విధుల బహిష్కరణకు సహకరిస్తే చర్యలే | Sakshi
Sakshi News home page

విధుల బహిష్కరణకు సహకరిస్తే చర్యలే

Published Wed, Jun 22 2016 2:44 AM

విధుల బహిష్కరణకు సహకరిస్తే చర్యలే - Sakshi

- తెలంగాణ న్యాయాధికారులకు హైకోర్టు హెచ్చరిక
- కొద్ది రోజుల క్రితం అంతర్గత సర్క్యులర్
- విధుల బహిష్కరణ సరికాదు: ఏసీజే
- విధులకొచ్చే న్యాయవాదులకు రక్షణ కల్పిస్తాం
 
 సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను వ్యతిరేకిస్తూ తెలంగాణ న్యాయవాదులు కొద్ది రోజులుగా ఆందోళనలు, ముఖ్యంగా కోర్టుల బహిష్కరణ కొనసాగిస్తున్న నేపథ్యంలో హైకోర్టు కొద్ది రోజుల క్రితం ఓ కీలక అంతర్గత సర్క్యులర్ జారీ చేసింది. న్యాయవాదుల కోర్టుల బహిష్కరణకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహాయ సహకారాలందిస్తున్నట్లు తెలిస్తే తీవ్రంగా పరిగణిస్తామని తెలంగాణ న్యాయాధికారులను హెచ్చరించింది.

వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విధుల బహిష్కరణ సందర్భంగా కొందరు న్యాయాధికారులు కాల్ వర్క్ పూర్తి చేసి, కేసుల విచారణ చేపట్టకుండా చాంబర్లకే పరిమితమవుతున్నట్లు తమ దృష్టికి వచ్చినందుకే సర్క్యులర్ జారీ చేస్తున్నట్లు పేర్కొంది. ‘‘న్యాయాధికారులు నెలవారీగా పరిష్కరించాల్సిన కేసుల కోటాను పూర్తి చేయకపోవడానికి లాయర్ల కోర్టుల బహిష్కరణను కారణంగా చూపితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. న్యాయాధికారిని విధులను నిర్వర్తించకుండా లాయర్లు గానీ, మరెవరైనా గానీ అడ్డుకుంటే తన యూనిట్ హెడ్ దృష్టికి తీసుకురావాలి. వారు ఆ న్యాయాధికారికి పోలీసు రక్షణ కల్పించి కోర్టు విధులు సక్రమంగా జరిగేలా చూడాలి’’ అని ఆదేశించింది. కారణమేదైనా లాయర్లెవరూ విధులు బహిష్కరించొద్దని సుప్రీంకోర్టు కూడా పేర్కొందంటూ, ఆ తీర్పు కాపీని న్యాయాధికారులకు హైకోర్టు పంపింది.

 రక్షణ కల్పిస్తాం...
 విధుల బహిష్కరణ వల్ల పేద కక్షిదారులే నష్టపోతారని లాయర్లు గ్రహించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే పేర్కొన్నారు. మంగళవారం ఓ కేసు విచారణను ఆయన నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేయగా, ఆ రోజు విధుల బహిష్కరణ ఉందంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సోమవారానికి వాయిదా కోరారు. ఆ కార్యక్రమాలతో తమకు సంబంధం లేదన్న ధర్మాసనం, తదుపరి వాయిదాలివ్వబోమని పేర్కొంది. వాయిదా కోరబోనని, రక్షణ కల్పిస్తే వాదనలు వినిపిస్తానని ఆయన చెప్పారు. రక్షణ కోరితే నిస్సందేహంగా వెంటనే కల్పిస్తామని ధర్మాసనం పేర్కొంది.
 
 ఏసీజే ఉన్నత స్థాయి భేటీ
 తెలంగాణ న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చిన సందర్భంగా జస్టిస్ బొసాలే మంగళవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది.
 
 ‘ఏపీఏటీ చైర్మన్ రాజీనామా చేయాలి’
 ఓ న్యాయవాదికి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ సముద్రాల గోవిందరాజులు వైఖరిని నిరసిస్తూ ఉభయ రాష్ట్రాల న్యాయవాదులు మంగళవారం ఏపీఏటీలో విధులను బహిష్కరించారు. చాంబర్ ముందు నినాదాలు చేశారు. గోవిందరాజులు రాజీనామా చేయాలన్నారు.
 
 ఇంద్రకరణ్‌ను కలిసిన జేఏసీ నేతలు
  హైకోర్టు విభజన, న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాలపై జోక్యం చేసుకోవాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు మంగళవారం న్యాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిశారు. జేఏసీ అధ్యక్షుడు ఎం.రాజేందర్‌రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు, న్యాయవాద సంఘాల సమాఖ్య అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లక్కరాజు హరిరావు  వినతిపత్రం సమర్పించారు. లాయర్ల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

Advertisement
Advertisement