మరో 8 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు | Sakshi
Sakshi News home page

మరో 8 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు

Published Fri, Nov 28 2014 11:51 PM

మరో 8 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు

నగరంలో లక్షా 30 వేలు  దాటనున్న ఆటోల సంఖ్య
 
సిటీబ్యూరో :  నగరంలో మరో 8 వేల 828 కొత్త ఆటోలను రోడ్డెక్కించేందుకు పర్మిట్లను ఇస్తూ  ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతేడాది 20 వేల కొత్తఆటోలకు అనుమతులిస్తూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 90  విడుదల చేసింది. నిర్ధేశించిన 4 నెలల కాలపరిమితిలో  11,172 ఆటోలను మాత్రం ఆ ఏడాది విక్రయించారు. వాటిలో మిగిలిన 8 వేల పైచిలుకు ఆటోల విక్రయానికి ప్రభుత్వం విధించిన గడువు ముగియడంతో డీలర్లు అమ్మకాలను నిలిపివేశారు. అదే సమయంలో ఎన్నికలు సమీపించడంతో  ప్రభుత్వం సైతం ఆ పర్మిట్లకు అంతటితో స్వస్తి పలికింది. ఇటీవల కొందరు వ్యక్తులు జీవో 90ని  తిరిగి అమలు చేయాలని, మిగిలిన 8 వేల పైచిలుకు పర్మిట్లను సైతం విడుదల చేయాలని కోరుతూ  ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో పర్మిట్లను విడుదల చేయాలని హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ మేరకు  కొత్త ఆటోలకు పర్మిట్లను ఇస్తూ  జీవో విడుదల చేశారు. వచ్చే 120 రోజులలో ఆటో విక్రయాలను పూర్తి చేయాలని ప్రభుత్వ కార్యదర్శి సునీల్ శర్మ రవాణా శాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరలో పర్మిట్లపై విధివిధానాలను రూపొందించాలని సూచించారు.  

కాలుష్యానికి ఆజ్యం!

ప్రస్తుతం గ్రేటర్‌లో లక్షా  25 వేల  ఆటోలు ఉన్నాయి. ఇవి కాకుండా రంగారెడ్డి, మెదక్, నల్గొండ, తదితర పొరుగు జిల్లాల్లో నమోదైన మరో 5 వేల ఆటోలు సైతం నగరంలోనే తిరుగుతున్నాయి. అధికారికంగా ఎల్పీజీతో నడిచే ఆటోలకు మాత్రమే అనుమతులిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ సగానికి పైగా ఆటోలు పెట్రోల్‌పైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఇక ఎల్పీజీతో నడిచే  వాహనాల్లోనూ నకిలీ టూ టీ ఇంజన్ ఆయిల్  వినియోగించడం వల్ల  వాహన కాలుష్యం  భారీగా నమోదవుతోంది. ఇలాంటి వాహనాలపై ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోకుండానే, కాలం చెల్లిన వాహనాలను తొలగించకుండానే కొత్తవాటికి అనుమతినివ్వడం పట్ల పర్యావరణ నిపుణులు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు.

డీలర్ల లాభార్జనే ధ్యేయం...

ఇదిలా ఉండగా, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణం, కర్నూలు వంటి నగరాల్లో మూడు సీట్ల ఆటో కేవలం రూ. లక్షా 30 వేలకే లభించగా, గతేడాది హైదరాబాద్‌లో  రూ.లక్షా  80 వేల చొప్పున  విక్రయించారు.  దీంతో  అనేక మంది నిరుద్యోగులు, ఆటోడ్రైవర్లు  ప్రభుత్వం ఆశించిన విధంగా  ఉపాధిని  పొందడం సంగతి అటుంచి   శాశ్వత   రుణగ్రస్తులుగా మారారు. ఫైనాన్షియర్‌ల  దగ్గర తమ బతుకులను తాకట్టుపెట్టారు.

Advertisement
Advertisement