‘గులాబీ బాల’కు పదిహేనేళ్లు | Sakshi
Sakshi News home page

‘గులాబీ బాల’కు పదిహేనేళ్లు

Published Wed, Apr 27 2016 3:20 AM

‘గులాబీ బాల’కు పదిహేనేళ్లు - Sakshi

నేడు ఖమ్మంలో టీఆర్‌ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవం
ఉదయం 10 గంటలకు ప్లీనరీ
సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ
15 అంశాలపై తీర్మానాలు చేయనున్న ప్రతినిధులు
పట్టణమంతా గులాబీమయం.. భారీగా బందోబస్తు
ఖమ్మం చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు
ప్లీనరీకి 4 వేల మంది ప్రతినిధులు.. సభకు 2 లక్షల మందిని తరలించేలా ఏర్పాట్లు

 
 సాక్షి, హైదరాబాద్, ఖమ్మం: ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. పోరుబాటతో ప్రస్థానం ప్రారంభించిన టీఆర్‌ఎస్... ఈ ఒకటిన్నర దశాబ్దాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రత్యేక తెలంగాణ సాధించడమేకాదు.. తొలి ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్నీ చేపట్టింది. ఇప్పుడు పార్టీ 15వ ఆవిర్భావ వేడుకను ఘనంగా జరుపుకొంటోంది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రమం తప్పకుండా జరుపుతున్న ప్లీనరీకి ఈసారి ఖమ్మం వేదికైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం ఉదయం ప్లీనరీ, సాయంత్రం బహిరంగ సభ నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు నాలుగు వేల మంది ప్రతినిధులను దీనికి ఆహ్వానించారు. ప్లీనరీలో 15 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక, దీంతో ఎన్నికల సంఘం విధించిన షరతులతో కూడిన అనుమతి మధ్య ప్లీనరీ జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
 ముస్తాబైన ఖమ్మం
టీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా ఖమ్మం పట్టణమంతా తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, బెలూన్లతో గులాబీమయం అయిపోయింది. చెరుకూరి మామిడి తోట సమీపంలో ప్లీనరీ, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఖమ్మంలో 45 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్లీనరీ వేదిక వద్ద ప్రత్యేకంగా వాటర్ కూలింగ్ స్ప్రింక్లర్లు పెట్టారు. బహిరంగ సభకు ఖమ్మంతోపాటు నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి జనసమీకరణపై టీఆర్‌ఎస్ నేతలు దృష్టి పెట్టారు. ఎంపీలు బాల్కసుమన్, సీతారాం నాయక్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం ప్లీనరీ వేదికను పరిశీలించారు. ఇక ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు మంగళవారం రాత్రికే ఖమ్మం చేరుకున్నారు.
 
 ఇదీ షెడ్యూల్
 సీఎం కేసీఆర్ ఎన్నెస్పీ క్యాంపులో టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయానికి ఉదయం 9.30కు భూమిపూజ చేస్తారు. అనంతరం ప్రభుత్వ పీజీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పార్టీ 15 ఏళ్ల ఉద్యమ చరిత్ర ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. 9.45 గంటలకు ప్లీనరీ వేదిక వద్దకు చేరుకుంటారు. ప్లీనరీ ప్రాంగణంలో 4 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మరో వెయ్యి కుర్చీలను అదనంగా అందుబాటులో ఉంచారు. సీఎం కేసీఆర్‌తోపాటు ముఖ్య నేతల కోసం ఏడు అడుగుల ఎత్తులో వేదిక నిర్మించారు.
 
 దానికి కుడివైపున మీడియా ప్రతినిధులకు బ్లాక్ ఏర్పాటు చేశారు. వేదిక ముందుభాగంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునేలా వీఐపీ బ్లాక్‌ను, దాని వెనుక ఏ, బీ బ్లాకులుగా విభజించి పార్టీ ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాటు చేశారు. ఎండవేడిని తట్టుకునేలా హైదరాబాద్, విజయవాడ నుంచి తెప్పించిన ఏసీలను.. ప్లీనరీ ప్రాంగణానికి ఇరువైపులా చల్లదనం కోసం స్ప్రింక్లర్లు, కూలర్లను పెట్టారు. ప్లీనరీ అనంతరం సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ మొదలవుతుంది.
 
 దీనికి 2 లక్షల మందిని తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సభలో 6.30 గంటలకు సీఎం ప్రసంగిస్తారు. ఆయనతోపాటు జిల్లా మంత్రి తుమ్మల, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి తదితరులు మాత్రమే ప్రసంగించేలా ప్రణాళిక రూపొందించారు. ప్లీనరీ, బహిరంగ సభల కోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐజీ, డీఐజీలతో పాటు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు ఏఎస్పీలు, 17 మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 120 మంది ఎస్సైలు సహా పెద్ద సంఖ్యలో సివిల్, ఏఆర్ పోలీసులు, హోంగార్డులు భద్రతా విధుల్లో ఉండనున్నారు.
 
 చేయబోయే తీర్మానాలివే..
పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్ ఈసారి 15 తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ‘సంక్షేమం, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు-రీడిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, వ్యవసాయం, విద్యుత్, పారిశ్రామిక, ఐటీ విధానం, కృష్ణా పుష్కరాలు, శాంతిభద్రతలు-పేకాట-గుడుంబా నిర్మూలన-షీటీమ్స్, కరువు, తెలంగాణ హరితహారం, విభజన హామీలు-కేంద్రంతో ఆమోదింపజేయడం, కేజీ టు పీజీ, పట్టణాభివృద్ధి-హైదరాబాద్ విశ్వనగరం వంటి 15 తీర్మానాలు చేయనున్నారు. ఏ తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెడతారనేదానిపై ఇప్పటికే పార్టీ పెద్దలు సంబంధిత ప్రతినిధులకు సూచించారు.
 
 ప్లీనరీ, బహిరంగ సభ షెడ్యూల్..
 -    ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు
 -    10.10:ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అతిథులను వేదిక మీదకు ఆహ్వానిస్తారు
 -    10.20: అమరులకు శ్రద్ధాంజలి.. రెండు నిమిషాల పాటు మౌనం
 -    10.30: మంత్రి తుమ్మల స్వాగతోపన్యాసం
 -    10.50: పార్టీ ప్రధాన కార్యదర్శి కేకే తొలి ప్రసంగం
 -    11.00: సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం
 -    మధ్యాహ్నం 12.00-1.30 గంటల వరకు 6 తీర్మానాలు
 -    1.30 నుంచి 2.30 వరకు: భోజన విరామం
 -    2.30 నుంచి 4.30 వరకు: 9 తీర్మానాలు, చర్చ
 -    4.45: కేసీఆర్ ముగింపు ఉపన్యాసం
 -    సాయంత్రం 6.00: బహిరంగ సభ ప్రారంభం
 
 ప్రజల ఆశలు నెరవేర్చేలా ప్లీనరీ: తుమ్మల

బంగారు తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చేలా ప్లీనరీలో నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం ఖమ్మంలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ రెండేళ్ల పాలన ఎలా ఉంది, ఇంకా ఏం చర్యలు తీసుకోవాలనే 15 అంశాలపై ఈ ప్లీనరీలో తీర్మానాల ద్వారా చర్చిస్తామన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ఖమ్మం జిల్లాలో ప్లీనరీ నిర్వహణకు సీఎం కేసీఆర్ అవకాశమివ్వడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement