109 నకిలీ మిరప విత్తన డీలర్ల లెసైన్సులు రద్దు? | Sakshi
Sakshi News home page

109 నకిలీ మిరప విత్తన డీలర్ల లెసైన్సులు రద్దు?

Published Tue, Oct 18 2016 2:45 AM

109 నకిలీ మిరప విత్తన డీలర్ల లెసైన్సులు రద్దు? - Sakshi

- రంగం సిద్ధం చేసిన వ్యవసాయశాఖ
- వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ
- పీడీ యాక్ట్ కింద పలుచోట్ల అరెస్టులు
 
 సాక్షి, హైదరాబాద్: నకిలీ మిరప విత్తన డీలర్లపై ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తోంది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో 109 మంది విత్తన డీలర్లకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ ఎప్పటికప్పుడు సమస్య తీవ్రతను వెలికితీసింది. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలకు వ్యవసాయ, ఉద్యాన శాఖలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘నకిలీ మిరప విత్తనాలు విక్రయించి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చిన మీ డీలర్‌షిప్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ’ నోటీసులు జారీ చేసింది. డీలర్లు ఇచ్చే సమాధానం తర్వాత వారి లెసైన్సులు రద్దు కానున్నాయి.

షోకాజ్ నోటీసులు కేవలం న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఇచ్చినవేనని... నకిలీ విత్తనాలు రైతులకు సరఫరా చేసినట్లు నిర్ధారణ జరిగినందున ఆ డీలర్లందరి లెసైన్సులు రద్దు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఖమ్మం జిల్లాలో 98 మంది డీలర్లు, వరంగల్ జిల్లాలో 9 మంది, నల్లగొండ జిల్లాలో ఇద్దరు డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటికే కొందరి డీలర్‌షిప్ లెసైన్సులు రద్దు చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు విచారణలో నకిలీ మిరప విత్తనాలు విక్రయించిన కంపెనీ ప్రతినిధులు, డీలర్లను అనేకచోట్ల పీడీ యాక్టు కింద అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారు.  రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున డీలర్‌షిప్ లెసైన్సులు రద్దు చేసే పరిస్థితి తలె త్తడం వ్యవసాయశాఖ చరిత్రలో ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. ఇదిలావుంటే రైతులకు నష్టం జరిగిందని తేల్చిన ప్రభుత్వం.. నష్టపరిహారం చెల్లించే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. దీనిపై విమర్శలు వస్తున్నాయి.

 నకిలీవని తేల్చిన నిజనిర్ధారణ కమిటీ..
 నకిలీ మిరప విత్తనాలు అంటగట్టి రైతుల జీవితాలను విత్తన కంపెనీలు, వారికి సంబంధించిన డీలర్లు నిలువెల్లా నాశనం చేశారు. అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం మూడు జిల్లాల్లో 4,420 ఎకరాల మిరప పంటకు నకిలీ విత్తనాల కారణంగా నష్టం జరిగింది. మొత్తం 3,531 మంది రైతులు నష్టపోయారని తేల్చారు. వారికి 121 మంది డీలర్లు నకిలీ మిరప విత్తనాలను అంటగట్టారు. నకిలీ విత్తనాల వల్లే మిరప పంటకు నష్టం జరిగిందని.. ఆయా విత్తనాలు సరఫరా చేసిన ఆరు మిరప విత్తన కంపెనీలు, సంబంధిత డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ బృందం ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement