8 లక్షల పాస్‌పోర్టుల జారీ లక్ష్యం | Sakshi
Sakshi News home page

8 లక్షల పాస్‌పోర్టుల జారీ లక్ష్యం

Published Tue, Feb 3 2015 12:14 AM

8 లక్షల పాస్‌పోర్టుల జారీ లక్ష్యం

పీఓ అశ్వినీ సత్తార్
‘ఎక్స్‌పిడీషియస్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్’      ప్రారంభం
మూడు రోజుల్లో వెరిఫికేషన్: కమిషనర్    సీవీ ఆనంద్
ఎస్‌బీ సిబ్బందికి ట్యాబ్స్ పంపిణీ
 

గచ్చిబౌలి:  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లే ఈ ఏడాది 8 లక్షల పాస్‌పోర్టులు ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వినీ సత్తా ర్ తెలిపారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో ‘ఎక్స్‌పిడీషియస్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్’ను ఆమె ముఖ్యతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ  సందర్భంగా అశ్వినీ సత్తార్ మాట్లాడుతూ  విదేశాంగ శాఖ గతేడాది ఆయా రాష్ట్రాలకు కోటి పాస్‌పోర్టులు లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. సమైక్య రాష్ట్రంలో 7 లక్షల పాస్ పోర్టులు జారీ చేశామన్నారు. ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 8 లక్షల పాస్ పోర్టులు జారీ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రపంచంలో పాస్‌పోర్టుల జారీలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ 3వ స్థానంలో ఉందన్నారు. పారదర్శకంగా వెరిఫికేషన్ రిపోర్టు ఇచ్చే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. తాత్కాల్ పాస్‌పోర్టు కోసం ఐపీఎస్‌ల వెరిఫికేషన్ తప్పని సరికాదని అఖిల భారత సర్వీస్‌లో విధులు నిర్వహిస్తున్న గెజిటెడ్ ఆఫీసర్లు వెరిఫికేషన్ చేయొచ్చన్నారు.  ఇంటెలిజెన్స్ డీఐజీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం జిల్లాలోని ఎస్‌పీ కార్యాలయాలకు  పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం ఎంతో మంది వచ్చేవారని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు.

107 రోజుల నుంచి 7 రోజులకు తగ్గిండమే ఎంతో గొప్ప విషమన్నారు. నేడు వెరిఫికేషన్ సమయాన్ని 3,4 రోజులకు తగ్గిండం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదన్నారు  స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఇంటెలిజెన్స్ ఐజీ రమేశ్ మాట్లాడుతూ... పాస్‌పోర్టుల జారీలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్ చేసేందుకు 2012లో దేశ వ్యాప్తంగా సరాసరి 107 రోజులు పడితే.. సమైకాంధ్రలో 21 రోజులు పట్టేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరి 9 రోజులలో వెరిఫికేషన్ జరుగుతోందన్నారు.  సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..  ఇంటెలిజెన్స్ విభాగం, సైబరాాబాద్ పోలీసులు, రీజనల్ పాస్‌పోర్టు అధికారులు 8 నెలలు శ్రమించి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ‘ఎక్స్‌పిడీషియస్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్’ను ప్రారంభించామన్నారు. దీని ద్వారా ప్రస్తుతం 13 రోజుల ఉన్న వెరిఫికేషన్ సమయాన్ని 3 లేక 4 రోజులకే పరిమితం చేయనున్నామన్నారు.  ఆన్‌లైన్ పాస్‌పోర్టు దరఖాస్తులను సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం నుంచి ఆయా పోలీస్ స్టేషన్‌లలో పనిచేసే ఫీల్డ్ ఆఫీసర్ల (ఎస్‌బీ అధికారి)కు పంపిస్తామన్నారు.

వారు ట్యాబ్‌లో దరఖాస్తును చూసుకొని వెరిఫికేషన్ చేసి రిపోర్టును ట్యాబ్‌లోనే సబ్‌మిట్ చేస్తారన్నారు. ఆ రిపోర్టును సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం సిబ్బంది పరిశీలించి రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయానికి ఆన్‌లైన్‌లో పంపిస్తారని, దీంతో 3 లేదా 4 రోజుల్లో పాస్‌పోర్టు జారీ చేసేందుకు అవకాశముంటుందని చెప్పారు. వెరిఫికేషన్‌కు ఎప్పుడు వచ్చేది దరఖాస్తుదారుడికి ఎస్‌ఎంఎస్ అలర్ట్ పంపిస్తామన్నారు. కాగా, ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రఘువాసు రూపొందించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement