ఖాతా మారిందా.. డబ్బు గోవిందా.. | Sakshi
Sakshi News home page

ఖాతా మారిందా.. డబ్బు గోవిందా..

Published Fri, Dec 13 2013 4:01 AM

ఖాతా మారిందా.. డబ్బు గోవిందా.. - Sakshi

 వ్యాపారులకు నైజీరియన్ల వల
 =సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ ‘అకౌంట్ టేకోవర్’
 =నగరానికి చెందిన జ్యువెలరీ సంస్థకు టోకరా
 =ఈ ఏడాది ఇప్పటికే రూ.50 లక్షలు స్వాహా
 =ఈ-మెయిల్‌లో ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్త

 
 సాక్షి, సిటీబ్యూరో: లాటరీలు, బహుమతుల పేరుతో వల విసరడం మొన్నటి స్టైల్.. ఉద్యోగాలు, సెల్‌టవర్ల ఏర్పాటు పేరుతో ఎర వేయడం నిన్నటి పంథా.. హ్యాకింగ్, స్పూఫింగ్ మెయిల్స్ ద్వారా ఏకంగా ఖాతాలనే ఏమార్చేయడం ప్రస్తుత శైలి..
 
ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లే పెట్టుబడిగా ఆన్‌లైన్‌లో అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు ఇటీవల చేస్తున్న నేరం ‘అకౌంట్ టేకోవర్’. ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ-మెయిల్ ఖాతాలను హ్యాక్ చేయడం, చెల్లింపుల సమయం వరకు వేచి చూసి బ్యాంక్ ‘ఖాతా’ మార్చేడం ద్వారా తేలిగ్గా లక్షలు, కోట్లలో స్వాహా చేస్తున్నారు. ఈ నేరగాళ్ల బారినపడి రూ.10 లక్షలు నష్టపోయిన నగరానికి చెందిన జ్యువెలరీ సంస్థ కేసును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లోని సైబర్ క్రైమ్ ఠాణా అధికారులు, రూ.2.35 కోట్లు పోగొట్టుకున్న ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన  పొగాకు వ్యాపారి కేసును సీఐడీ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
‘అకౌంట్ టేకోవర్’ ఇలా..

తొలుత నైజీరియన్లు గ్రూపులుగా ఏర్పడి వ్యాపార, ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ-మెయిల్ ఐడీలను హ్యాక్ చేస్తున్నారు. లావాదేవీల తీరు, భాషా శైలి, చెల్లింపులు/వసూళ్ల విధానాన్ని కొంతకాలం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండు రాష్ట్రాలు, దేశాల మధ్య ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేసే వారే వీరికి ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. కాగా, ఈ సైబర్ నేరగాళ్లు సరిగ్గా లావాదేవీలు జరిగే సమయంలో స్పూఫింగ్‌కు దిగుతున్నారు. నిర్ణీత రుసుం తీసుకుని స్పూఫింగ్ సాఫ్ట్‌వేర్, సదుపాయాన్ని అందించే వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌లో చాలా ఉన్నాయి.

వీటి సర్వర్లు విదేశాల్లో ఉండటం వీళ్లకు కలిసొస్తోంది. ఈ సైట్‌లోకి ప్రవేశించాక సదరు వ్యక్తి ఈ-మెయిల్ ఐడీతో పాటు ఆ మెయిల్ అందుకోవాల్సిన వ్యక్తిది, రిసీవ్ చేసుకునేప్పుడు అతడి ఇన్‌బాక్స్‌లో ఏది కనిపించాలో అది కూడా పొందుపరుస్తారు. ఆపై నగదు తీసుకోవాల్సిన వ్యక్తి పంపినట్లే ఇవ్వాల్సిన వారికి మెయిల్ చేస్తారు. అప్పటికే వ్యాపారుల ఈ-మెయిల్స్ హ్యాక్ చేసి ఉండటంతో వారే పంపిస్తున్నట్లు కస్టమర్లకు లేఖ పంపిస్తున్నారు. అందులో- అనివార్య కారణాలతో తమ బ్యాంకు ఖాతా మారిందని, కొత్త ఖాతాలో నగదు వేయాలని చెబుతూ నేరగాళ్లు తమకు సంబంధించిన నెంబర్ ఇస్తున్నారు. దీంతో సదరు వ్యాపారికి చేరాల్సిన డబ్బు వీరి ఖాతాలో పడిపోతోంది.
 
నిరుద్యోగులతో ఖాతాలు తెరిపించి..

 అకౌంట్ టేకోవర్ నేరాల్లో బ్యాంకు ఖాతాలే కీలకం. వీటిని నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉండటంతో నైజీరియన్లు ఇక్కడి బోగస్ చిరునామాలతో ఖాతాలు తెరుస్తున్నారు. ఇందుకోసం ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఏజెంట్లను పెట్టుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలను తెరిచి, సహకరిస్తే ప్రతి లావాదేవీలోనూ భారీగా కమీషన్ ఇస్తామంటూ ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఎర వేస్తున్నారు. వీరికి అనుమానం రాకుండా.. కొందరు రాజకీయ ప్రముఖుల నల్లధనాన్ని తాము వైట్ మనీగా మారుస్తామని, అందుకే ఖాతాలంటూ నమ్మబలికి ఒప్పిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఖాతాలు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య- ఏజెంట్లకు నైజీరియన్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో దొరకడం కష్టమవుతుంది.
 
 మంగత్‌రాయ్ జ్యువెలర్స్ నుంచి ఇలా


 నగరానికి చెందిన మంగత్‌రాయ్ జ్యువెలర్స్ సంస్థ ఉత్తరాదిలో ఉన్న కొన్ని సంస్థలతో లావాదేవీలు చేస్తుంది. దీనికి సంబంధించిన ఈ-మెయిల్ మార్పిడిలు ఉన్నాయి. వీటిని హ్యాక్ చేసిన నేరగాళ్లు ఉత్తరాదిలో ఉన్న సంస్థ మెయిల్ చేసినట్లు జ్యువెలర్స్‌కు ఈ-మెయిల్ పంపారు. అందులో తమ బ్యాంకు ఖాతా సంఖ్య ఇచ్చారు. దీంతో మంగత్‌రాయ్ నిర్వాహకులు రూ.20 లక్షల్ని ఆ ఖాతాల్లో వేశారు. వెంటనే అప్రమత్తం కావడంతో కోల్‌కతా ఖాతాలో ఉన్న రూ.10 లక్షలు తిరిగి వచ్చినా... నోయిడా అకౌంట్‌లోవి నేరగాళ్ల పాలయ్యాయి.
 
 పొగాకు వ్యాపారి పుట్టిముంచారిలా...


 ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన పొగాకు వ్యాపారి బి.కోటయ్య బల్గేరియాకు చెందిన డెల్కమ్ కంపెనీకి ఇటీవల రూ.2.35 కోట్ల విలువైన పొగాకును ఎగుమతి చేశారు. ఈయన బ్యాంక్ ఖాతా టంగుటూరులోని విజయ బ్యాంక్‌లో ఉండగా.. సైబర్ నేరగాళ్లు డెల్కమ్ సంస్థకు కోటయ్య పంపినట్లే మెయిల్ పంపారు. ఇందులో ఈ నగదును టర్కీ, అమెరికాల్లో ఉన్న ఖాతాల్లో వేయమంటూ మెయిల్ పెట్టి తమ ఖాతాల్లోకి వేయించుకున్నారు. బాకీ చెల్లించమంటూ కోటయ్య డెల్కమ్ సంస్థను సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
 సరిచూసుకోకుంటే నష్టమే..


 అకౌంట్ టేకోవర్ నేరాలతో ఈ ఏడాది ఇప్పటి వరకు నగరానికి చెందిన ముగ్గురు వ్యాపారులు రూ.50 లక్షలకు పైగా నష్టపోయారు. ఈ తరహా నేరాల్లో నిందితులు చిక్కడం, నగదు రికవరీ కష్టం. కాబట్టి వ్యాపారులు అప్రమత్తంగా ఉండటమే మేలు. బ్యాంక్ ఖాతా మారిందంటూ మెయిల్ వస్తే అనుమానిం చాలి. మీరు లావాదేవీలు నెరిపే వారితో ఖాతా మారితే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని స్పష్టంగా చెప్పండి. నిర్ధారించుకోకుండా నగదు లావాదేవీలు వద్దు.     
 - ఉమామహేశ్వరరావు, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్
 

Advertisement
Advertisement