భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు | Sakshi
Sakshi News home page

భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు

Published Thu, Jul 9 2015 3:22 AM

భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు - Sakshi

మంజూరు చేసిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు
కర్నూలు(లీగల్): ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరయింది. ఈ మేరకు కర్నూలు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక విచారణ కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. భూమా నాగిరెడ్డి తరఫు న్యాయవాదులు వై.రాజశేఖర్‌రెడ్డి, టి.సూర్యనారాయణరెడ్డిలు కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేశారు.

దీనిపై బుధవారం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి. భూమాకు బెయిల్ ఇవ్వవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామచంద్రారెడ్డి కోర్టుకు విన్నవించారు. ఆయనకు అనారోగ్యం ఉందని.. ఇవన్నీ రాజకీయ కోణంలో బనాయించిన అక్రమ కేసులని భూమా తరఫు న్యాయవాదులు విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి వి.వి.శేషుబాబు.. భూమా నాగిరెడ్డికి రూ.20 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశించారు.
 
రాష్ట్రంలో అనధికార ఎమర్జెన్సీ

ఆళ్లగడ్డ: ‘‘డోన్ట్ టచ్ మీ... అనే పదానికి పెడర్థం తీశారు. నేను మాట్లాడింది డీఎస్పీ హరినాథ్‌రెడ్డితో అయితే.. పక్కనున్న ఎస్సీ వర్గానికి చెందిన డీఎస్పీచేత అట్రాసిటీ కేసు బనాయించారు. ఈ పరిణామం చూస్తే ఇకపై పోలీసు అధికారులు నేమ్‌బోర్డులో పేరుతోపాటు కులం పేరు రాసుకోవాల్సి వస్తుంది’’ అని భూమా నాగిరెడ్డి అన్నారు. అక్రమంగా బనాయించిన ఎస్సీ, ఎస్టీ కేసులో బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో భూమా బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
 

Advertisement
Advertisement