సచివాలయం అప్పగింతకు ఏపీ ఓకే | Sakshi
Sakshi News home page

సచివాలయం అప్పగింతకు ఏపీ ఓకే

Published Thu, Oct 20 2016 1:16 AM

సచివాలయం అప్పగింతకు ఏపీ ఓకే - Sakshi

- ఫలించిన గవర్నర్ రాయబారం
- రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన సయోధ్య
- త్వరలోనే కేబినెట్ ఆమోదానికి ఫైలు
 
 సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సచివాలయ ప్రాంగణాన్ని తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరింది. దీంతో కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతమున్న సచివాలయం కూల్చివేతకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఆర్ అండ్ బీ అధికారులకు సంకేతాలు జారీ చేశారు. వచ్చే నెలలో లేదా డిసెంబర్ మొదటి వారంలో కూల్చివేత పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన అవరోధంగా ఉన్న ఏపీ సచివాలయం, ఏపీ కార్యాలయాలున్న భవానాలను సైతం ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది.

స్వయంగా ముఖ్యమంత్రి కె,చంద్రశేఖర్‌రావు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలసి కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనలు, అందులో ఉన్న కార్యాల యాల తరలింపు అవసరాన్ని వివరిం చారు. రాష్ట్రాల పునర్విభజనతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కావటంతో ఏపీ ప్రభుత్వం సైతం సచివాలయంలోని కార్యాలయాలు ఖాళీ చేయాల్సిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వరుసలో గవర్నర్ రాయబారంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సచివాలయ భవనాల అప్పగింత విషయంలో అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఏపీ సచివాలయంలోని దాదాపు అన్ని కార్యాలయాలు ఇప్పటికే అమరావతి కొత్త రాజధానికి తరలి వెళ్లాయి. దీంతో ఎల్ బ్లాక్‌తో సహా తమ అధీనంలో ఉన్న అన్ని బ్లాక్‌లను అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సమ్మతించినట్లు సమాచారం.

ప్రత్యామ్నాయంగా నాంపల్లిలో గాంధీభవన్ పక్కన ఉన్న మనోరంజన్ బిల్డింగ్‌ను ఏపీ ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యం లో ఏపీ సచివాలయ ప్రాంగణం స్వాధీ నం, సచివాలయం కూల్చివేతకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతో ఒక తీర్మానాన్ని గవర్నర్‌కు పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫైలు సిద్ధం చేసింది. సర్క్యులేషన్ విధానంలో ఈ ఫైలును మంత్రులకు పంపించి తీర్మానంపై సంతకాలు చేయించి, ఆ వెంటనే కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపిం చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే వారంలోగా ఈ ప్రక్రియ పూర్తికి ఫైళ్లు చకచకా కదులుతున్నాయి. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాతే సచివాలయం కూల్చివేత, కొత్త నిర్మాణానికి భూమిపూజ ముహూర్తాలు ఖరారు చేయాలని సీఎం భావిస్తున్నారు.
 
 క్యాంపు ఆఫీసులో ఆలయ పునఃప్రతిష్ఠ
 బేగంపేటలోని సీఎం క్యాంపు ఆఫీసు వెనుక కొత్తగా నిర్మించిన అమ్మవారి ఆలయాన్ని గురువారం పునఃప్రతిష్ఠిం చనున్నారు. కొత్త క్యాంప్ ఆఫీసు నిర్మా ణ నేపథ్యంలో గతంలో అక్కడ ఉన్న ఆలయాన్ని తొలిగించి.. అదే స్థలంలో కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఉదయం 11.03 నిమిషాలకు జరిగే ఆలయ పునః ప్రతిష్ఠ పూజల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొంటారు.

Advertisement
Advertisement