నిండా మునగనున్న టీడీపీ | Sakshi
Sakshi News home page

నిండా మునగనున్న టీడీపీ

Published Wed, Mar 28 2018 12:19 AM

Pentapati Pullarao write article on TDP - Sakshi

సందర్భం

పొత్తు విచ్ఛిన్నమయ్యాక బీజేపీ కంటే టీడీపీయే నష్టపోయేది ఎక్కువ. కారణం కేంద్ర స్థాయిలో బీజేపీ అవసరం టీడీపీకి ఉంది కానీ టీడీపీ అవసరం బీజేపీకి ఉండదు. బాబు ఇప్పుడు అన్నిరకాలుగా ఒంటరి. ఇది తన ప్రత్యర్థులకే మేలు చేస్తుంది.

టీడీపీ, బీజేపీ పార్టీల బంధం ఆకస్మికంగా విచ్ఛిన్నం కావడంతో ఉన్నట్లుండి గొప్ప స్నేహితులు శత్రువులుగా మారిపోయారు. చంద్రబాబు తనకు రాసిన ఉత్తరానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మార్చి 18న ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింతగా బెడిసికొట్టాయి. తన రాజకీయ జిత్తులను ప్రదర్శించడానికి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని షా తన ఉత్తరంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పైగా, చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకు కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి ఖర్చుచేసిన లేదా దుబారా చేసిన లెక్కల వివరాలను ఒక్కసారి కూడా సమర్పించలేదని షా పేర్కొనడంతో ఇరుపార్టీల మధ్య పోరాటం మరింతగా పెరగనుంది. 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగినన్ని నిధులను ఇవ్వడం లేదని గత ఆరునెలలుగా టీడీపీ బహిరంగంగానే ఆరోపిస్తూ వచ్చింది. 2018 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ తర్వాత బాబు తీవ్ర ఆగ్రహం ప్రకటించి, పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తామని, తమ డిమాండ్లకోసం ఆందోళన చేస్తామని చెప్పారు. ఇప్పుడు టీడీపీ బీజేపీకి ప్రత్యర్థిగా ఉంది. ఈ క్రమంలో బీజేపీ, టీడీపీలు రాజకీయ క్రీడను పునరుద్ధరించాయి. టీడీపీ, బీజేపీ రెండు కూడా ఎదుటిపక్షం బుకాయిస్తోందని భావిస్తూ మరిన్ని ప్రయోజనాలు పొందడం కోసం చర్చలు చేస్తున్నాయి.

వైఎస్సార్‌సీపీ అడుగడుగునా అడ్డుకుని ప్రతిఘటించింది కాబట్టే ఈ రెండు పార్టీలు ఆడుతున్న జూద క్రీడ మొత్తంగా విఫలమైంది. 2018 ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి పదవులను కోల్పోవాల్సి వస్తుందని, కేంద్రంపై పట్టు కోల్పోవాల్సి వస్తుందని టీడీపీ ఎన్నడూ ఊహించలేదు. అలాగే 4 ఏళ్ల పొత్తు తర్వాత టీడీపీ తనకు శత్రువుగా మారుతుందని బీజేపీ కూడా భావించలేదు. 

ఎ. కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగడం ద్వారా కేంద్ర మంత్రి పదవులనూ, అధికారులపై తన ప్రభావాన్నీ టీడీపీ కోల్పోయింది. బాబు, ఆయన మంత్రులను కేంద్రం సాదరంగానే గౌరవించింది. కేంద్రంలో వీరు అనేక పనులు చక్కబెట్టుకున్నారు కూడా. ఇప్పుడు కేంద్ర మంత్రులు బాబుకు ఎలాంటి అదనపు గౌరవం చూపించటం లేదు. ఆ స్థానంలో శతృత్వం, అగౌరవం మాత్రమే మిగిలాయి.

బి. ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీలను బహిరంగంగా విమర్శించడం ద్వారా బాబు బలమైన శత్రువులను కొని తెచ్చుకున్నారు. ఈ ఇద్దరు ప్రముఖులూ తామాడిన మాటకు కట్టుబడిలేరని ఆరోపిస్తూ యావద్దేశం ముందూ వారిని బాబు అవమానించారు. ఇప్పుడు అరుణ్‌ జైట్లీ లేక ప్రధాని మోదీ అప్పాయింట్‌మెంట్‌ కూడా చంద్రబాబు పొందలేని పరిస్థితి ఏర్పడింది. 

సి. టీడీపీ కేంద్రప్రభుత్వంలో భాగంగా ఉన్నంతవరకు చంద్రబాబు సత్వర ఆమోదాలు పొందగలిగేవారు, కొత్త ప్రాజెక్టులకు ఆమోదముద్ర సాధించుకునేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2019 ఎన్నికలలో తన ప్రత్యర్థిని ఎంత బలోపేతం చేస్తుందన్న ప్రాతిపదికనే టీడీపీ చేసే ప్రతి డిమాండ్‌నూ పరిశీలించే అవకాశముంది. 

డి. కేంద్రం నుంచి గరిష్టంగా నిధులు, పెట్టుబడులు పొందడానికే చంద్రబాబు తమతో పొత్తును ఉపయోగించుకున్నారని, ఇప్పుడు తమను మోసం చేశారని బీజేపీ భావిస్తోంది. బాబు ఇక విదేశీ పెట్టుబడులను, విదేశీ సందర్శకులను ఏపీకి తీసుకురావడం చాలా కష్టమవుతుంది.

ఇ. రాబోయే 12 నెలల్లో బీజేపీకి చంద్రబాబు లేక టీడీపీ అవసరం ఉండదు. కానీ టీడీపీకి మాత్రం బీజేపీతో అవసరం ఉంది. ఇది నాయుడికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు బీజేపీ ఆంధ్రా కోసం ఏ రాయితీలనైనా ఇస్తే ఆ ఘనత ఇతరులకే కానీ టీడీపీకి మాత్రం రాదు. కేంద్రప్రభుత్వం  రైల్వే జోన్‌ తదితర హామీలను ఇచ్చేటట్టయితే  చంద్రబాబుకు, టీడీపీకి ఆ ఘనత దక్కనిరీతిలో ఇస్తుంది. 

ముగింపు : టీడీపీ ఏకాకి అయిపోయింది. ఢిల్లీలో అధికారాన్ని కూడా కోల్పోయింది. మోదీ, తదితరుల ఆగ్రహాన్ని చవిచూసే ప్రమాదమున్నందున 2019లో బీజేపీ అధికారంలోకి రాకూడదని చంద్రబాబు ప్రార్థించవలసి ఉంటుంది. చంద్రబాబు తనను నిందించడంపై అరుణ్‌ జైట్లీ ఆగ్రహంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ కూడా చంద్రబాబు కెరీర్‌ను ముగించాలని చూస్తోంది. అంటే బీజేపీ లేక కాంగ్రెస్‌ ఎవరు ఢిల్లీలో అధికార పీఠమెక్కినా చంద్రబాబుకు మేలు జరగదు. 

పవన్‌ కల్యాణ్‌ వంటి నూతన శక్తులు రంగంలోకి రావడం వైఎస్సార్‌ సీపీ బలాన్ని మరింతగా పెంచనుంది. చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ఓటర్లు టీడీపీకి దూరంకానున్నారు. చంద్రబాబు తమకు ఆశలు చూపించినట్లుగా తాము సింగపూర్‌ లేదా స్విట్జర్లండ్‌ కలలు కంటూ పొద్దుబుచ్చాలా లేదా ఉద్యోగాలు లేని సాధారణ జీవితంతో సంతృప్తి పడాలా అనే విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇకపై తమ అంచనా తాము వేసుకుంటారు. 

తన అవినీతి చర్యలపై విచారణ ప్రారంభమవుతుందని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే బీజేపీ తనను జైల్లో పెట్టవచ్చని చంద్రబాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. బాబు బాగా భయపడుతున్నాడని ఇది తెలుపుతోంది. బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ బలమైన మిత్రుడిగా మీడియా, న్యాయవ్యవస్థ ఇంతవరకూ చూస్తూ వచ్చింది. ఇప్పుడు బాబు బీజేపీకి బద్ధశత్రువు కాబట్టి వీరు కూడా తనకు దూరం కావచ్చు.

ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీకి రావలసిన అవసరం ఉండదు లేక ఏపీకి ప్రాజెక్టుల కోసం ప్రయత్నించి అవన్నీ తన ఘనతే అని చెప్పుకునే అవకాశమూ ఉండదు. నిస్సందేహంగానే బీజేపీ కంటే టీడీపీనే నష్టపోయేది ఎక్కువ. 2019లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే టీడీపీ భారీగా నష్టపోతుంది. ఏపీలో ఆయన ప్రత్యర్థులకు అధిక ప్రయోజనం సిద్ధిస్తుంది. చంద్రబాబు ఇకనుంచి కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరించేందుకు మెరుగైన వ్యూహాలు, ఎత్తుగడలు పన్నాల్సి ఉంటుంది. అమిత్‌ షా ఉత్తరాలు రాసి ఊరకుండే వ్యక్తి కాదు. ఆయన మాటల కన్నా.. చేతల మనిషి అని గుర్తుంచుకోవాలి.
 

- పెంటపాటి పుల్లారావు
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
ఈ–మెయిల్‌ : drppullarao@yahoo.co.in 

 

Advertisement
Advertisement