Sakshi News home page

30 లక్షల మందికి ముప్పుతిప్పలే

Published Fri, Dec 2 2016 2:46 AM

30 లక్షల మందికి ముప్పుతిప్పలే

 సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు నిర్ణయం బ్యాంకు ఖాతాలు లేని పేద కుటుంబాల పాలిట అశనిపాతంగా మారింది. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల కుటుంబాలకు బ్యాంకు ఖాతాల్లేవని తెలంగాణ ప్రభుత్వం గతేడాది నిర్వహించిన ఒక రోజు సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. వీరిలో అత్యధికులు బ్యాంకు లావాదేవీలతో సంబంధం లేకుండా కూలీ నాలీ చేసుకొని బతికే చిన్న రైతులు, కూలీలు, కార్మికులు, నిరుపేదలే. చిన్న నోట్ల కొరతతో ఇప్పటికే ఉపాధికి లేక వీరంతా తల్లడిల్లుతు న్నారు. కాస్తో కూస్తో పొదుపు చేసుకున్న తమ డబ్బును మార్చుకోలేక అవస్థలపాలవుతు న్నారు.
 
ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిం చే దిశగా సాగుతుండటంతో ప్రతి కుటుంబ మూ బ్యాంకు ఖాతాలు తెరవటం తప్ప గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. మరో వైపు కొత్త ఖాతాలు తెరిచేందుకు బ్యాంకర్లు కొర్రీలు వేస్తున్నాయి. సమగ్ర సర్వే గణాం కాల ప్రకారం రాష్ట్రంలో 1.01 కోట్ల కుటుం బాలున్నాయి. రాష్ట్రంలో 71.15 లక్షల బ్యాంకు ఖాతాలు, 12.56 లక్షల పోస్టాఫీసు ఖాతాలున్నాయి. బ్యాంకు ఖాతాల్లో 30 శాతంపైగా నిర్వహణలో లేవన్నది బ్యాంకర్ల మాట. మొత్తంమీద నిరంతరం లావాదేవీలు నిర్వహించే ఖాతాలు 30 లక్షలు కూడా లేవు. 
 
 ఇప్పుడు నోట్ల రద్దు నేపథ్యంలో నగదురహిత లావాదేవీలకు, రూ.500, రూ.1000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు ఖాతాలు తప్పనిసరి. దాంతో ఖాతాలు లేని వారికి కొత్తవి తెరిపించాలని జిల్లా కలెక్టర్లకు, బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం పదేపదే సూచిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కొత్త ఖాతాలు తెరిచే కార్యక్రమం ముందుకు సాగటం లేదు. నోట్ల రద్దు పరిణామాలతో తమపై ఒత్తిడి పెరిగిందని, డిసెంబర్ నెలాఖరు వరకు ఖాతాలు తెరిచే ప్రసక్తే లేదంటూ అర్జీదారులను బ్యాంకులు తిప్పి పంపుతున్నారుు. ఇక గ్రామాల్లో బ్యాంకులు అందుబాటులో లేక మండల కేంద్రాలకు వెళ్లినా అక్కడుండే ఒకట్రెండు శాఖలు ఇప్పటికే ఖాతాలు ఎక్కువయ్యాయంటూ కొత్త ఖాతాలు తెరవడం లేదు.
 
 సూర్యాపేట జిల్లాలోనే లక్ష మంది
 రెండ్రోజుల కిందట వీడియో కాన్ఫరెన్‌‌సలోనూ కలెక్టర్లు కొత్త ఖాతాల అంశాన్నే ప్రధానంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల దృష్టికి తెచ్చారు. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే లక్ష కుటుంబాలకు ఖాతాల్లేవని కలెక్టర్ సురేంద్రమోహన్ ప్రభు త్వానికి నివేదించారు. నగదు రహిత లావా దేవీల నిర్వహణకు ప్రభుత్వం నియమిం చిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఖాతాల్లేని వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. కానీ భవన కార్మికులు, కూలీల కోసం తహసీల్ కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించినా పెద్దగా స్పందన లేకపోయి ంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బ్యాం కర్లతో మాట్లాడి స్పెషల్ డ్రైవ్‌లు పెడితే తప్ప ఖాతాల్లేని నిరుపేదల ఇబ్బందులు తొలిగేలా లేవు. 
 
 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం...
 తెలంగాణలో కుటుంబాలు: 1,01,93,207
 మొత్తం జనాభా: 3,63,03,012
 బ్యాంకు ఖాతాలున్న వారు:  71,15,229
 పోస్టాఫీసు ఖాతాలున్న వారు: 12,56,300
 ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు: 7,06,302
 బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు: 27,202
 గొర్రెలు, మేకలు, కోళ్ల ఆధారిత కుటుంబాలు: 27,088
 

Advertisement
Advertisement