బీజేపీ ‘ముట్టడి’ భగ్నం | Sakshi
Sakshi News home page

బీజేపీ ‘ముట్టడి’ భగ్నం

Published Mon, Apr 17 2017 12:57 AM

400 activists arrested

- దశలవారీగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం
- అడ్డుకున్న పోలీసులు..
- 400 మంది కార్యకర్తల అరెస్ట్‌
- అసెంబ్లీ చుట్టూ 12 చెక్‌ పోస్టులు ఏర్పాటు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముస్లిం రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ ఆదివారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నాలుగు కిలోమీటర్ల వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదర్‌గూడలోని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్, బషీర్‌బాగ్‌ చౌరస్తా, ట్రాఫిక్‌ కంట్రోల్‌రూం, రవీంధ్రభారతి, లక్డీకపూల్, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్, ఖాన్‌లతీఫ్‌ఖాన్‌ భవనం, హజ్‌ హౌస్, గన్‌ఫౌండ్రీ తదితర ప్రాంతాల్లో ముందస్తుగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. బీజేపీ కేంద్ర కార్యాలయం, నగర పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే ఇళ్ల వద్ద కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌ తర్వాత గేట్‌ నంబర్‌ 2 వద్ద ధర్నాకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు పంపించేశారు. నగర శాఖలోని కీలక నేతలు వెంకట్‌రెడ్డి తదితరులను ఇళ్ల వద్దే అరెస్ట్‌ చేశారు. దశలవారీగా అసెంబ్లీ వద్దకు దూసుకువచ్చేందుకు ప్రయత్నించిన 400 మంది కార్యకర్తలను అరెస్ట్‌ చేసి గోషామహల్‌ స్టేషన్‌కు తరలించారు. మతపరమైన రిజర్వేషన్లు చేపట్టవద్దంటూ రవీంధ్రభారతి పరిసరాల నుంచి అసెంబ్లీ గేట్‌ నంబర్‌ 1 వద్దకు దూసుకువచ్చిన బీజేపీ మహిళా మోర్చా అ«ధ్యక్షురాలు ఆకుల లలితతో పాటు 15 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే బషీర్‌బాగ్‌ చౌరస్తా నుంచి ర్యాలీ తీసేందుకు ప్రయత్నించిన 25 మంది కార్యకర్తలను అరెస్ట్‌ చేసి చత్రినాక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఖాన్‌లతీఫ్‌ఖాన్‌ భవనంలో ఉన్న 10 మంది బీజేపీ కార్యకర్తలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో దశలవారీగా వచ్చి అసెంబ్లీ ఎదుట దిగి ఆందోళనకు ప్రయత్నించిన కార్యకర్తలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇక జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టులు కొనసాగాయి. 650 మందికిపైగా నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌ చేసినట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రతి జిల్లా శివారు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా వర్గాల సమాచారంతో జిల్లా దాటనివ్వకుండా అడ్డుకున్నారు. ఒక్క అసెంబ్లీ బందోబస్తులోనే ఆరు వేల మందికిపైగా పోలీస్‌ సిబ్బందిని నిమగ్నం చేసినట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement
Advertisement