అగ్రిగోల్డ్ మొదటిదశ వేలంలో 7.53 కోట్లు | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ మొదటిదశ వేలంలో 7.53 కోట్లు

Published Wed, Apr 27 2016 5:03 AM

అగ్రిగోల్డ్ మొదటిదశ వేలంలో 7.53 కోట్లు - Sakshi

హైకోర్టుకు నివేదించిన పర్యవేక్షణ కమిటీ
♦ మూడో దశ వేలానికి రూ.1100 కోట్ల ఆస్తులను గుర్తించాం
♦ తదుపరి విచారణ 29కి వాయిదా
 
 సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో మొదటి దశ ద్వారా రూ. 7.53 కోట్లు వచ్చినట్లు వేలం పర్యవేక్షణ కమిటీ మంగళవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అయితే మొదటి దశలో రూ. 40 కోట్లు వస్తాయని ఆశించామని కమిటీ తరఫు న్యాయవాది రవిప్రసాద్ తెలిపారు.  రెండవ దశ వేలం ప్రక్రియ వచ్చే నెల 11, 12 తేదీల్లో మొదలవుతుందని, మూడో దశ వేలానికి రూ. 1,100 కోట్ల విలువ చేసే పలు ఆస్తులను గుర్తించామని ఆయన తెలిపారు. వేలం నిర్వహణ సంస్థలుగా ఉన్న సామిల్, ఎంఎస్‌టీసీల పనితీరు అనుకున్నస్థాయిలో లేదని తెలిపారు. ఎంఎస్‌టీసీ బ్రాంచ్ మేనేజర్ రాజమాణిక్యం కమిటీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదని కోర్టుకు నివేదించారు.

ఈ నివేదికను పరిశీలించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణ సమయంలో కొన్ని నిర్ధిష్టమైన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఎంఎస్‌టీసీ బ్రాంచ్ మేనేజర్ రాజమాణిక్యంను కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని ఎంఎస్‌టీసీ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.  అగ్రిగోల్డ్ మోసాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వాటిని మంగళవారం మరోసారి విచారించింది.

 స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి...
 అక్షయగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంలో ఆ సంస్థ వ్యవస్థాపక వైస్ చైర్మన్‌గా ఉన్న కూకట్ల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశామని సీఐడీ అధికారులు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. మరింత మంది అరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నామని సీఐడీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్ కోర్టుకు వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఈ కేసును పర్యవేక్షిస్తున్న సీఐడీ డీఎస్‌పీ ఈ మొత్తం వ్యవహారంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అక్షయగోల్డ్ మోసాలపై దాఖలైన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement