పోటెత్తిన భక్తజనం | Sakshi
Sakshi News home page

పోటెత్తిన భక్తజనం

Published Fri, Jul 17 2015 3:26 AM

పోటెత్తిన భక్తజనం - Sakshi

* గోదావరి తీరాన మూడోరోజూ పుష్కర శోభ
* తెలంగాణ పుణ్యస్నానాలు ఆచరించిన లక్షలాది మంది భక్తులు
* భద్రాచలానికి 1.70 లక్షలు, ధర్మపురికి 75 వేల మంది రాక

సాక్షి నెట్‌వర్క్: మహా పుష్కరాల మూడోరోజూ గోదావరి తీరం జనంతో పోటెత్తింది. లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే అమావాస్య కావడంతో గత రెండ్రోజులతో పోలిస్తే గురువారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది.

రాష్ట్రంలో ప్రధాన పుణ్యక్షేత్రాలైన బాసర, ధర్మపురి, కాళేశ్వరంలో మంగళ, బుధవారాలతో పోలిస్తే గురువారం తక్కువ సంఖ్యలో పుష్కర స్నానం ఆచరించారు. ధర్మపురిలో 75 వేలు, కాళేశ్వరంలో 75 వేల మంది పుణ్యస్నానాలు చేశారు. బాసర, భద్రాచలం ప్రాంతాల్లో మాత్రం భక్తుల రద్దీ ఎప్పట్లాగే కొనసాగింది. భద్రాచలంలో 1.70 లక్షలు, బాసరలో 45 వేల మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. అధిక ఆషాఢ మాసం చివరిరోజు అమావాస్య పునర్వసు పుష్యమి ఘడియలు రావడంతో పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు సమర్పిస్తే వారి ఆత్మలు సంతృప్తి చెందుతాయని భక్తుల వి శ్వాసం.

దీంతో త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో భక్తుల సంఖ్య పెరుగుతుందని భావించారు. కానీ ఇక్కడ పుష్కర స్నానాలు, పిండ ప్రదానాలు అంతగా జరగలేదు. మధ్యాహ్నం వరకు 75 వేల మంది భక్తులు మాత్రమే పుష్కర స్నానాలు ఆచరించారు. మొత్తమ్మీద గురువారం దాదాపు 8 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. క్షేత్రాలకు మూడోరోజూ ప్రముఖుల తాకిడి కొనసాగింది. కాళేశ్వరంలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ పుష్కర స్నానం ఆచరించారు.
 
ధర్మపురిలో సినీ దర్శకుడు కోడి రామకృష్ణ, మాజీ ఎంపీ మధుయాష్కీ, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్‌చైర్మన్ నిరంజన్‌రెడ్డి పుష్కర స్నానాలు చేశారు. భద్రాచలం ఘాట్‌లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, సీఎం రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి తదితరులు స్నానం ఆచరించారు. వీహెచ్‌పీ జాతీయాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఖమ్మం జిల్లా కొండాయిగూడెం పుష్కరఘాట్ వద్ద శివలింగ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. మణుగూరు మండలం చిన్నరావిగూడెంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పుష్కరస్నానం ఆచరించి పిండ ప్రదానం నిర్వహించారు.

Advertisement
Advertisement