12మంది తహశీల్దార్లపై కొరడా | Sakshi
Sakshi News home page

12మంది తహశీల్దార్లపై కొరడా

Published Fri, Aug 9 2013 12:56 AM

12 Tahasildarlapai whip

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ భూముల కబ్జాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బండ్లగూడ మండలంలో గతంలో పనిచేసిన 12 మంది తహశీలార్లకు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ జారీకి రంగం సిద్ధమైంది. యూఎల్సీ సర్‌ప్లస్ ల్యాండ్‌గా గుర్తించిన ఖాళీస్థలంలో పదేళ్లుగా ఎన్నో ఆక్రమణలు జరిగిన నేపథ్యంలో 2003 నుంచి ఇప్పటి వరకు తహశీల్దార్లుగా పనిచేసిన వారందరిపై అభియోగాలు మోపనున్నట్లు తెలిసింది. సుమారు 14వేల గజాల విస్తీర్ణం ఉన్న ప్రభుత్వ స్థలంలో దశలవారీగా 8 వేల గజాలకు పైగా భూమి ఆక్రమణలకు గురైంది.
 
ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో అప్పట్నుంచి ఇప్పటి వరకు పనిచేసిన  తహశీల్దార్లందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ వారందరిపైనా చార్జెస్ నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. మొత్తం 12మందిపై చార్జెస్ నమోదు చేయనుండగా, వీరిలో కొందరు పదవీ విరమణ చేసినవారు, మరికొందరు పదోన్నతులపై బయటి జిల్లాలకు వెళ్లిన వారు ఉన్నారు. 
 
ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ అందుకోబోతున్న వారి జాబితాలో బండ్లగూడ మండలం మాజీ తహశీల్దార్లు కృపాకర్, లీల, రమేశ్, చంద్రావతి, కరుణాకర్, శ్రీనివాస్, నరేందర్, వంశీమోహన్, వెంకటేశ్వర్లు, అశోక్, నాగరాజు, సురేశ్‌బాబు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ.. కొందరు ప్రైవేటు వ్యక్తులు లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా, దీనిపై సమగ్ర నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్‌ను లోకాయుక్త ఆదేశించింది. ప్రభుత్వ భూముల ఆక్రమణల వ్యవహారంపై ఎన్నో ఏళ్లుగా నిర్లిప్తంగా వ్యవహరించిన జిల్లా యంత్రాంగం లోకాయుక ్త జోక్యంతో ఎట్టకేలకు కళ్లు తెరిచింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement