హామీలపై కేంద్రాన్ని నిలదీద్దాం | Sakshi
Sakshi News home page

హామీలపై కేంద్రాన్ని నిలదీద్దాం

Published Mon, Jul 20 2015 3:22 AM

హామీలపై కేంద్రాన్ని నిలదీద్దాం - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షపై గట్టిగా నిలదీయాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించుకుంది.  ఈ మేరకు పార్టీ ఎంపీలు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఇప్పటికే జరిగిన భేటీలో వ్యూహరచన చేసుకున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం ఇప్పటివరకు నెరవేర్చకపోవడాన్ని తప్పుబడుతూ మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అడ్డుకోవాలని టీఆర్‌ఎస్ ఎంపీలు నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా తెలంగాణకు ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపిణీలో జాప్యం, కమలనాథన్ కమిటీ పనితీరు, విభజన చట్టం మేరకు ఏర్పాటు కావాల్సిన ఐఐ ఎం, హార్టికల్చర్ వర్సిటీ వంటి అంశాలపై ఎంపీలు పట్టుబట్టనున్నారని సమాచారం.
 
ప్రాణహితకు జాతీయ హోదా కోసం పట్టు...
సాగునీటి రంగంలో గత పాలకులు ప్రదర్శించిన అలసత్వం వల్ల తెలంగాణలో వలసలు పెరిగాయన్న నిశ్చితమైన అభిప్రాయం టీఆర్‌ఎస్‌లో ఉంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోపాటు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడితుల గొంతు తడిపేందుకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఏపీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, దీనిపై కేంద్రం అనుసరిస్తున్న నిర్లిప్త వైఖరిపై సభను స్తంభింపజేయాలన్న వ్యూహంతో ఆ పార్టీ ఎంపీలున్నారు. వీటితోపాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాపైనా పట్టుబట్టాలని నిర్ణయించారు.

ప్రాజెక్టులపై, అడ్డుపడుతున్న ఏపీ నిర్వాకంపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు, కేంద్ర జలవనరుల శాఖ  మంత్రి ఉమా భారతిని కలిసి చర్చించనున్నారు. ‘ప్రధానంగా హైకోర్టు విభజన అంశంపైనే దృష్టి పెట్టనున్నాం. అన్ని సౌకర్యాలున్నా, కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రకటనలు చేసినా, విభజనలో ఆలస్యం జరుగుతోంది. మూడు రోజుల కిందట గవర్నర్‌నూ కోరాం. ఇక్కడి వారిపై నమ్మకం లేదు. కాకుంటే మా కేసులను ఒడి శా లేదా తమిళనాడుకు మార్చాలని కూడా కోరుతాం..’ అని ఒక ఎంపీ వ్యాఖ్యానించారు.

పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన విషయంలో బాగా ఆలస్యం జరుగుతోందని ఎంపీలు పేర్కొంటున్నారు. కేంద్రంలోని కొందరు పెద్దలు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా, తెలంగాణ అంశాలకు వ్యతిరేకంగా ఉంటున్నారన్న బలమైన అభిప్రాయంతో ఉన్న టీఆర్‌ఎస్ నాయకత్వం, తమ ఎంపీల ద్వారా కేంద్రంతో అమీతుమీకి సిద్ధపడుతున్నట్లు భావిస్తున్నారు.
 
టీ ప్రభుత్వంపై టీడీపీ కుట్ర...
ఎన్డీయేలో భాగస్వామ్యపక్షమైన టీడీపీ... తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందని ఎంపీలు విమర్శిస్తున్నారు. ‘ బేగంపేట విమానాశ్రయం నిజాం మనకు ఇచ్చిన వారసత్వ సంపద. అది తెలంగాణ సొత్తు. కానీ టీడీపీకి చెందిన పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బేగంపేట విమానాశ్రయాన్ని సైన్యానికి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు..’ అని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. బేగంపేట విమానాశ్రయ వ్యవహారాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని, కేంద్రం తీరుపై నిరసన తెలపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బయట ఎవరినీ నిందించవద్దని, ముఖ్యంగా న్యాయవ్యవస్థ విషయంలో జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడాలని కొందరు ఎంపీలకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. హైకోర్టు విభజనపై సాధ్యమైనంతగా కొట్లాడాలని, ఏది మాట్లాడినా, అది పార్లమెంటు సమావేశాల్లోనే మాట్లాడాలని కూడా వీరికి సూచించారని తెలిసింది. లోక్‌సభ స్పీకర్ సోమవారం నిర్వహించనున్న అఖిలపక్ష భేటీకి హాజరవుతున్నామని, మంగళవారం నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేస్తామని టీఆర్‌ఎస్ ఎంపీ ఒకరు వివరించారు.

Advertisement
Advertisement