కృష్ణానదిలో నవలంక | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో నవలంక

Published Wed, Jan 17 2018 8:12 AM

sankranthi festival celebrations in navalanka - Sakshi

నాగాయలంకలోని కృష్ణా నది మధ్యలో ఉన్న దీవికి మహర్దశ పట్టింది. ఈ దీవిని అభివృద్ధి చేసి పర్యాటకానికి ఊపు తీసుకువచ్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

నాగాయలంక : స్థానిక శ్రీరామపాదక్షేత్రం సమీపంలో ఎదురుగా కృష్ణానది మధ్యలో ఉన్న చిన్నపాటి దీవిని అభివృద్ధి చేసేందుకు తొలి అడుగులు పడ్డాయి. ‘నవలంక’ అనే నామకరణంతో సందర్శకుల దీవిగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో న్యూ ఐలెండ్‌ రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 13, 14 తేదీలలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దివిసీమ సంప్రదాయ పడవల పోటీలు, సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించింది.

మరిన్ని నగిషీలు..
ఈ దీవి అభివృద్ధిలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. శ్రీరామపాద క్షేత్రం ఘాట్‌ కృష్ణవేణి విగ్రహం నుంచి కేవలం 10 నిముషాల లోపు నదీ ప్రయాణానికి అనువుగా అవసరమైతే బోట్‌ షికార్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అలాగే ఈ దీవికి నవలంక అనే పేరుతోపాటు నవ్యలంక అనే పేరును కూడా పరిశీలిస్తున్నారు. భవిష్యత్‌లో దీవిపై 30 అడుగుల తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖకు బుద్ధప్రసాద్‌ సూచించినట్లు సమాచారం.

అలరించిన సంబరాలు..
కృష్ణానది మధ్యలో ఉన్న చిన్నపాటి దీవిని ‘నవలంక’ నామకరణంతో సందర్శకుల దీవిగా 14న కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బాబూరావునాయుడు ప్రారంభించారు.
గత 3 రోజులుగా ఈ దీవిని చూసేందుకు సందర్శకులు పరుగులు పెడుతున్నారు.
ఇక్కడ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 16 ఆధునిక ఏసీ టెంట్‌లను రాజస్థాన్‌ నుంచి రప్పించి సుందరంగా తీర్చిదిద్దారు.
ఆరుబయట ఆధునిక సౌకర్యాలతో సీటింగ్‌ గ్రౌండ్, పక్కన డైనింగ్‌ హాలు ఏర్పాటు చేశారు.
పిల్లలు, యువకుల కోసం మికీమౌస్‌ ఆటల ఎమ్యూజ్‌మెంట్, నదిలో ఫెడలింగ్, సైక్లింగ్‌ బోట్స్‌ ఏర్పాటు చేశారు.
చక్కని ఏసీ గుడారాల గుమ్మాల ముందు లాంతర్లతో విద్యుత్‌ దీపాలు వెలిగించారు.
వినోద కార్యక్రమాల కోసం ప్రాంగణంలో భారీ వేదిక, డిజిటల్‌ లైటింగ్‌ హంగులు, సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు.
ఆధుకనిక హంగులతో ఈ చిరు దీవిని సందర్శించేందుకు 3 రోజులుగా జనం తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. నామమాత్రపు చార్జీతో స్థానిక మత్స్యకారులు వారిని తరలిస్తున్నారు.
మరో మూడు రోజుల వరకు దీవిని సందర్శకుల కోసం తెరిచే ఉంచుతామని, భవిష్యత్‌లో రిసార్ట్స్‌కు అనుమతిచ్చే అవకాశాలు పరిశీలిస్తామని పర్యాటక శాఖ అధికారులు చెపుతున్నారు.
పర్యాటక శిబిరం ముగిసే వరకు ప్రపంచ ప్రఖ్యాత స్థానిక మిమిక్రీ స్టార్‌ భవిరి రవి, గుంటూరుకు చెందిన హైనా రేఖ బృందం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement