'ఎలక్ట్రానిక్ గూడ్స్' కేసులో మరో అరెస్టు | Sakshi
Sakshi News home page

'ఎలక్ట్రానిక్ గూడ్స్' కేసులో మరో అరెస్టు

Published Sat, Dec 12 2015 11:20 AM

another arrest in ' Electronic goods ' case

 రూ.2 కోట్లకు పైగా మోసాలకు పాల్పడిన ముఠా
 సూత్రధారిని గతంలోనే పట్టుకున్న సీసీఎస్ టీమ్
 పాత్రధారిని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చిన సైబర్ కాప్స్
 
 
 హైదరాబాద్

ఎలక్ట్రానిక్ వస్తువుల్ని మార్కెట్ ధరకంటే తక్కువకే విక్రయిస్తామంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చి, మోసం చేసిన ముఠాలో పాత్రధారిగా ఉన్న మహిళను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఏపీలో నమోదైన కేసుకు సంబంధించి విజయనగరం పోలీసులు ఇటీవల ఈమెను అరెస్టు చేయగా... విషయం తెలుసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకువచ్చారు.
 ఢిల్లీకి చెందిన నిఖిల్ అరోరా నేతృత్వంలో హ్యారీ, హర్జిత్‌సింగ్, రవీంద్రకౌర్, వినీష కటారియా ముఠాగా ఏర్పడ్డారు. ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ ఏర్పాటు చేసిన ఈ గ్యాంగ్ వివిధ రకాలైన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని తక్కువ ధరకు విక్రయిస్తామంటూ రంగంలోకి దిగారు. ఈ అంశాన్ని క్వికర్ సైట్ ద్వారానూ ప్రచారం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ అని టైప్ చేయగానే.. క్వికర్‌లో వీరి సైట్ కనిపించేలా, క్లిక్ చేసిన వెంటనే వెబ్‌సైట్ ఓపెన్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఈ సైట్‌లోకి ఎంటర్ అయిన వారికి అన్ని రకాలైన ఎలక్ట్రానిక్ గూడ్స్ మార్కెట్ ధరకంటే చాలా తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు కనిపించేవి. ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ కొన్ని ఫోన్ నెంబర్లను సైతం అందులో పొందుపరిచారు. ఇలా తమను సంప్రదించిన వారితో వస్తువు ధరలో సగం ముందుగా తమ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసి, ఆ రసీదును పోస్ట్ ద్వారా తమ చిరునామాకు పంపిస్తే డెలివరీ చేసి మిగిలిన మొత్తం తీసుకుంటామంటూ నమ్మబలికేవారు.  దీంతో అనేక మంది ఇలానే చేశారు.  రసీదు అందిందంటూ సమాచారం ఇచ్చిన ముఠా, ఆ నగదు మా ఖాతాలోకి రావడానికి వారం పడుతుందని, అప్పటి వరకు డెలివరీ సాధ్యం కాదంటూ చెప్పేవారు. ఆ తర్వాత సంప్రదించిన వారితో ఆఫర్ అయిపోయిందని, త్వరలోనే మీ డబ్బు తిరిగిస్తామంటూ చెప్పి, కొన్ని రోజులకు స్పందించడం మానేసేవారు.  ఈ రకంగా మోసపోయిన ముగ్గురు నగర వాసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసు లు ఆరు నెలల క్రితం నిఖిల్ అరోరాను అరెస్టు చేసి, అతడి ఖాతాలో ఉన్న రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగదు డిపాజిట్ చేయించుకోవడానికి వినియోగించిన ఖాతా వినీష కటారియా అనే మహిళ పేరుతో ఉందని గుర్తించారు. ఈమెతో పాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా... ఇదే ముఠా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన శివరాం అనే వ్యక్తిని రూ.25 లక్షల మేర మోసం చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అక్కడి పోలీసులు వినీష కటారియాను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ అధికారులు వినీషను పీటీ వారెంట్‌పై శుక్రవారం సిటీకి తరలించి అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ దేశ వ్యాప్తం గా రూ.2 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు అధికారులు నిర్థారిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement