కార్పొరేట్ బాట వద్దు | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ బాట వద్దు

Published Mon, Aug 17 2015 4:08 AM

ఆదివారం నల్సార్ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ - Sakshi

- న్యాయ విద్యార్థులకు కేంద్ర  మంత్రి సదానంద గౌడ హితవు
- దేశ న్యాయవ్యవస్థ మేధావులను కోల్పోతోంది
- న్యాయ కళాశాలలు మెరుగుపడాల్సి ఉంది
- న్యాయశాస్త్రంలో పరిశోధనలు జరపాలని సూచన
- ఘనంగా నల్సార్  వర్సిటీ 13వ స్నాతకోత్సవం
 
సాక్షి, హైదరాబాద్:
న్యాయవాద విద్య పూర్తయిన తర్వాత కార్పొరేట్ ప్రపంచంలో చేరేందుకు విదేశాలకు తరలివెళ్లడం మేధోవలస లాంటిదేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానంద గౌడ అభిప్రాయపడ్డారు. దీంతో దేశ న్యాయవ్యవస్థ ప్రతిభావంతులైన భావితరం న్యాయవాదులను కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివారం జరిగిన ప్రతిష్టాత్మక నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలేతో కలసి సదానంద గౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవిద్యలో ప్రావీణ్యం పొందిన విశ్వవిద్యాలయ విద్యార్థులు కోర్టుల్లో కక్షిదారుల తరఫు వాదనలు వినిపిస్తే న్యాయవ్యవస్థకు ఎంతో మేలు చేసినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. దాదాపు రెండు దశాబ్దాల కృషి ఫలితంగా న్యాయ విద్యకు, న్యాయ విద్యార్థులకు ఐఐటీ, ఐఐఎం స్థాయి గుర్తింపు లభించిందన్నారు.

దేశంలోని ఇతర న్యాయ కళాశాలల పరిస్థితి ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. ఎంతో నైపుణ్యం ఉన్న నల్సార్ విద్యార్థులు విదేశాలకు తరలివెళ్లడం బాధాకరమని పేర్కొన్నారు. న్యాయ విద్యలో సమూల మార్పులకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. న్యాయ శాస్త్రంలోని అన్ని విభాగాల్లో న్యాయ విశ్వవిద్యాలయాలు పరిశోధనలు జరపాలని, కాలానుగుణంగా చట్టాల్లో మార్పులు సూచించే విధంగా పరిశోధనలు ఉండాలని సూచించారు. వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తఫా మాట్లాడుతూ.. నల్సార్‌లో చదివేందుకు విద్యార్థులకు ఆర్థిక స్థోమత అడ్డుకాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహకారం పొందేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మొదటి సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను 80 నుంచి 120కు పెంచామని తెలిపారు.

విద్యార్థులకు ‘బంగారు’ పంట..
స్నాతకోత్సవంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. ఓ విద్యార్థిని ఏకంగా 10 బంగారు పతకాలు సాధించింది. మరో విద్యార్థిని 8 గోల్డ్ మెడల్స్, ఇంకో విద్యార్థిని 7 గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని అంజలీ రావత్ 10 గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకోగా, రూపాలి ఫ్రాన్సిస్ సామ్యూల్ 8, సాన్య సమంతాని 7, తాన్య అగర్వాల్ 4 గోల్డ్ మెడల్స్ సాధించారు.

నందితా హక్సర్‌కు డాక్టరేట్..
ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది నందితా హక్సర్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చట్టపరమైన న్యాయం అందించలేని స్థితిలో దేశ న్యాయ వ్యవస్థ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ప్రజాస్వామిక దేశంగా ఉంచేందుకు, నిజై మెన ప్రజాస్వామిక విలువలను నెలకొల్ప డానికే మానవహక్కుల కార్యకర్తలు కృషి చేస్తున్నారని, పోరాడుతున్నారని పేర్కొన్నారు.

 

నాగాలాండ్ ప్రజలపై సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం పేరుతో ఆర్మీ అకృత్యాలు, నిర్బంధాలపై 1987 నుంచి న్యాయపోరాటం చేస్తున్నా, ఇప్పటి వరకు న్యాయ స్థానాలు తీర్పులను వెలువరించలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాల్లో ఆర్మీ జవాన్ల ముందు ఓ గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, 10 ఏళ్ల కిందే విచారణ పూర్తయినా తీర్పు మాత్రం రాలేదని, ఆ ఆడబిడ్డ వయస్సు ఇప్పుడు 24 ఏళ్లు అని ఆ అమానవీయ ఘటనను గుర్తుచేసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement