యాసిడ్‌ దాడి నిందితుడి అరెస్టు | Sakshi
Sakshi News home page

యాసిడ్‌ దాడి నిందితుడి అరెస్టు

Published Wed, Jul 19 2017 1:08 AM

యాసిడ్‌ దాడి నిందితుడి అరెస్టు - Sakshi

24 గంటల్లో పట్టుకున్న పోలీసులు
 
హైదరాబాద్‌: యాసిడ్‌ దాడి చేసి పరారైన నిందితుడిని హైదరాబాద్‌ పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అతడి ఆచూకీ తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం బాలానగర్‌ డీసీపీ సాయి శేఖర్, ఏసీపీ శ్రీనివాస్‌రావు వివరాలు వెల్లడించారు. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ దత్తాత్రేయ నగర్‌లో నివాసముండే ఎం.డి.ఖదీరా(23) సుభాష్‌నగర్‌లోని ఓ ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో పనిచేస్తోంది. సుభాష్‌నగర్‌లో ఉంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రదీప్‌ చాలక్‌(25) ప్రేమిస్తున్నానని రెండేళ్లుగా ఆమె వెంటబడుతున్నాడు. అందుకు ఖదీరా ససేమిరా అంటోంది.

సోమవారం రాత్రి 8.30కు దత్తాత్రేయనగర్‌ వచ్చి ఆమెకు ఫోన్‌ చేశాడు. ఇంటి నుంచి బయటకు రమ్మని కోరగా ఖదీరా నిరాకరించింది. తాను ఇక్కడే చనిపోతానని బెదిరించడంతో అతని వద్దకు వచ్చింది. పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఖదీరా అంగీకరించలేదు. తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ఆమె ముఖంపై చల్లి పరారయ్యాడు. 40% కాలిన గాయాలతో ఆమె ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మంగళవారం ఉదయం కొల్‌కతాకు పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న ప్రదీప్‌ కదలికలపై పోలీసులు నిఘా పెట్టి కట్టడి చేశారు. రాత్రి నుంచి సీఐ డి.వి.రంగారెడ్డి, పలువురు ఎస్సైలు 3 బృందాలుగా విడిపోయి అతడి కోసం గాలిస్తున్నారు. ప్రదీప్‌ సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా సుభాష్‌నగర్‌లో జల్లెడ పట్టారు. సీసీఎస్‌ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అనుమానం ఉన్న బిల్డింగ్‌ చుట్టూ పోలీసులను మోహరించి వల పన్ని గదిలో ఉన్న ప్రదీప్‌ను పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులను డీసీపీ అభినందించారు. 

Advertisement
Advertisement