ప్రధాని మోదీకి లేఖ రాస్తాను: నటుడు సుమన్ | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి లేఖ రాస్తాను: నటుడు సుమన్

Published Mon, Apr 11 2016 9:06 AM

ఓయూలో మాట్లాడుతున్న సుమన్, టీటీడీపీ అధ్యక్షుడు రమణ తదితరులు - Sakshi

 పూలే జయంతి రోజున సెలవు ప్రకటించాలి
 జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి

 
 ఉస్మానియా యూనివర్సిటీ: దేశ చరిత్రలో మహాత్మ జ్యోతిరావు పూలేకు సముచిత స్థానం కల్పించాలని, ఆయన జయంతి రోజున జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని, పాఠ్యాంశాలలో ఫూలే జీవిత చరిత్రను చేర్చాలని సినీ నటుడు సుమన్ కోరారు. ఈ మేరకు తాను ప్రధాని మోదీకి లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం, ఓయూజేఏసీ, తెలంగాణ విద్యార్థి  సేఫ్టీ ఫెడరేషన్, బీసీ జేఏసీ, విశ్వకర్మ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫూలే 189వ జయంతి ఉత్సవాల సందర్భంగా సభ నిర్వహించారు.

కార్యక్రమానికి తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఓయూ జేఏసీ ఛైర్మన్ వట్టికూటి రామారావుగౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన నటుడు సుమన్ మాట్లాడుతూ  హక్కుల సాధనకు బీసీలందరూ ఏకమై పోరాడాలన్నారు. ఆదివారం విశాఖపట్టణంలో సరైనోడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉన్నప్పటికీ పూలే జయంతి సభకు హాజరయ్యానని సుమన్ వివరించారు. బీసీల సభలు ఎక్కడ జరిగినా ప్రతి బీసీ హాజరుకావాలన్నారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్,  విశిష్ట అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, యువజన నాయకుడు అనిల్‌కుమార్‌యాదవ్, బీసీ జేఏసీ చైర్మన్ బొమ్మ హన్మంతరావు, కన్వీనర్ పుప్పాల మల్లేష్, తెలంగాణ విద్యార్థి సెఫ్టీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజ్‌గౌడ్,  చెన్న శ్రీకాంత్,  ఓబీసీ జాతీయ అధ్యక్షులు దునుకు వేలాద్రీ, టీఆర్‌ఎస్వీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ద్వాత్రిక స్వప్న తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, రాజ్యసభ సభ్యులు వీహెచ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలన పై విరుచుకపడ్డారు. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement