రైతుల వాటా భూములెక్కడ? | Sakshi
Sakshi News home page

రైతుల వాటా భూములెక్కడ?

Published Mon, Jul 20 2015 1:39 AM

where is farmer share of lands

సీడ్ క్యాపిటల్ ప్లాన్‌ను నేడు సీఎంకు అందించనున్న సింగపూర్ బృందం
* రైతులకు స్థలాలు ఎక్కడ వస్తాయో చెప్పలేమంటున్న అధికారులు
* సొంత గ్రామాల్లో ఇవ్వడం కష్టమేనని స్పష్టీకరణ  
* ఆందోళనలో రాజధాని ప్రాంత అన్నదాతలు

సాక్షి, హైదరాబాద్: ‘‘ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల సేవలను మరిచిపోలేం. వారికిచ్చే వాటా భూముల కింద రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్ల స్థలాలను సొంత గ్రామాల్లోనే ఇచ్చేటట్లు చూస్తాం.

రాజధాని మాస్టర్ ప్లాన్ తర్వాతే ఎక్కడ స్థలాలు ఇస్తామో చెబుతాం’’....  రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ పలుమార్లు చేసిన ప్రకటనలు ఇవీ. కానీ, ఆచరణలోకి మాత్రం రావడం లేదు. సీడ్ క్యాపిటల్ ప్లాన్ కూడా అందుతున్న తరుణంలో రైతుల వాటా భూములపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సింగపూర్ ప్రభుత్వం సీడ్ క్యాపిటల్ ప్లాన్‌ను అందిస్తుండడంతో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్రణాళికలు దాదాపు సిద్ధమైనట్లే. అయితే, సర్కారు మాత్రం రైతుల వాటా భూములు ఎక్కడుంటాయో మాత్రం చెప్పడం లేదు.
 
రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అందిన తర్వాతే రైతుల వాటా భూములు ఎక్కడ వస్తాయో వెల్లడిస్తామని సీఆర్‌డీఏ వర్గాలు పలుమార్లు ప్రకటించాయి. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ అందించి దాదాపు రెండు నెలలు కావొస్తోంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం ఇవ్వనున్న సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌తో రాజధాని నిర్మాణానికి అన్ని రకాల ప్రణాళికలు అందించే ప్రక్రియ పూర్తయినట్లే. రాష్ట్ర ప్రభుత్వం ఇక స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపికపై దృష్టి సారించనుంది.

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఏయే ప్రాంతాల్లో కమర్షియల్, రెసిడెన్షియల్ స్థలాలు వస్తాయన్నది చెప్పలేమని సీఆర్‌డీఏ అధికారులు అంటుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ గ్రామానికి చెందిన రైతులకు ఆ గ్రామంలోనే స్థలాలు ఇవ్వడం కష్టమని అధికారులు తేల్చి చెబుతున్నారు. మొత్తం 33 వేల ఎకరాలకు పైగా భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఇప్పటివరకు 25,200 ఎకరాలకు మాత్రమే రైతులు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. మిగిలిన 8 వేల ఎకరాలకు గాను ఒప్పందాలు చేసుకునేందుకు రైతులు ముందుకు రాకపోవడం గమనార్హం.
 
హైదరాబాద్‌కు చేరుకున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్
సీడ్ క్యాపిటల్ ప్లాన్ అందించేందుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తన బృందంతో ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సింగపూర్ బృందం సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో రాజమండ్రికి చేరుకోనుంది. ఈ బృందానికి గోదావరి పుష్కర సాన్నాలు చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పుష్కర స్నానాల అనంతరమే సీడ్ క్యాపిటల్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
రాజధాని విస్తీర్ణం పెంపు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర విస్తీర్ణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పెంచింది. తొలుత సిటీ విస్తీర్ణాన్ని 212 చదరపు కిలోమీటర్ల మేరకే పరిమితం చేస్తూ సింగపూర్ కంపెనీలు క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. అయితే తాజాగా ప్రభుత్వ సూచనల మేరకు క్యాపిటల్ సిటీ పరిధిని అదనంగా 162 చదరపు కిలోమీటర్ల మేరకు సింగపూర్ కంపెనీలు పెంచాయి.

ఈ పెంపుతో మొత్తం రాజధాని నగర విస్తీర్ణం 212 చదరపు కిలోమీటర్ల నుంచి 374 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. కృష్ణా నది అవతలి ఒడ్డు తొలుత క్యాపిటల్ సిటీలో లేదు. ఇప్పుడు పరిధి పెంచడం ద్వారా కృష్ణా నది అవతలి ఒడ్డును కూడా సిటీ మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు.  కృష్ణా నది అవతలి ఒడ్డులో 30 చదరపు కిలోమీటర్లను నగర పరిధిలోకి తీసుకొచ్చారు.

Advertisement
Advertisement