గ్రామాల్లో అంబేడ్కర్ జయంతి వేడుకలు | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో అంబేడ్కర్ జయంతి వేడుకలు

Published Fri, Mar 25 2016 12:56 AM

గ్రామాల్లో   అంబేడ్కర్ జయంతి వేడుకలు


ఏప్రిల్ 14 నుంచి 24 వరకు..  అభివృద్ధికి {పత్యేక కార్యక్రమాలు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి


హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి వేడుకల సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి 24 వరకు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల బలోపేతానికి ‘గ్రామ్ ఉదయ్ సే లేకర్ భారత్ ఉదయ్ తక్’ అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొనేలా చేయడంతో పాటు సభలు, సమావేశాల ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించనున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల బలోపేతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. ఏపీలో కాల్‌మనీ వల్ల జరిగిన అకృత్యాలు దేశంలో ఎక్కడా జరగకూడదనే ఉద్దేశంతో ముద్ర బ్యాంక్ ద్వారా రూ.1.8 లక్షల కోట్ల రుణాలు అందజేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. గత యూపీఏ హయాంలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉండేదని, ప్రధాని నరేంద్ర మోదీ బ్లాక్‌మార్కెట్‌ను పూర్తిగా అరికట్టడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేసేందుకు ఈ-మార్కెటింగ్ వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

 
హెచ్‌సీయూ ఘటనపై నో కామెంట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తాను మాట్లాడబోనని దత్తాత్రేయ స్పష్టం చేశారు. హెచ్‌సీయూ తన శాఖ పరిధిలోకి రాదని, సంబంధిత శాఖ వారే స్పందిస్తారని అన్నారు. ‘హెచ్‌ఆర్డీకి గతంలో మీరు రాసిన లేఖలకు సమాధానం వచ్చిందా?’ అని విలేకరుల అడగ్గా.. ‘హెచ్‌సీయూ విద్యార్థుల సస్పెన్షన్ వ్యవహారం కోర్టులో ఉంది. దీనిపై మాట్లాడదలచుకోలేదు’ అని చెప్పారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ హైదరాబాద్ పర్యటనపై ‘నో కామెంట్’ అంటూ దాటవేశారు. ఎన్డీఏ ప్రభుత్వ పారదర్శక పాలనను ఓర్వలేని కొన్ని దుష్టశక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నాయని దత్తాత్రేయ మండిపడ్డారు.

 

Advertisement
Advertisement