కార్మికులకు వేతనాలు పెంచకుంటే ఉద్యమాలే | Sakshi
Sakshi News home page

కార్మికులకు వేతనాలు పెంచకుంటే ఉద్యమాలే

Published Wed, Jul 22 2015 6:44 AM

agitatons will raise if government not impliment wages increments

కరీంనగర్ :
 ప్రజలు పోరాటాలు చేసిన సాధించుకున్న రాష్ట్రంలో దొరల పాలన సాగుతోందని, సామాజిక తెలంగాణ కోసం మళ్లీ పోరాటాలు చేయాల్సిన రోజులు వచ్చాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ కార్మికుల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సీపీఎం, సీపీఐ సహా ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన వామపక్ష బస్సుజాత మంగళవారం రాత్రి కరీంనగర్ చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వీరభద్రం మాట్లాడారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని, లేకపోతే పోలీసులు బలగాలను రంగంలోకి దింపుతామని సీఎం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడడంతో వామపక్ష పార్టీలన్ని ఐక్య ఉద్యమాలకు సిద్ధమయ్యూయని అన్నారు. కేసీఆర్ హైదరాబాద్‌కు మాత్రమే సీఎం అయినట్లు గ్రేటర్ హైదరాబాద్ కార్మికులకు వేతనాలు పెంచి, తెలంగాణ జిల్లాలో ఉన్న ఇతర కార్మికుల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. విధుల నుంచి తొలగించిన 800 మంది కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెల్లబట్టలు వేసికొని కాగితాలపై సంతకాలు చేస్తున్న వారికి వేలల్లో వేతనాలు పెంచుతున్న కేసీఆర్‌కు ముక్కు మూసుకొని కంపువాసనలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచడానికి మనసు రావడం లేదన్నారు.

ప్రభుత్వం దిగివచ్చి వేతనాలు పెంచడంతోపాటు కాంట్రాక్టు కార్మికులందరిని రెగ్యులరైజ్ చేయాలని, లేనిపక్షంలో ఈనెల 24న మరో పోరాటాన్ని ప్రకటిస్తామని హెచ్చరించారు. సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ చౌక్‌లో కార్మికులు సభ నిర్వహించుకుంటే కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. ఎన్ని పుష్కరాల్లో స్నానం చేసినా పారిశుధ్య కార్మికుల పాపం ఊరికేపోదన్నారు. సభలో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు జువ్వాడి చలపతిరావు, సీపీఐఎంఎల్ పార్వర్డ్‌బ్లాక్ నాయకుడు ఈసంపల్లి వేణు, ఎంసీపీఐ(యు) నాయకుడు వి.బాలు, నాయకులు మర్రి వెంకటస్వామి, ఎరవెల్లి ముత్యంరావు, జి.ముకుందరెడ్డి, జీ.భీమాసాహెబ్, కాల్వ నర్సయ్యయాదవ్ పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement