వ్యవసాయానికి విద్యుత్తేజం | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికి విద్యుత్తేజం

Published Mon, Jan 1 2018 1:49 AM

24 hours power to Agriculture In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుక అందించింది. రాష్ట్రంలోని 23 లక్షల పంపుసెట్లకు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరంతర విద్యుత్‌ సరఫరాను ప్రారంభించింది. దీంతో దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ అందిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు వ్యవసాయానికి నిర్ణీత గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు 24 గంటల పాటు సరఫరా చేస్తున్నా చార్జీలు వసూలు చేస్తున్నాయి. 2016 జూలై నుంచి ఉమ్మడి మెదక్, నల్లగొండ,      కరీంనగర్‌ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా సాగుకు 24 గంటల విద్యుత్‌ అందించారు. ఆ తర్వాత నవంబర్‌ 6 నుంచి 20 వరకు 15 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేశారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు(డిస్కం) ఆదివారం అర్ధరాత్రి నుంచి అధికారికంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం మూసాయపల్లిలో రైతు చింతల వెంకట్‌రెడ్డి పొలంలో పంప్‌సెట్‌ను ఆన్‌చేసి 24 గంటల కరెంట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. తెల్లవారుజాము వరకు పలు గ్రామాల్లో పర్యటించి విద్యుత్‌ సరఫరా తీరును పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ కరెంట్‌ సరఫరా విశేషాలను అధికారుల నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమీక్షించారు.

వచ్చే మార్చి కీలకం
వాస్తవానికి గత మూడ్రోజుల నుంచే అనధికారికంగా సాగుకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 8,200 మెగావాట్ల నుంచి 9,400 మెగావాట్లకు ఎగబాకింది. వచ్చే మార్చిలో రబీ పంటలు చివరి దశకు రానున్నాయి. అప్పుడు నీటి అవసరాలు పెరగనున్నాయి. దానికి వేసకి కూడా తోడు కానుండటంతో ఆ నెలలో డిమాండ్‌ భారీగా పెరగనుంది. ఆ నెలలో రికార్డు స్థాయిలో 11 వేల మెగావాట్లకు డిమాండ్‌ పెరగవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అయినా ఆ మేరకు సరఫరా చేస్తామని విద్యుత్‌ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఆటో స్టార్టర్లపై త్వరలో ప్రత్యేక డ్రైవ్‌
సాగుకు 24 గంటల కరెంట్‌ నేపథ్యంలో విద్యుత్‌తోపాటు భూగర్భ జలాలు వృథా కాకుండా  పంపుసెట్లకు బిగించిన ఆటో స్టార్టర్లను తొలగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రైతులకు పిలుపునిచ్చారు. ఆటో స్టార్టర్ల తొలగింపుపై రైతుల్లో అవగాహన, చైతన్యం కల్పించేందుకు జనవరి తొలి వారంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనుంది. మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా గ్రామ సభలు నిర్వహించి రైతుల్లో అవగాహన కల్పించనుంది.

Advertisement
Advertisement