హక్కులే శ్వాసగా.. | Sakshi
Sakshi News home page

హక్కులే శ్వాసగా..

Published Wed, Jun 22 2016 11:38 PM

హక్కులే శ్వాసగా.. - Sakshi

నినదించిన నారీలోకం   ‘మహిళా విధానం’పై సుదీర్ఘ చర్చ
ప్రక్షాళనతోనే సమాజ మార్పు

 

ఆకాశం ఆమె.. ఆలోచన ఆమె.. అన్నింటా అభివృద్ధి ఆమె. అయినా ఆమె సమాజంలో ద్వితీయ శ్రేణి పౌరురాలే. ఇంటా బయటా అంతటా లింగ వివక్షే. పనిచేసే చోట అణచివేత ధోరణులు కనిపిస్తునే ఉన్నాయి. ఓపక్క ఇంటిని చక్కదిద్దుకుంటూ.. పురుషులతో సమానంగా పనిచేస్తున్నా ఆమె శ్రమకు దక్కే ప్రతిఫలం మాత్రం సగమే. ఇల్లూ, బడీ, గుడీ, వ్యవసాయం, పారిశ్రామికం.. కార్యక్షేత్రం ఏదైతేనేం.. అన్నింటా వివక్షే. దాన్ని ఛేదించేందుకు దశాబ్దాలుగా పోరాటం చేస్తునే ఉంది. స్త్రీ హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలని ఒకటిన్నర దశాబ్దాల తరువాత భారత ప్రభుత్వం ‘మహిళా విధానాన్ని’ రూపొందించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా దక్షిణ భారత మహిళల ప్రాంతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించింది. జాతీయ మహిళా కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్ సంయుక్తాధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ సమావేశానికి కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. 2016 మహిళా పాలసీపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత చట్టాలను, విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, వివక్షారహిత సమాజ ఏర్పాటుకు పలు సూచనలు చేశారు. - సాక్షి, సిటీబ్యూరో

 

న్యాయవ్యవస్థలో మార్పు అవసరం
న్యాయ వ్యవస్థను, పోలీసులను సమూలంగా ప్రక్షాళన చేసినప్పుడే స్త్రీల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. స్త్రీలకు ఉద్దేశించిన చట్టాలు మన దేశంలో చాలా తక్కువ. వాటిలో గృహహింసకు సంబంధించిన ఏకైక చట్టం ‘498ఏ’. ఇది దుర్వినియోగం అవుతుందని సుప్రీంకోర్టు చెప్పడం స్త్రీలపట్ల న్యాయ వ్యవస్థకున్న దృక్పథాన్ని స్పష్టం చేస్తోంది. ఇటువంటి తీర్పులు స్త్రీల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. కేరళలో కళాలయ జ్యోతి ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల్లో లీగల్ అవేర్‌నెస్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు అన్ని దశల్లోనూ బాలికల, మహిళల సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. అందుకు ప్రత్యేకించిన కౌన్సిలర్స్‌ను కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే  యువతకు పెళ్లికి ముందు ఉమన్ కమిషన్, కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశాం. పెళ్లికి ముందు మా కౌన్సిలింగ్‌లో పాల్గొన్నట్టు సర్టిఫికెట్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.    - కేసి రోజా కుట్టి, కేరళ ఉమన్ కమిషన్ చైర్‌పర్సన్

 

మహిళా కమిషన్‌కు అధికారం ఇవ్వాలి
స్త్రీలపై వివక్షకు హద్దులేదు. అన్ని రంగాల్లోను అన్ని వర్గాల స్త్రీలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. చట్టాలుంటే చాలదు, అవి సక్రమంగా అమలు జరగాలి. మహిళా కమిషన్‌ని నామమాత్రంగా ఉంచితే సరిపోదు. దానికి కొన్ని అధికారాలు ఉండాలి. సమానమైన పనికి సమాన వేతనం మన దేశంలో ఎక్కడా అమలు జరగడం లేదు. క్షేత్రస్థాయి మహిళల నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్న స్త్రీల వరకు ఎవరికీ సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదు. సరోగసీ ద్వారా ఒక మహిళ 15 మందికి జన్మనిచ్చింది. ఆమె ఆరోగ్య బాధ్యత ఎవరిది? ఈ పాలసీలో చెప్పాలి. విశాఖ కమిటీ సిఫార్సుల ప్రకారం పని ప్రదేశాల్లో కంప్లెయింట్ బాక్స్‌లు ఉండాలి. ఈ ఫిర్యాదు కమిటీల్లో స్త్రీలకు న్యాయం జరుగుతున్న దాఖలాలు లేవు. దీనికి కారణం యాజమాన్యాలే ఈ కమిటీల్లో సభ్యులుగా ఉండడం. యాజమాన్యాల భాగస్వామ్యం లేని కమిటీలు కావాలి.  - వత్సల, తమిళనాడు వుమన్ కమిషన్ సభ్యురాలు

 

‘మహిళా పాలసీ’ చేయాలి..
దేశంలో ఎక్కడా ఏ వర్గం మహిళలకూ సరైన గౌరవం దక్కడం లేదన్నది నిర్వివాదాంశం. ప్రధానంగా మైనారిటీ మహిళలు, దళితులు మరింత దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత చట్టాలను బలోపేతం చేయాలి. ఈ చట్టాల అమలుపై పర్యవేక్షణ ఉండాలి. కర్నాటక మహిళా అయోగ్ కమిషన్ ద్వారా కేసులను మేం డీల్ చేస్తున్నాం. కర్నాటకలో వరకట్నం, యువతులపై యాసిడ్ దాడులు తీవ్రమైన సమస్యగా ముందుకొస్తున్నాయి. చట్టాలెన్ని ఉన్నా దోషులు తప్పించుకునే వీలు కూడా ఈ చట్టాల్లోనే ఉంటోంది. దాన్ని అరికట్టే దిశగా ప్రభుత్వం మహిళా విధానాన్ని రూపొందించాలి. కర్నాటకలోనూ మహిళా కమిషన్‌కి ప్రత్యేక బడ్జెట్ లేకపోయినా ప్రభుత్వ సాయంతో హింసకు గురైన మహిళలను ఆదుకుంటున్నాం.  - అనితా గుర్జాల్, కర్నాటక మహిళా కమిషన్ సభ్యురాలు

 

స్త్రీల ఆరోగ్య హక్కుల మాటేమిటి?
దళిత, ఆదివాసీ స్త్రీల ఆరోగ్యాంశాలను ఈ విధానం స్పృశించలేదు. ఆరోగ్యం ప్రైవేటైజ్ అయిన తర్వాత స్త్రీలకైనా, పురుషులకైనా హక్కులెలా ఉంటాయి? ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత కావాలి. ప్రధానంగా స్త్రీల ఆరోగ్యం ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యతే. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలి. విద్యావ్యవస్థ బలోపేతం కాకుండా స్త్రీ విద్య అసాధ్యం. అన్నిరంగాల్లో వివక్ష ఉన్నట్లే కుటుంబాల్లో బాలికల విద్యపట్ల సైతం వివక్ష ఉంది. ఓ పక్క అన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ హక్కుల గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. ముందుగా స్త్రీల హక్కులు మావన హక్కులేనా కాదా అన్నది చర్చిస్తే.. స్త్రీల హక్కులను మానవ హక్కులుగా గుర్తిస్తే అప్పుడు వారి సమస్యలను సరైన కోణంలో అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది.              - విమల, రచయిత్రి

 

‘మహిళా బిల్లు’తోనే సాధ్యం
చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఇంతవరకు సాధ్యం కాలేదు. దీనిపై ప్రభుత్వాలు ఆలోచించాలి. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం లేకుండా మహిళా సాధికారత అసాధ్యం. అన్ని రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఆలోచించాలి. గృహహింసకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించాలి. మహిళా కమిషన్‌కు అధికారాలు ఉండాలి. అలాగే కమిషన్‌కి నిధులు కూడా అవసరం. కమిషన్‌కు స్వయం ప్రతిపత్తినివ్వాలి.  - త్రిపురాన వెంకటరత్నం. తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్

 

దళిత స్త్రీల సమస్యలు ప్రధానం
దళిత, ఆదివాసీ స్త్రీల సమస్యలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ పాలసీలో అది లోపించింది. అన్ని వర్గాల స్త్రీలను ఒకేగాటన కట్టలేం. కుల, లింగ వివక్షకు, అణచివేతకు గురవుతున్న ఈ వర్గాల స్త్రీల సమస్యలపై పాలసీ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం వుంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న శ్రామిక స్త్రీల సమస్యలను సైతం ఈ పాలసీ విస్మరించింది. ఇంటి పనివారి సమస్యల ప్రస్తావన కూడా ఈ పాలసీలో లేదు. వీరంతా దళిత స్త్రీలే. దళిత, ఆదివాసీ స్త్రీల హక్కులను కాపాడకుండా ఈ దేశం ఎటువంటి అభివృద్ధినీ సాధించలేదు. - రూత్ మనోరమ, జాతీయ దళిత మహిళా సంఘం

 

లింగ వివక్ష అప్రజాస్వామికం
బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయకపోతే సమాజం భావ దారిద్య్రంలో మునిగిపోతుంది. జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు కొంత ప్రయోజన కరంగా ఉన్నప్పటికీ, మహిళల విద్యావకాశాల విషయంలో మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. భారతదేశంలో విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చారు. కుల, లింగ వివక్షతో విద్యను నిరాకరించడం అప్రజాస్వామికం. అలాగే  ఐసీడీఎస్‌ల ఉద్దేశం కేవలం పౌష్టికాహారం సరఫరా మాత్రమే కాదు.. ప్రిప్రైమరీ విద్యను అందించడం కూడా. కానీ ఎక్కడా అమలు జరగడం లేదు.
- ప్రొఫెసర్ రమా మేల్కొటే

 

మహిళా రైతుల హక్కులను గుర్తించాలి
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలను హక్కుదారులుగా గుర్తించడంలో ఇప్పటి దాకా ఎటువంటి ప్రయత్నం జరగలేదు. వ్యవసాయం గురించి మాట్లాడేటప్పుడు మహిళా రైతులను దృష్టిలో పెట్టుకోవాలి. రైతాంగానికి ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీలు, సహాయం, రుణాలు అన్నింటిలోను సమాన వాటా ఉండేలా చూడాలి. అందులో ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు మరింత ప్రత్యేకమైన సహకారం అందించాలి. అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నరైతు కుటుంబాలను నడుపుతున్నది కూడా మహిళా రైతులే. కాబట్టి దీనిపై ప్రత్యేకమైన సర్వే నిర్వహించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో సాగుతున్న అభివృద్ధిలో మహిళలకు సముచిత స్థానం కల్పంచే విధంగా ఈ విధానం రూపొందించాలి. - రుక్మిణీ రావు, గ్రామ్య స్వచ్ఛంద సంస్థ

 

 

50 శాతం రిజర్వేషన్ తప్పనిసరి..
స్త్రీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని హామీ యిస్తేనే ఆ రాజకీయ పార్టీకి గుర్తింపునివ్వాలి. అలా ఇవ్వని పక్షంలో ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. అలాగే జెండర్ బడ్జెట్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మాదిరిగా స్త్రీలకు ప్రత్యేకించిన బడ్జెట్ కేటాయింపులు అవసరం. అన్ని రకాల స్త్రీ హింసలకు అసమానతలే కారణం. అసమానతలను పెంచి పోషించే విద్యావ్యవస్థను నిరాకరించాలి. స్త్రీ, పురుష సమానత్వాన్ని బోధించే పాఠ్యపుస్తకాలను తెలంగాణ ప్రభుత్వం కొన్ని క ళాశాలల్లో ప్రవేశపెడుతోంది. ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా జరగాలి. అన్ని రంగాల్లో స్త్రీల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి.  - కె. లలిత, యుగాంతర్ స్వచ్ఛంద సంస్థ

 

పాఠ్యాంశాల్లో మార్పు అవసరం
అన్నిచోట్లా స్త్రీలపై హింస పెరిగిపోతోంది. దీన్ని అడ్డుకోవాలంటే చిన్నప్పటి నుంచే పిల్లలల్లో మార్పు తీసుకురావాలి. ఇందుకోసం స్త్రీ, పురుష సమానత్వాన్ని పెంపొందించే అంశాలను, సామాజిక స్పృహను అందించే విషయాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి. వాటిని అన్ని వయసుల్లోను వారికి బోధించాలి. చట్టాలపై అవగాహన కూడా విద్యార్థులకు తప్పనిసరి. ఈ విషయాలన్నింటినీ మహిళా విధానంలో భాగం చేయాలి.    - స్వాతి లక్రా, షీటీమ్స్ ఇన్‌చార్జ్

 

Advertisement
Advertisement