రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స

Published Mon, Jul 27 2015 1:58 AM

రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స - Sakshi

‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు
 
*  ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు రోడ్డు భద్రతా బిల్లు తెస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఏటేటా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాద మరణాలపై ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే రోడ్డు రవాణా భద్రత బిల్లు తీసుకువస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి నగదు రహిత వైద్యం అందజేస్తామని వెల్లడించారు. ఆదివారం రేడియోలో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ ఈ మేరకు తెలిపారు.

అనేక సామాజికాంశాలపై మాట్లాడిన మోదీ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభనపై మాత్రం స్పందించలేదు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పంద్రాగస్టు ప్రసంగంలో ఏయే అంశాలపై మాట్లాడాలో సూచించాలని ప్రజలను కోరారు. ఇటీవల ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో ఓ బాధితుడు నెత్తురోడుతూ పడిపోయినా ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోయారని, ఈ ఘటన తర్వాత ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు పూనుకోవాలంటూ తనను అనేక మంది కోరారన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు
♦  దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. ఈ ప్రమాదాల్లో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. మృతుల్లో మూడోవంతు 15 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్నవారే.
♦  ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కొత్తగా బిల్లు తీసుకురావడంతోపాటు జాతీయ రోడ్డు భద్రతా విధానం, రోడ్డు భద్రత కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు చేపడతాం. ఈ కార్యక్రమం కింద ప్రమాదం జరిగిన తొలి 50 గంటలలోపు నగదుతో పనిలేకుండా చికిత్స అందిస్తాం.
♦  దేశవ్యాప్తంగా ప్రమాదాలకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నంబర్ 1033తోపాటు అంబులెన్సు వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.
♦  రైల్వే ఐఆర్‌సీటీసీలో టికెట్లు తీసుకోడానికి వికలాంగులకు కోటా పెట్టాలని కాన్పూర్‌కు చెందిన అఖిలేష్ వాజపేయి చేసిన సూచన మేరకు ఆ విధానాన్ని అమలు చేశాం.
 
కార్గిల్ అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నా...
కార్గిల్ యుద్ధ అమరవీరులకు మోదీ ‘మన్‌కీ బాత్’లో, ట్విటర్‌లో నివాళులు అర్పించారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన వీరులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. భారత సాయుధ దళాల శౌర్యానికి, త్యాగానికి ఈయుద్ధం ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ విజయంలో దేశంలోని ప్రతి గ్రామం, నగరం వంతు పాత్ర ఉందని ఉద్ఘాటించారు.

ఈ యుద్ధం కేవలం సరిహద్దులో జరిగిన పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదని, ఇందులో దేశంలోని ప్రతి ఒక్క గ్రామం, ఒక్క నగరం కూడా తమ వంతు పాత్రను నిర్వహించాయని అన్నారు. కార్గిల్‌లో మన ఒక్కో సైనికుడు వంద మంది శత్రు సైనికులకు సమానమని నిరూపించారని ఆయన కొనియాడారు.

Advertisement
Advertisement