అపుడు వంగివంగి సలాములు... | Sakshi
Sakshi News home page

అపుడు వంగివంగి సలాములు...

Published Sun, Mar 13 2016 4:40 PM

అపుడు వంగివంగి సలాములు... - Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మంత్రివర్గ సభ్యుడు ఒకరు గతంలో ఏ పార్టీ నేత కనిపించినా వంగి వంగి సలాములు పెట్టేవారట. ఇపుడు మాత్రం అపుడు తాను వంగి వంగి సలాములు పెట్టిన వారు ఎవరు కనిపించినా అస్సలు తెలియనట్లు నటిస్తున్నారట. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తించిన ఓ మంత్రివర్యులు ఎన్నికల ముందు టీడీపీ నుంచి పోటీచేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు సీటు సంపాదించుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాజీనామా వ్యవహారం ఎంత వరకు వచ్చింది, సంబంధిత ఫైల్  ఏ రోజు ఎక్కడ వరకు వచ్చి ఆగిపోయిందో వివరిస్తూ తాను పోటీ చేయదలచుకున్న జిల్లాకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శికి సన్నిహితుడైన నేత ఒకరికి నిత్యం ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించేవారు.

ఆ సన్నిహిత నేత పార్టీ ప్రధాన కార్యదర్శి వెంట ఉన్నపుడు పదే పదే ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నించే వారు. కారు ఎక్కేందుకు వెళుతుంటే తలుపు తీసి సిద్ధంగా ఉండేవారు. కారు దిగటానికి సిద్ధమౌతుంటే డోరు వద్దే నిలబడి తలుపుతీసేందుకు ప్రయత్నించే వారు. అలాంటి వ్యక్తికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం వచ్చింది. పోటీ చేశారు. గెలిచారు. మంత్రి అయ్యారు. ఆ తరువాత ఆయన ప్రవర్తనే మారిపోయింద ట. గతంలో ఆయన ఎవరికైతే వంగివంగి నమస్కారాలు పెట్టారో... వారే ఇపుడు తెలియనట్లు నటిస్తున్నారట.

ఇటీవల ఆ మంత్రి చాంబర్‌కు టీడీపీ సీనియర్ నేత ఒకరు వెళ్లారు. గతంలో ఆ నేతకు సదరు మంత్రిగారు ఉద్యోగంలో ఉండి టికెట్టుకోసం ప్రయత్నిస్తున్న సమయంలో వంగివంగి నమస్కారాలు పెట్టారు. ఇపుడు మాత్రం ఆ నేత తనకు అస్సలు తెలియనట్లు ఫేస్ పెట్టారట. ఆ మంత్రి పక్కనే ఉన్న పార్టీ నేత ఒకరు ఈయన ఫలానా అని పరిచయం చేసినా పట్టించుకోకుండా వెళ్లిపోయారట. ఈ పరిణామాన్ని గమనించిన తొలి నుంచి మంత్రి పక్కన తిరుగుతూ ఉన్న అనుచరులు పదవి మనిషిలో ఇంత మార్పు తెస్తుందా అని ముక్కున వేలేసుకున్నారట.

Advertisement

తప్పక చదవండి

Advertisement