కృష్ణాలో ఏపీకి 155 టీఎంసీలు చాలు | Sakshi
Sakshi News home page

కృష్ణాలో ఏపీకి 155 టీఎంసీలు చాలు

Published Thu, Jun 1 2017 3:00 AM

కృష్ణాలో ఏపీకి 155 టీఎంసీలు చాలు - Sakshi

- 512 టీఎంసీల నికర జలాల వాటాలో కోత పెట్టండి
- బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ముందు ఏపీ అఫిడవిట్‌కు రాష్ట్రం కౌంటర్‌
 
సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న నికర జలాల వాటాలో కోత పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు విన్నవించింది. కృష్ణా బేసిన్‌లో మొత్తంగా ఏపీకి 155 టీఎంసీల నీటి వాటా సరిపోతుందని, ఆ మేరకు వారికి ఇప్పటికే ఉన్న 512 టీఎంసీల వాటాలో కోత పెట్టాలని కోరింది. ఈ మేరకు ట్రిబ్యునల్‌కు ఏపీ సమర్పించిన అఫిడవిట్‌పై రాష్ట్రం కౌంటర్‌ దాఖలు చేసింది. 
 
కౌంటర్‌లో వివరాలు.. 
► కృష్ణా డెల్టా కింద ఏపీకి 152.20 టీఎంసీల కేటాయింపు ఉంది. రాజధాని ప్రాంతం సీఆర్‌డీఏ కారణంగా పరివాహకం తగ్గిపోతున్నందున మరో 16 టీఎంసీలు అవసరం లేదు. ఇక పోవలరం కాల్వల ద్వారా 80 టీఎంసీలు తరలిస్తున్నందున మొత్తం వాటాలో దీన్ని తగ్గించాలి. మొత్తంగా కృష్ణా డెల్టాకి 17.55 టీఎంసీలు సరిపోతాయి.
► గుండూరు ఛానల్‌కు 4 టీఎంసీలున్నా, వాస్తవ అవసరాలు 1.48 టీఎంసీలకు మించవు.
► సాగర్‌ ఎడమ కాల్వల కింద వారికి 34.25 టీఎంసీల కేటాయింపుల్లో వాస్తవ అవసరాలు 20.22 టీఎంసీలే. అయితే అమరావతి రాజధాని కింద 3.05లక్షల ఎకరాలు ప్రభావితం అవుతున్నందున ఈ నీటి కేటాయింపులు కూడా అవసరం లేదు.
► సాగర్‌ కుడి కాల్వ కింద 140 టీఎంసీల కేటాయింపులు ఉండగా, వాస్తవ అవసరాలు 75.57 టీఎంసీలు మాత్రమే. ఇందులోనూ కుడి కాల్వ పరిధిలోని 2.67లక్షల ఎకరాలు రాజధాని ప్రాంతంలో ఉన్నందున 26.71టీఎంసీలను తగ్గించి 75.77 టీఎంసీలు కేటాయిస్తే సరిపోతుంది.
► తుంగభద్ర లోలెవల్‌ కెనాల్, హై లెవల్‌ కెనాల్‌ల కింద అవసరాలకు మించి కేటాయింపులున్నాయి. వాటిని తగ్గించాలి.
► మొత్తంగా 512 టీఎంసీల నికర జలాల కేటాయింపులను 155.40 టీఎంసీలకు పరిమితం చేయాలి.
► ఇక తెలంగాణకు కృష్ణా బేసిన్‌లో 68.5శాతం పరివాహకం ఉండగా కేటా యింపులు మాత్రం 36.9 శాతమే. అదే ఏపీకి 31.5శాతం పరివాహకం ఉన్నా కేటాయింపులు మాత్రం 63.1శాతం ఉన్నాయి. ఇందులోనూ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 351 టీఎంసీలు ఏపీ బేసిన్‌ బయటే వాడుకుంటోందని తెలిపింది. బేసిన్‌ పరివాహకంలో సాగు యోగ్య భూమి తెలంగాణలో 36.5లక్షల హెక్టార్లు ఉండగా, ఏపీలో కేవలం 15.03లక్షల హెక్టార్లు ఉంది. జనాభా పరంగా చూసినా కృష్ణా బేసిన్లో తెలంగాణలో 2కోట్ల మంది (71.9శాతం) మంది ఉండగా, ఏపీలో 78.29లక్షలు(28.1శాతం) మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే 811 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 600 టీఎంసీల వరకు దక్కాలి.

Advertisement
Advertisement