'స్థానిక' జల్సాలకు నేటితో ఫుల్‌స్టాప్ | Sakshi
Sakshi News home page

'స్థానిక' జల్సాలకు నేటితో ఫుల్‌స్టాప్

Published Sat, Dec 26 2015 3:20 PM

'స్థానిక' జల్సాలకు నేటితో ఫుల్‌స్టాప్

రేపే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
30న ఓట్ల లెక్కింపు, ఫలితాలు
నల్గొండ, రంగారెడ్డిలో హోరాహోరీ
ఉత్కంఠభరితంగా మారిన మహబూబ్‌నగర్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నిక
పక్షం రోజులుగా విహారయాత్రల్లో ఉన్న ఓటర్లు

 
హైదరాబాద్‌
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల విహారయాత్రలు నేటితో ముగియనున్నాయి. దాదాపు 15 రోజులుగా దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విహరిస్తున్న ఈ ఓటర్లు ఆదివారం ఉదయం నాటికి ఆయా జిల్లాలకు చేరుకోనున్నారు. తెలంగాణలోని స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 2 న నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల కోటాలో తెలంగాణలోని మొత్తం 12 స్థానాలకు గాను అదిలాబాద్, నిజామాబాద్ , మెదక్, వరంగల్ ఒక్కో స్థానంతో పాటు కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
 
ఆయా పార్టీలు పోటీలో ఉన్న కారణంగా రెండేసి స్థానాలున్న రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఒక్కో స్థానం ఉన్న నల్గొండ, ఖమ్మం స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన డిసెంబర్ 30వ తేదీన ఉంటాయి.
 
బరిలో ఎవరెవరు..
రంగారెడ్డి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అయిదురుగు పోటీ పడుతుండగా, పోటీ ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానాలకు నలుగురు పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఒక్కో స్థానం ఉన్న నల్గొండలో నలుగురు, ఖమ్మం జిల్లాలో ఐదుగురు పోటీలో ఉన్నారు. రంగారెడ్డిలో 770, మహబూబ్‌నగర్‌లో 1262, నల్గొండలో 1120, ఖమ్మంలో 726 మంది ఓటర్లు ఉన్నారు.
 
రంగారెడ్డిలో పట్నం నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు (టీఆర్‌ఎస్), ఎ. చంద్రశేఖర్ (కాంగ్రెస్), బుక్కా వేణుగోపాల్ (టీడీపీ), కొత్త అశోక్ గౌడ్ (స్వతంత్ర) పోటీలో ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో జగదీశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి (టీఆర్‌ఎస్), దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్), కొత్తకోట దయాకర్‌రెడ్డి (టీడీపీ), జగదీశ్వర్‌రెడ్డి (స్వతంత్ర) పోటీ పడుతున్నారు. రసవత్తరంగా మారిన నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్), తేరా చిన్నపరెడ్డి (టీఆర్‌ఎస్), మల్లేష్‌గౌడ్ (కాంగ్రెస్ రెబల్-స్వతంత్ర), మిట్ట పురుషోత్తమరెడ్డి (స్వతంత్ర) పోటీ చేస్తున్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం కోసం బాలసాని లక్ష్మినారాయణ (టీఆర్‌ఎస్), పువ్వాడ నాగేశ్వరరావు (సీపీఐ), లింగాల కమల్‌రాజు (వైఎస్సార్‌సీపీ)లతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గౌడి లక్ష్మినారాయణ, కరణం లక్ష్మినారాయణ రంగంలో ఉన్నారు.
 
పక్షం రోజులుగా ఖుషీఖుషీ...
ఈ ఎన్నికల పుణ్యమా అని గడిచిన 15 రోజులుగా స్థానిక సంస్థల ఓటర్లకు పండుగే పండుగ. బరిలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులు తమ పార్టీ ఓట్లను కాపాడుకోవడం, ఇతర పార్టీల ఓట్లకు గాలం వేయడం వంటి ఎత్తులకు పైఎత్తులతో ఈ ఎన్నికలు పోటాపోటీగా మారాయి. ఆయా పార్టీలు క్యాంపుల ఏర్పాటుచేసి తమకు అనుకూలమైన ఓటర్లను తరలించారు. గత 15 రోజులుగా ఓటర్లను కాపాడుకోవడానికి దక్షిణాది రాష్టాలు ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని అనేక పర్యాటక ప్రాంతాల్లో తిప్పుతున్నారు.
 
ఒక్కోచోట కొద్దిరోజులు ఉంటూ అనేక పర్యాటక ప్రాంతాల్లో తిరిగారు. అన్నిచోట్లా వారికి సకల సౌకర్యాలను ఆయా పార్టీల అభ్యర్థులు సమకూర్చారు. ఆదివారం పోలింగ్‌లో పాల్గొనే విధంగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఓటర్లందరినీ శనివారం నాటికి హైదరాబాద్‌కు తరలించారు. ఆదివారం ఉదయానికి ఆయా జిల్లాలకు చేరవేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎమ్మెల్యీ స్థానం కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయి. ఆదివారం పోలింగ్ పూర్తయ్యే వరకు ఓటర్లను కాపాడుకోవడానికి నేతలు నానా తంటాలు పడుతున్నారు.
 
నల్గొండ, రంగారెడ్డిలో హోరాహోరీ...
నల్గొండలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఆయా క్యాంపుల్లో తమ ఓటర్లను లెక్కించుకుని, ఇతర క్యాంపుల్లోని ఓటర్లు ఇచ్చిన మాటల మేరకు గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఎవరు గెలిచినా అతి స్వల్ప మెజారిటీ తప్ప ఇక్కడి నుంచి భారీ మెజారిటీ ఉండదని అంటున్నారు. రంగారెడ్డిలో రెండు స్థానాలను గెలుచుకుంటామని టీఆర్‌ఎస్ నమ్మకంతో ఉన్నా.. కాంగ్రెస్ ఒక స్థానం చేజిక్కించుకుంటామన్న ధీమాతో ఉంది. ఖమ్మంలో సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం పార్టీలు మద్దతునిస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్ ఆకర్ష్ కార్యక్రమాన్ని తీవ్రతరం చేసి భారీసంఖ్యలో జెట్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లను పార్టీలో చేర్పించుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఆ సీటును కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపుపై నమ్మకంతో ఉంది. మహబూబ్‌నగర్‌లో రెండుస్థానాలకు టీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇస్తుండగా, ఒక స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ తామే గెలుస్తామన్న ఆశతో ఉంది.

Advertisement
Advertisement