ఉస్మానియా వర్సిటీకి ఏ–ప్లస్‌ | Sakshi
Sakshi News home page

ఉస్మానియా వర్సిటీకి ఏ–ప్లస్‌

Published Wed, Sep 13 2017 3:38 AM

ఉస్మానియా వర్సిటీకి ఏ–ప్లస్‌

11 విద్యా సంస్థలకు న్యాక్‌ గుర్తింపు
అందులో ఐదు ప్రభుత్వ విద్యా సంస్థలే
కాకతీయకు, జేఎన్‌టీయూహెచ్‌కు ఏ గ్రేడ్‌
తాజా ర్యాంకులను ప్రకటించిన న్యాక్‌ స్టాండింగ్‌ కమిటీ
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 11 విద్యా సంస్థలకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌(న్యాక్‌) గుర్తింపు లభించింది. ఢిల్లీలో మంగళ వారం న్యాక్‌ 27వ స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లోని విద్యా సంస్థలతోపాటు రాష్ట్రంలోని 11 విద్యా సంస్థలకు న్యాక్‌ గుర్తింపును ప్రకటించింది. రాష్ట్రంలోని 11 సంస్థల్లో ఐదు ప్రభుత్వ విద్యా సంస్థలు కాగా, ఒకటి ఎయిడెడ్‌ విద్యా సంస్థ కావడం విశేషం. మరో ఐదు ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ, సదుపాయాలు, ల్యాబ్‌లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ గుర్తింపును ఇచ్చింది. వాటిల్లో యూనివర్సిటీలకు వచ్చిన క్యుమిలేటివ్‌ గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(సీజీపీఏ) ఆధారంగా గ్రేడ్లను కేటాయించింది. ఈ గుర్తింపు ఐదేళ్లపాటు అమలులో ఉంటుంది.
 
ఓయూకు ఏ ప్లస్‌..
నాలుగేళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ న్యాక్‌ గ్రేడ్‌ను సాధించింది. గతంలో ఓయూకు ఏ గ్రేడ్‌ మాత్రమే ఉండగా ఈసారి ఏ ప్లస్‌ గ్రేడ్‌ను దక్కించు కుంది. మూడో విడత తనిఖీల తర్వాత న్యాక్‌ ఉస్మాని యాకు ఏ ప్లస్‌ గ్రేడ్‌ను ప్రకటించింది. దీంతో ఉస్మా నియా తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్న ట్లయ్యింది. ఏ ప్లస్‌ గ్రేడ్‌ రావడంతో యూజీసీ నుంచి, ఇతరత్రా పరిశోధనలకుగానూ ఓయూకు అధిక మొత్తంలో నిధులు రానున్నాయి. 2008 ఫిబ్రవరిలో ఉస్మానియా వర్సిటీకి న్యాక్‌ ఏ గ్రేడ్‌ రాగా 2013తో ఆ గుర్తింపు కాలం ముగిసింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత గుర్తింపు లభించడం పట్ల ఉస్మానియా వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం హర్షం వ్యక్తం చేశారు. ఫ్యాకల్టీ, సిబ్బంది, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
 
చాన్నాళ్ల తర్వాత జేఎన్‌టీయూహెచ్‌కు..
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్‌కు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఏ గ్రేడ్‌ లభించింది. ఏ ప్లస్‌ గ్రేడ్‌ కోసం వర్సిటీ వర్గాలు ఎంతగానో కృషి చేశాయి. న్యాక్‌ బృందం పరిగణనలోకి తీసుకునే అనేక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేశారు. అయినా ఏ గ్రేడ్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎనిమిదేళ్లుగా న్యాక్‌ గుర్తింపు లేకపోవడం వల్ల యూజీసీ నిధులను అధిక మొత్తంలో రాబట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వర్సిటీ ప్రస్తుతం న్యాక్‌ గుర్తింపు లభించడంతో మరింత పురోగమించే అవకాశం ఉంది. న్యాక్‌ గుర్తింపు కోసం కృషి చేసిన అందరికీ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఫ్రొఫెసర్‌ వేణుగోపాల్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
 
పాత స్థానాన్ని దక్కించుకున్న కేయూ
కాకతీయ యూనివర్సిటీ న్యాక్‌ ఏ గ్రేడ్‌ను సాధిం చింది. 2009లో కాకతీయ వర్సిటీకి ఏ గ్రేడ్‌ గుర్తింపు రాగా.. 2014తో ఆ గుర్తింపు ముగిసింది. మూడేళ్ల తర్వాత మళ్లీ న్యాక్‌ ఏ గ్రేడ్‌ను సాధించుకుంది.
 
ఇంకా మంచి ఫలితాలు సాధించండి: కడియం శ్రీహరి
న్యాక్‌ ఏ ప్లస్, ఏ గ్రేడ్లను సాధించిన వర్సి టీలు, కాలేజీల అధికారులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అభినందనలు తెలిపారు. ఇంకా బాగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. మిగతా వర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కూడా న్యాక్‌ గుర్తింపు సాధించే దిశగా కృషి చేయాలని, తద్వారా వర్సిటీలు, కాలేజీల అభివృద్ధికి కేంద్రం, యూజీసీ నుంచి అధిక  నిధులను రాబట్టుకోవచ్చని వెల్లడించారు.

Advertisement
Advertisement