కాంగ్రెస్‌తో పొత్తు, అవగాహన ఉండదు : సీపీఎం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో పొత్తు, అవగాహన ఉండదు : సీపీఎం

Published Thu, Aug 4 2016 1:35 AM

కాంగ్రెస్‌తో పొత్తు, అవగాహన ఉండదు : సీపీఎం - Sakshi

రాష్ట్ర కమిటీకి స్పష్టం చేసిన సీపీఎం జాతీయ నాయకత్వం
బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాన దూరం పాటించాలని నిర్ణయం


హైదరాబాద్: జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి ఎన్నికల పొత్తులు, సర్దుబాట్లు, అవగాహనా ఉండదని సీపీఎం జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరాన్ని పాటించాలని నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పరోక్ష పొత్తు, సర్దుబాట్లతో తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బుధ, గురువారాల్లో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు బుధవారం నగరానికి వచ్చిన పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు జాతీయ రాజకీయాలపై తన నివేదికలో పేర్కొన్న అంశాల గురించి వివరించారు.

విశాఖలో జాతీయ మహాసభల్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలనేది పార్టీ వైఖరి అని ఆయన స్పష్టంచేశారు. వామపక్షాలు, కలిసొచ్చే ప్రగతిశీల శక్తులతో కలసి ముందుకు సాగాలన్న నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు. సమావేశాల తొలి రోజు రాష్ట్ర పార్టీ నిర్మాణ డాక్యుమెంట్, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ అంశాలకు సంబంధించి పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముసాయిదాను సమర్పించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అందుకు అనుసరించాల్సిన విధానంపై చర్చించారు.

 
కోర్టు తీర్పును గౌరవించాలి..

జీవో 123ను హైకోర్టు కొట్టివేయడంపై సీపీఎం రాష్ట్ర కమిటీ హర్షం తెలిపింది. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా ఇప్పటికైనా తన తప్పిదాలను గ్రహించి హైకోర్టు తీర్పును గౌరవించాలని, భూసేకరణ చట్టం 2013 ప్రకారమే భూములను సేకరించాలని సూచించింది. హైకోర్టు తీర్పు భూనిర్వాసితులకు ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొంది.

 

Advertisement
Advertisement