కోట్లు దండుకోవడమే బాబు లక్ష్యం | Sakshi
Sakshi News home page

కోట్లు దండుకోవడమే బాబు లక్ష్యం

Published Fri, Oct 28 2016 3:28 AM

కోట్లు దండుకోవడమే బాబు లక్ష్యం - Sakshi

వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపాటు
కోర్టులు మొట్టికాయలు వేసినా బాబుకు బుద్ధి రావడం లేదు

సాక్షి,హైదరాబాద్: న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా సీఎం చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి, రూ.లక్షల కోట్లు దండుకోవాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని,కోర్టులు దీన్ని అడ్డుకున్నాయని చెప్పారు. అంబటి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.స్విస్ చాలెంజ్‌లో సింగపూర్ కంపెనీలే పాల్గొనడం ఏమిటని ఆదిత్య కన్‌స్ట్రక్షన్ కంపెనీ, ఎన్‌వీఎస్ ఇంజనీర్స్ కంపెనీలు హైకోర్టులో సవాల్ చేస్తే, సింగిల్ జడ్జి 54 పేజీల ఉత్తర్వులిచ్చారని గుర్తు చేశారు.

ప్రభుత్వం విలువలకు తిలోదకాలు ఇచ్చే ప్రయత్నం చేసిందని కోర్టు స్పష్టంగా తీర్పు ఇస్తే చంద్రబాబు తన తప్పు తెలుసుకోకపోగా డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లడాన్ని అంబటి ఆక్షేపించారు. న్యాయస్థానాలకు దొరక్కుండా రూ.లక్షల కోట్లు సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రణాళికలు వేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్లినవారిని బాబు అభివృద్ధి నిరోధకులుగా, ఉన్మాదులుగా పోల్చారన్నారు. మరి హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌ని ఎందుకు ఉపసంహరించుకుందని  నిలదీశారు. ఇంకా ఏం మాట్లాడారంటే...
 
వాటాల మర్మం ఏమిటో చెప్పాలి
‘‘స్విస్ చాలెంజ్ విధానంలో పెట్టుబడుల మర్మం ఏమిటో సీఎం చంద్రబాబే చెప్పాలి. 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్లు, సింగపూర్ కంపెనీలు కేవలం రూ.300 కోట్లు పెట్టుబడులుగా పెడుతాయి. ఇందులో సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు 58 శాతం, ఏపీ ప్రభుత్వానికి 42 శాతం వాటా ఉంటుందనడం ఆశ్చర్యకరం. దోపిడీకి ఇది పరాకాష్ట. దీనికోసమే చంద్రబాబు స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1,691 ఎకరాల్లో జరిగేది రాజధాని నిర్మాణం కానేకాదు, పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు.
 
బాబుకు కడుపు మంట
ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి యువత, నిరుద్యోగుల నుంచి లభిస్తున్న మద్దతు చూసి చంద్రబాబు కడుపు మండుతోంది. యువభేరిలకు వెళ్లొద్దని బాబు చెబితే వినేవాళ్లు ఎవరూ లేరు.  హోదా కోసం  జగన్ చేస్తున్న పోరాటాన్ని అడ్డుకుంటే బాబు మూతి కాలడం ఖాయం.
 
ఆర్డినెన్స్‌ను కోర్టులో సవాల్ చేస్తాం
స్విచ్ చాలెంజ్‌పై హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కూడా చట్టాలను మార్చి మళ్లీ అదే విధానాన్ని మొండిగా ప్రజలపై రుద్దాలని చూస్తున్నారు. ఆర్డినెన్స్‌ను కోర్టులో సవాల్ చేస్తాం. ప్రజల సొమ్మును కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలి. ’’ అని అంబటి రాంబాబు వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement