కేంద్రాన్ని నిధులు అడిగే ధైర్యముందా? | Sakshi
Sakshi News home page

కేంద్రాన్ని నిధులు అడిగే ధైర్యముందా?

Published Sat, Apr 2 2016 1:47 AM

కేంద్రాన్ని నిధులు అడిగే ధైర్యముందా? - Sakshi

♦ ప్రజాదరణ ఉందన్న భ్రమ కల్పించేందుకే ఫిరాయింపులకు చంద్రబాబు ప్రోత్సాహం
♦ వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి గట్టిగా నిధులు అడిగి తెచ్చుకునే ధైర్యం లేకపోవడంతోపాటు రెండేళ్ల పాలనలో హామీలు నెరవేర్చక ప్రజల మన్నన పొందలేకపోయిన సీఎం చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని డబ్బులిచ్చి కొని తనకే ప్రజాదరణ ఉందని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్ని కాపాడడానికి ఏకంగా మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటరీ విలువల్నిసైతం చంద్రబాబు ప్రభుత్వం తుంగలోకి తొక్కడం దురదృష్టకరమన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘కేంద్ర ఆర్థికమంత్రి రాష్ట్రానికి రూ.రెండువేల కోట్లివ్వాలని ప్రతిపాదిస్తే.. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) కేవలం రూ.900 కోట్ల విడుదలకు అంగీకరించింది. గతంలో ఇచ్చిన నిధులకు సంబంధించి ఖర్చుల వివరాలతో కూడిన యూసీ సర్టిఫికెట్ ఇచ్చేవరకూ ఆ రూ.900 కోట్లను కూడా విడుదల చేయవద్దని ప్రధాని ఆదేశాలిచ్చారు. ఇంతకుముందు రాష్ట్రానికిచ్చిన డబ్బులు సరిగా ఖర్చు పెట్టలేదని వారితో కలసి పోటీ చేసినవారే అనుమానపడే పరిస్థితి ఏర్పడిందంటే.. అందుకు బాబు సిగ్గుపడాలి’’ అని విమర్శించారు. ప్రజల గొంతు వినిపించే ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కడమే కాదు.. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే మీడియాను, పత్రికలను బెదిరించడానికి ప్రభుత్వంలోని వారు పాల్పడుతున్నారని అంబటి మండిపడ్డారు. డబ్బులతో శాశ్వతంగా తామే అధికారంలో ఉంటామని బాబు, ఆయన కుమారుడు విర్రవీగుతున్నారని, ఇలాంటి ఆలోచనలు చేసిన ఎందరో యోధులే మట్టికరిచారని వ్యాఖ్యానించారు.
 
 ఎంత రెచ్చగొట్టినా జగన్ ప్రజా గొంతుకే అయ్యారు
 అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలు ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా.. వాళ్లు అనుభవం లేదంటున్నా.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పి ప్రజల సమస్యల్ని సభలో బలంగా వినిపించారని అంబటి తెలిపారు. అనుభవం లేదన్న జగన్‌కు పట్టుమని ఐదు నిమిషాలపాటు ఏకధాటిగా మాట్లాడే అవకాశం ఎందుకు దక్కనీయలేదని ప్రశ్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement