‘వీణవంక’లో ఇద్దరు మైనర్లు: నాయిని | Sakshi
Sakshi News home page

‘వీణవంక’లో ఇద్దరు మైనర్లు: నాయిని

Published Wed, Mar 2 2016 3:47 AM

Intelligence Inquiry on gangrape

సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ దుర్ఘటన ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, నిందితులందరికి కఠినంగా శిక్షలు పడేలా చూస్తామన్నారు. ఈ కేసు స్వయంగా డీజీపీ అనురాగ్‌శర్మ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ ఘటనలో సమయానికి స్పందించని అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పారు.

 అత్యాచారాలపై అంతా సిగ్గుపడాలి: త్రిపురాన
 సాక్షి, హైదరాబాద్: కరీంనగర్‌లో జరిగిన రెండు అత్యాచార ఘటనలకు సంబంధించి అందరూ సిగ్గుపడాలంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకటరత్నం ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో విలేకరులతో వెంకటరత్నం మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. వీణవంక మండలంలో పదో తారీఖున ఘటన జరిగితే... 24వ తేదీ వరకూ కేసు నమోదు కాకపోవడం విచారకరమన్నారు. అలాగే మూడురోజుల క్రితం కాతారం మండలంలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో పట్టుబడ్డ నిందితుడికి కఠిన శిక్ష పడాలన్నారు. నిర్భయ చట్టం వచ్చాక కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం దారుణమన్నారు.  
 
 గ్యాంగ్‌రేప్‌పై ఇంటెలిజెన్స్ ఆరా
 వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో ఇటీవల దళిత యువతి(20)పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆరా తీశారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులు సామూహిక అత్యాచార ఘటనపై పూర్తి వివరాలు సేకరించినట్లు సమాచారం. నిందితుల్లో ఇద్దరు యువకులు మైనర్లు అని పోలీసులు ప్రకటించగా, అంజయ్య అనే నిందితుడి వయస్సుపై దళిత, ప్రజాసంఘాలు, నాయకులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతని జనన ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించినట్లుగా సమాచారం. బాధితురాలి స్నేహితురాల పోలీస్‌లకు ఏ  నంబర్ నుంచి ఫోన్ చేసిందనే కోణంలో కూడా దర్యాప్తు చేసినట్లు సమాచారం.

వీణవంక ఎస్సై, కానిస్టేబుల్‌పై వేటు
 కరీంనగర్ క్రైం: వీణవంక ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటుపడింది. హోంమంత్రి నారుుని నర్సింహారెడ్డి డీజీపీ అనురాగ్‌శర్మతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు వీణవంక ఎస్సై కిరణ్, కానిస్టేబుల్ పర్శరాములను సస్పెండ్ చేస్తూ ఎస్పీ జోయల్‌డేవిస్ మంగళవారంరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
 వీణవంక బాధితురాలికి రక్షణ కల్పించాలి: వీణవంక ఘటనలో పోలీసు విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరపాలని రాష్ట్ర మహిళా ఐక్య కార్యచరణ సంఘం ఒక ప్రకటనలో కోరింది. మంగళవారం రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని మహిళా సమాఖ్య సభ్యులు కలిశారు.

Advertisement
Advertisement