జేవీ రమణమూర్తి కన్నుమూత | Sakshi
Sakshi News home page

జేవీ రమణమూర్తి కన్నుమూత

Published Thu, Jun 23 2016 2:40 AM

జేవీ రమణమూర్తి కన్నుమూత - Sakshi

  • నాలుగేళ్లుగా కేన్సర్‌తో అస్వస్థత
  • సాక్షి, హైదరాబాద్/ విజయనగరం:
    కన్యాశుల్కం గిరీశం పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన ప్రముఖ రంగస్థల, సినీనటుడు జేవీ రమణమూర్తి(83) కన్నుమూశారు. గత నాలుగేళ్లుగా క్యాన్సర్ (సామస్సెల్ కాన్షినోమా)తో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో ఇంట్లో కుమార్తె శ్రీదేవి మాత్రమే ఉన్నారు. తండ్రి పడుతున్న ఇబ్బందిని గమనించి ఆమె అంబులెన్స్‌లో స్థానిక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న పది నిమిషాల్లోనే (రాత్రి 7.30 గంటలకు) ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు, అల్లుడు అందుబాటులో లేరు. వారు వచ్చే వరకు భౌతిక కాయాన్ని ఆస్పత్రి మార్చురీలోనే భద్రపర్చనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నటుడు సోమయాజులుకు రమణమూర్తి స్వయానా సోదరుడు. ఆయన 1933 మే 20న విజయనగరం జిల్లాలో జన్మించారు.

    గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అదే ఇష్టంతో ఆయన నటరాజ కళాసమితిని స్థాపించి 42 ఏళ్ల పాటు దాదాపు వెయ్యిసార్లకు పైగా కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించారు. కె.బి.తిలక్ సహకారంతో 1957లో సినీరంగ ప్రవేశం చేసి దాదాపు 200 సినిమాల్లో నటించారు. ఎమ్మెల్యే, మంచి మనసుకు మంచి రోజులు, మాంగళ్య బలం, బాటసారి, బావా మరదళ్లు, అమాయకులు, దొంగల దోపిడి, కటకటాల రుద్రయ్య, మరో చరిత్ర, సిరిసిరిమువ్వ, గోరింటాకు, గుప్పెడు మనసు, ఇది కథకాదు, శుభోదయం, ఆకలి రాజ్యం, గడసరి అత్త సొగసరి కోడలు, సప్తపది, శుభలేఖ, మాయాజాలం, శంకర్‌దాదా జిందాబాద్.. అందులో కొన్ని. రమణమూర్తి మృతిపట్ల కళాకారులు, కవులు, అభిమానులు  తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement