపట్టాలని చెప్పడం లేదు. కాంగ్రెస్‌ మళ్లీ ప్రధాని పదవిని చేపడితే తమ తమ పార్టీలకు నష్టం చేకూరుతుందని ఈ నేతలంతా భావిస్తున్నారు. దేవెగౌడ వంటి  వివాదరహిత నాయకులు కేంద్రప్రభుత్వ అధినేతగా ఉండాలని వీరు కోరుకుంటున్నారు.

3. కాంగ్రెస్‌ పార్టీ 2019లో ప్రధాని పదవిని చేపట్టలేకపోతే తన పార్టీ, తన కుటుంబం అధికారానికి పదేళ్లు దూరంగా ఉండాల్సి వస్తుందని రాహుల్‌కి స్పష్టంగానే తెలుసు. అంటే మీడియాపై, బ్యూరోక్రసీపై, రిటైర్డ్‌ అధికారులపై, మేధావులపై, ప్రభావిత శక్తులపై, అభిప్రాయాలు మలచగలవారిపై, స్వార్థ ప్రయోజన శక్తులపై తమ ఆజమాయిషీని కోల్పోవలసి వస్తుంది. జనం కూడా తన వెంట ఉండరు.

4. రాహుల్‌ ప్రధాని పదవికి రెడీ అని చెప్పడం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన ప్రక్రియ రెండింటికీ లంకె ఉంది. అధికారానికి సిద్ధం అన్న వెంటనే రాజకీయ నేతలు, అధికారం పట్ల వ్యామోహం ఉన్నవాళ్లు వెంటనే రాహుల్‌కి మద్దతు పలుకుతారు. కాంగ్రెస్‌ అధికారంలోకివస్తే మీడీయా, న్యాయవ్యవస్థ సైతం అప్రమత్తమవుతాయి. ఎందుకంటే చీఫ్‌ జస్టిస్‌ మీదే అభిశంసన ప్రతిపాదించినవారు మామూలు జడ్జీలపై దాన్ని మోపలేరా?

5. ప్రధానిగా తాను అధికారం చేపడతానని ప్రకటించిన వెంటనే వ్యాపార వర్గం కూడా రాహుల్‌కి మద్దతిచ్చే అవకాశముంది. రాజకీయనేత అధికారం కోల్పోయినప్పుడు సంపన్నులు వారికి దూరం జరుగుతారు. ఆ నేతలు మళ్లీ అధికారంలోకి రానున్నట్లు సూచనలు రాగానే బిలబిలమంటూ వచ్చి విరాళాలు ఇస్తారు కూడా. మీడియా యజమానులు సైతం బీజేపీకి వల్లమాలిన మద్దతునివ్వడం తగ్గించి కాస్త జాగ్రత్తగా ఉంటారు.

6. కాంగ్రెస్‌ క్షీణిస్తున్నట్లు కనబడగానే పార్టీలోని పలువురు నేతలు గెంతేయ్యాలని కోరుకుంటారు. ఇప్పటికే ఏపీలో, బెంగాల్‌లో, ఒడిశాలో తమకు ఏ పదవీ లేనిచోట కాంగ్రెస్‌కు వారు ఇంకా ఎందుకు అట్టిపెట్టుకోవాలి? 2019లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నాయకత్వం ప్రకటించడం ద్వారా పార్టీ మారే ఉద్దేశం ఉన్నవారిని నిలిపి ఉంచవచ్చు.భారత్‌లో ఏ ప్రజాస్వామ్య నేతా తనకు ప్రధాని కావాలని ఉందని ప్రకటించుకోలేదు. తాను ప్రపంచాన్ని జయిస్తానని 2400 ఏళ్ల క్రితం అలెగ్జాండర్‌ ప్రకటించాడు. గ్రీస్‌కు అవతలి ప్రపంచాన్ని లూటీ చేసుకోవచ్చన్న సందేశాన్ని తన సైనికులకు ఇవ్వడానికే అలా ప్రకటించాడు.

జర్మన్‌ జాతికి తగిన భూ ప్రాంతం కోసం రష్యాను జయిస్తానని హిట్లర్‌ ప్రకటించాడు. మరోవైపు మహాత్మాగాంధీ తనకు ఏ పదవీ వద్దన్నారు. తాను రాజ్యాంగాన్ని రచిస్తానని అంబేడ్కర్‌ ఏ కోశానా ఊహించలేదు. మహనీయ గౌతమ బుద్దుడు విలాసాలనూ, అధికారాన్ని కూడా తృణప్రాయంగా త్యజించాడు. ఇన్ని ఉదాహరణల మధ్య  రాహుల్‌ దుస్సాహసికంగానో లేక తప్పుగానో ప్రధాని పదవిపై అలాంటి ప్రకటన చేసి పడేశారు.రాహుల్‌ ప్రకటన చేసిన వెంటనే ప్రతిపక్ష నేతలతోపాటు భారతీయ యువతలో ఒక వర్గం ఆగ్రహావేశాలు ప్రదర్శించింది.

తన బలం పెద్దగా లేకున్నప్పటికీ రాహుల్‌ ప్రధాని పదవిని ఎలా ఆశిస్తారని ప్రతి పక్షాలు ఆగ్రహిస్తే, రాజరిక, వారసత్వ రాజకీయాలు ఇంకానా ఇకపై చెల్లవు అంటూ యువత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పోతే కాంగ్రెస్‌ 2019 ఎన్నికల్లో అధిక సీట్లను సాధిస్తే రాహుల్‌కి సపోర్ట్‌ చేయడం మినహా తమకు గత్యంతరం లేదని ప్రతిపక్షాల ఆందోళన. కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ తాము బాధితులం అవుతామని తెలంగాణ, ఏపీ, ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.

ఇటీవలి కాలంలో రాహుల్‌ విమర్శాత్మక రాజకీయాలను పెంచిపోషిస్తున్నారు. ఒప్పైనా, తప్పైనామోదీపై, ఇతర బీజేపీ నేతలపై రాహుల్‌ విరుచుకుపడుతున్నారు. చివరకు న్యాయవ్యవస్థను కూడా ఆయన వదిలిపెట్టలేదు. రాహుల్‌ అనవసర విమర్శలు చేస్తున్నారా అనేది కాలానికి వదిలేద్దాం. కానీ ప్రధాని మోదీ మాత్రం పెద్దనోట్ల రద్దు, పేలవమైన జీఎస్టీ, చమురు ధరలను తగ్గించకపోవడం వంటి అంశాలతో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇతర నేతల్లాగే మోదీ సైతం ఇతరులను సంప్రదిం చడం లేదనే అపప్రథను సంపాదించుకుంటున్నారు.

అధికారంకోసం పోరాటం, రాజకీయాలు అనేవి భారత్‌లో ఇప్పుడు చావుబతుకుల సమస్య అయింది. ఏం చేసైనా సరే అధికారంలోకి రావాలని రాజకీయనేతలు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రమాదకర పరిస్థితిలోకి భారత్‌ ప్రవేశించబో తోందా, డబ్బు, కండబలం, మీడియా బలం ఇవే అధికారంలోకి తీసుకువచ్చే వాహికలుగా మారనున్నాయా అనే ప్రశ్నలు జాతిముందు నిలబడుతున్నాయి. ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు మనముందు జాతి నిర్మాతలు మాత్రం లేరు.
వ్యాసకర్త: పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు

ఈ–మెయిల్‌ : drppullarao@yahoo.co.in
 

Advertisement
Advertisement