మహిళా ఫోర్స్‌.. మరీ వీక్‌! | Sakshi
Sakshi News home page

మహిళా ఫోర్స్‌.. మరీ వీక్‌!

Published Mon, Jan 16 2017 11:16 PM

మహిళా ఫోర్స్‌.. మరీ వీక్‌!

8,734 మందికి ఒకే ఒక మహిళా పోలీస్‌
ఇదీ రాజధానిలో మహిళా పోలీసుల దుస్థితి
గ్రేటర్‌లో మహిళా జనాభా 48.32 లక్షలు
మహిళా పోలీసులు మాత్రం 519
బీపీఆర్‌ అండ్‌ డీ నివేదికలో వెల్లడి  


1/8734..ఇదేదో మార్కుల లెక్క అనుకుంటే పొరపాటే. నగరంలో మహిళా పోలీసుల లెక్క. అవును.. ఇది నిజం. రాష్ట్ర రాజధానిలో మహిళా ఫోర్స్‌.. ఎంత వీక్‌గా ఉందో స్పష్టం చేసే లెక్క. ఇదేం ఆషామాషీగా చెబుతున్న లెక్క కాదు... కేంద్ర అధీనంలోని బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌  (బీపీఆర్‌–డీ) తేల్చిన లెక్క.  – సాక్షి, సిటీబ్యూరో

గ్రేటర్‌ జనాభాలో మహిళలు 48 శాతం. జనాభాలో దాదాపు సగం మహిళలు ఉన్నప్పటికీ.. మహిళా పోలీసులు మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టే విధంగా ఉన్నారు. నగరంలోని రెండు కమిషనరేట్ల పరిధిలో కేవలం 519 మంది మహిళా పోలీసులే ఉన్నారు. అంటే ప్రతి 8,734 మంది మహిళలకు ఒకే ఒక్క మహిళా పోలీస్‌ అందుబాటులో ఉన్నారు. 2015 సంవత్సరానికి సంబంధించి బీపీఆర్‌ అండ్‌ డీ విడుదల చేసిన పోలీస్‌ సిబ్బంది గణాంకాల నివేదికలో మహానగరంలో మహిళా పోలీస్‌.. మరీ

2011 జనాభా ప్రాతిపదికన...
బీపీఆర్‌ అండ్‌ డీ ప్రతి ఏటా అన్ని రాష్ట్రాలు, కమిషనరేట్లలోని పోలీస్‌ సిబ్బంది వివరాలను సేకరిస్తుంది. ఆయా ప్రాంతాల్లోని జనాభాతో పురుష–మహిళా పోలీసులు, సివిల్‌–ఆర్మీ రిజర్వ్‌ బలగాల్లోని సిబ్బందిని గణించి నివేదిక రూపొందిస్తుంది. తాజాగా విడుదల చేసిన నివేదికకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంది. ప్రస్తుతం రాజధానిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లు ఉన్నాయి. అయితే 2015 నాటికి కేవలం హైదరాబాద్, సైబరాబాద్‌ మాత్రమే ఉండటంతో.. ఆ రెండింటినే పరిగణిలోకి తీసుకున్నారు. మొత్తానికి నగరంలో సరిపడా మహిళా పోలీసులు లేరని ఈ నివేదిక స్పష్టం చేసింది. మహిళా పోస్టులు పెంచడంతో పాటు భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బీపీఆర్‌ అండ్‌ డీ రాష్ట్రాలను కోరింది.

మహిళా పోలీసులు 3.8 శాతమే...  
రెండు కమిషనరేట్లలో కలిపి క్షేత్రస్థాయిలో సివిల్‌ సిబ్బంది 13,623 మంది ఉండగా, వీరిలో మహిళా అధికారులు, సిబ్బంది కేవలం 519 మందే ఉన్నారని ఈ నివేదికలో తేలింది. వీరిలోనూ మూడో వంతు కానిస్టేబుల్‌ కంటే పైస్థాయి వారే. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోని సిబ్బందిలో కేవలం 3.8 శాతం మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారని బీపీఆర్‌ అండ్‌ డీ పేర్కొంది. మహిళా ఉద్యమకారుల్ని అదుపు చేయడం అత్యంత సున్నితమైన అంశం కావడంతో పాటు మహిళా పోలీస్‌ సిబ్బంది తక్కువగా ఉండడం, ఉన్నవారిలోనూ ఫిట్‌నెస్‌ లోపాలతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  
 

ఎస్‌హెచ్‌ఓగా ఒక్కరూ లేరు..
జంట కమిషరేట్లలో 100కు పైగా లాఅండ్‌ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్లు, ఐదు మహిళా ఠాణాలున్నాయి. ప్రస్తుతం మహిళా ఠాణాలకు ఉమెన్‌ ఆఫీసర్లే నేతృత్వం వహిస్తున్నారు. అయితే శాంతి భద్రతల విభాగంలోని ఏ ఒక్క స్టేషన్‌కు కూడా మహిళా అధికారి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌(ఎస్‌హెచ్‌ఓ)గా లేరు. అనివార్య కారణాలతో కొన్నేళ్లుగా మహిళా పోలీసుల పోస్టులను పెంచకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. గతంలో ఖాళీలకు నోటిఫికేషన్‌ ఇచ్చినా అభ్యర్థినుల నుంచి సరైన స్పందన ఉండేది కాదు. తాజాగా చేపట్టిన రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడంతో పాటు అనేక వెసులుబాట్లు కల్పించారు. దీంతో పోలీస్‌ విభాగంలో మహిళల కొరత తీరుతుందని అధికారులు చెబుతున్నారు.

సమస్యలతో సతమతం...
మహిళా పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడంతో.. ప్రస్తుతం జంట కమిషనరేట్లలో ఉమెన్‌ హోంగార్డులతో ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీరిది పూర్తిస్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉన్న పోస్టు కాకపోవడం.. శిక్షణ భిన్నంగా ఉండడంతో భద్రత సహా కీలక, కార్యనిర్వాహక అంశాల్లో వీరిని వినియోగించుకోవడం సాధ్యం కావట్లేదు. ప్రస్తుతమున్న మహిళా సిబ్బందిని ఫిట్‌నెస్‌ సమస్య వెంటాడుతోంది. స్థూలకాయం, ఏళ్లుగా కార్యాలయ విధులకు పరిమితం కావడంతో క్షేత్రస్థాయి విధులు, ఆందోళనకారుల అదుపు వీరికి సాధ్యం కానివిగా మారాయి. మహిళా పోలీస్‌ సిబ్బంది కొరత తీర్చడంతో పాటు ఉన్న వారిలోనూ నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ఉమ్మడి రాష్ట్రంలో తెరపైకి వచ్చిన ప్రతిపాదనలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. మహిళా పోలీసులకు సమకాలీన అంశాలపై అవగాహన కల్పించడం, వృత్తిలో మెలకువలు నేర్పే ఉద్దేశంతో ‘క్రాష్‌కోర్స్‌’ నిర్వహించాని భావించారు. బృందాల వారీగా కొందరికి పూర్తయినా తర్వాత ఆగిపోయింది. ప్రత్యేక మహిళా బెటాలియన్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేసినా ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement