కూపీ లాగుతున్న ఏసీబీ!

17 Jul, 2015 01:50 IST|Sakshi
కూపీ లాగుతున్న ఏసీబీ!

* వేం నరేందర్‌రెడ్డి కుమారుడిని రెండోరోజూ విచారించిన అధికారులు
* ఉదయసింహ, సెబాస్టియన్‌లతో కలిపి కృష్ణకీర్తన్‌కు ప్రశ్నలు
* టీడీపీ నేతల తర్ఫీదును వ్యూహాత్మకంగా తిప్పికొడుతున్న ఏసీబీ
* ఆర్థిక మూలాలకు సంబంధించి కీలక సమాచారం సేకరణ

సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఊహించని షాక్‌లు ఎదురవుతున్నాయి.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌ను ఈ కేసులో ఏసీబీ అధికారులు రెండో రోజు గురువారం కూడా సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగిన ఈ విచారణలో.. కృష్ణకీర్తన్‌తో పాటు ఉదయ సింహ, సెబాస్టియన్‌లను కూడా కలిపి విచారించారు. తొలుత ఈ ముగ్గురిని ఫోన్‌కాల్స్ ఆధారంగా విడివిడిగా ప్రశ్నించగా.. వారు చెప్పిన కొన్ని సమాధానాల మధ్య పొంతన కుదరనట్లు తెలిసింది.

దాంతో అందరినీ ఒకేచోట కూర్చోబెట్టి డబ్బుల వ్యవహారానికి సంబంధించి అడగగా.. తొలుత మౌనమే సమాధానమైనట్లు సమాచారం. దాదాపు ఏడు గంటల పాటు సాగిన విచారణలో చివరకు కొన్ని కీలక అంశాలతో పాటు ఈ కేసులో ఆర్థిక మూలాలకు సంబంధించిన విషయాలను సేకరించినట్లు తెలిసింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకునేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది.
 
అడ్డంగా దొరికిపోయిన కృష్ణకీర్తన్!
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కృష్ణకీర్తన్ పాత్రకు సంబంధించి ఏసీబీ వద్ద ముందే కొంత సమాచారముంది. దాని ఆధారంగా ఆయనను బుధవారం పిలిపించి, విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాదిరిగానే కృష్ణకీర్తన్ కూడా బాగా ‘తర్ఫీదు’ తీసుకున్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది.

కేసుకు సంబంధించిన నిందితులు, అనుమానితులు, సాక్షులుగా ఉన్నవారు వ్యక్తిగత విచారణలో మొండికేస్తుండటంతో.. ఏసీబీ రూటు మార్చింది. విడివిడిగా విచారించినప్పుడు బయటపడిన అంశాల్లోని సందేహాలను, మూకుమ్మడి విచారణలో తీర్చుకుంటోంది. రెండో రోజు విచారణకు రావాల్సిందిగా బుధవారమే కృష్ణకీర్తన్‌ను ఆదేశించిన ఏసీబీ... గురువారం ఉదయం హఠాత్తుగా ఉదయసింహ, సెబాస్టియన్‌లను కూడా పిలిపించింది. వారిద్దరినీ చూడగానే కృష్ణకీర్తన్ కంగుతిన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఆయన మొదటి రోజు చెప్పిన విషయాలను ఉదయసింహ, సెబాస్టియన్‌ల ముందు మరోసారి ప్రస్తావించే సరికి నీళ్లు నమిలినట్లు సమాచారం. దీంతో భయాందోళనకు గురైన కృష్ణకీర్తన్.. డబ్బులకు సంబంధించి కీలక సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది.
 
బిగుసుకుంటున్న ఉచ్చు
వేం నరేందర్‌రెడ్డికి ఉచ్చు బిగుసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కృష్ణకీర్తన్‌ను విచారించిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన అంశాలతో నరేందర్‌రెడ్డి పాత్రపై ఏసీబీకి పలు అనుమానాలు కలిగినట్లు సమాచారం. వాటిని నివృత్తి చేసుకోవడం కోసం నరేందర్‌రెడ్డిని మరోసారి విచారించాలని భావిస్తోంది. అయితే ఆయనను ఈ కేసులో సాక్షిగా భావిస్తూ నోటీసులు జారీ చేయాలా, నిందితుడిగానా అన్నదానిపై దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఓ నిర్ణయానికి రానున్నారు.

>
మరిన్ని వార్తలు