నగరంలో ఆంగ్లో ఇండియన్స్ | Sakshi
Sakshi News home page

నగరంలో ఆంగ్లో ఇండియన్స్

Published Sat, Jan 9 2016 4:42 AM

నగరంలో ఆంగ్లో ఇండియన్స్

200 ఏళ్లుగా నగర జీవనంతో మమేకం క్రమేపీ తగ్గుతున్న జనాభా నగరంలో ‘ఆంగ్లో ఇండియన్స్’కు ఓ ప్రత్యేకత ఉంది. భాష, ఆహార్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో సమ్మిళిత సంస్కృతికి ప్రతినిధులు వీరు. జీవన విధానంలో ఒక వైవిధ్యం కనిపిస్తుంది.. వారు ఎక్కడ ఉంటే అక్కడ ‘లిటిల్ ఇంగ్లండ్’ ఆవిష్కారమవుతుంది. రెండు భిన్న జాతుల సహజీవనానికి ప్రతీకలుగా  200 ఏళ్లకు పైగా తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఒకప్పటి బ్రిటన్ పూర్వీకులకు వారసులుగా ఇక్కడే పుట్టి పెరిగిన వీరు..  భాగ్యనగర జీవనంలో అంతర్భాగమయ్యారు. గ్రేటర్ ఎన్నికల వేళ ఆంగ్లో ఇండియన్స్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
     - పగిడిపాల ఆంజనేయులు

 
ఒక సికింద్రాబాద్-ఒక ఇంగ్లండ్: నిజమే.. ఇది ఇప్పటి సంగతి కాదు. వందల ఏళ్ల నాటి చరిత్ర. నిజాం సంస్థానంలో సైనిక పటాలాలు, పరిపాలన కార్యాలయాలు, నివాస సముదాయాలను ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డ ఆంగ్లేయులతో సికింద్రాబాద్ ఇంగ్లండ్‌ను తలపించేది. ఆంగ్లేయుల పేరుతో వెలసిన ‘జేమ్స్ స్ట్రీట్’ వంటి బస్తీలు, ప్యారడైజ్‌లు, ప్యాట్నీలు  ఆ సంస్కృతికి ప్రతిబింబాలు. తెల్లవాళ్ల విలక్షణమైన జీవన విధానం, భాష, దుస్తులు, అలంకరణ ఇక్కడి వారిని బాగా ప్రభావితం చేసింది.

ఇక్కడి ప్రజల జీవన విధానంతో బ్రిటీష్ వారు కూడా ప్రభావితమయ్యారు. అలా సికింద్రాబాద్ ఒక సమ్మిళిత సంస్కృతికి కేంద్రబిందువైంది. బొల్లారం నుంచి మెట్టుగూడ వరకు, అల్వాల్ నుంచి లాలాగూడ వరకు కంటోన్మెంట్, పౌర ప్రభుత్వ కార్యాలయాలు వెలసిన ప్రతి చోటా కొత్త సంస్కృతి కూడా వెల్లివిరిసింది.
 
భిన్న సంస్కృతి ఇలా..
ఆంగ్లేయులు ఇక్కడి అమ్మాయిలను వివాహం చేసుకొని స్థిరపడ్డారు. అలా స్థిరపడిన వారి సంతతి ఆంగ్లో ఇండియన్స్. ఈస్టిండియా  కంపెనీ కూడా ఈ సాంస్కృతిక సహజీవనాన్ని బాగా ప్రోత్సహించింది. భారతీయ మహిళలను వివాహం చేసుకునేవారికి ఆ రోజుల్లో 5 రూపాయల ప్రోత్సాహక బహుమతి కూడా ఇచ్చేవారు. అలా నగరంలోని సైనిక్‌పురి, దక్షిణ లాలాగూడ, మెట్టుగూడ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలు ఆంగ్లో ఇండియన్లకు నిలయమయ్యాయి.
 
‘ఒక్క శాతం’తో మొదలై..
ఆంగ్లో ఇండియన్లకు బ్రిటన్ ప్రభుత్వం సముచితమైన స్థానమిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించడంతో  ఈ సమూహం ఆర్థికంగా స్థిరపడింది. రైల్వేలు, పోస్టల్, టెలికమ్యూనికేషన్స్, క్రీడలు, సైన్యం, విద్య, వైద్యం వంటి రంగాల్లో చాలా మంది స్థిరపడ్డారు. 1956 నుంచి  ఇప్పటి వరకు అనేక మంది ఆంగ్లో ఇండియన్ ప్రముఖులు రాజకీయాల్లో రాణించారు. శాసన సభ్యులుగా నియమితులయ్యారు. తొలి దశాబ్దాల్లో  జాన్ ఫెర్నాండెజ్, మెజోరి గాడ్‌ఫ్రె, క్లారిస్ మోరిస్, ఆస్వాల్డ్ పెడ్రో వంటి వారు ఆ తరువాత, ఇటీవల కాలంలో  క్రిస్టీనా లాజరస్, డెల్లా గాడ్‌ఫ్రె, ప్రస్తుతం ఎల్విస్ స్టీఫెన్‌సన్ వంటివారు రాజకీయ రంగంలో ఉన్నారు.
 
అభివృద్ధికి దూరంగా..
ఒకప్పుడు ఆంగ్లేయులు కల్పించిన రిజర్వేషన్ సదుపాయం వల్ల ఆంగ్లో ఇండియన్స్ కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ క్రమంగా ఉద్యోగావకాశాలకు దూరం కావడం, ఉన్నత చదువులు కూడా లేకపోవడంతో చాలా మంది సాంకేతిక నిపుణులుగా ఐటీఐ, వెల్డింగ్, మిషన్ రంగాల్లో అనుభవాన్ని ఆర్జించి ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ తదితర దేశాలకు తరలి వెళ్లారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినా, ఇక్కడే స్థిరపడ్డా  ఇంగ్లిష్ భాష ఒక్కటే వారికి జీవనాధారంగా నిలిచింది.

హైదరాబాద్‌లోని కాల్‌సెంటర్స్‌లో పనిచేసేవారిలో చాలామంది ఆంగ్లో ఇండియన్లే. భాష, కమ్యూనికేషన్ స్కిల్స్ వారిని ఈ రంగంలో  నిలబెట్టాయి. చాలా మంది విదేశాలకు తరలి వెళ్లడం వల్ల, ఆంగ్లో ఇండియన్ అమ్మాయిలు ఇతర హిందూ, హిందూయేతర వర్గాలకు చెందిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం వల్ల వీరి జనాభా క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో లక్షా 50 వేల మంది ఆంగ్లో ఇండియన్లు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య వేలకుపడిపోయింది.
 
అవకాశాలు పెరగాలి..

అనేక శతాబ్దాలుగా భారతీయ సాంస్కృతిక జీవనంలో కలిసిపోయి, ఓటు హక్కుతో సహా అన్ని రకాల హక్కులను అనుభవిస్తున్న ఆంగ్లో ఇండియన్లను మైనారిటీ కమ్యూనిటీగా గుర్తించాలని ది ఆల్ ఇండియా  ఆంగ్లో ఇండియన్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.

Advertisement
Advertisement