మండలిలో ‘ఇళ్ల’ లొల్లి | Sakshi
Sakshi News home page

మండలిలో ‘ఇళ్ల’ లొల్లి

Published Wed, Dec 28 2016 12:26 AM

మండలిలో ‘ఇళ్ల’ లొల్లి - Sakshi

- అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం
- ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలపై పరస్పర ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: గృహ నిర్మాణంపై మంగళవారం శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. అధికార, విపక్ష సభ్యుల విమర్శలు, ఆరోపణలతో సభ వేడెక్కింది. ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ..  గత ప్రభుత్వాల హయాంలో 43.29లక్షల ఇళ్లను నిర్మిస్తే రాష్ట్రం లో ఇళ్లు లేని కుటుంబాలే ఉండకూడదని ఎద్దేవా చేశారు. ఇళ్ల నిర్మాణాల్లో అవినీతికి సంబంధించి 225 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయన్నారు. గత ప్రభుత్వాలు గృహ నిర్మాణానికి రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం రూ.17,660 కోట్లు కేటాయించిందన్నారు.

10 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఏవీ?: షబ్బీర్‌
ఏడాదికి 2 లక్షల చొప్పున ఐదేళ్లలో 10 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామని టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏమైందని విపక్ష నేత షబ్బీర్‌ అలీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్‌ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరారని ఆరోపించారు. సర్పంచ్‌లపై కేసులు పెడతామని బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని మండిపడ్డారు. దీనిపై టీఆర్‌ఎస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా అధికార సభ్యులు, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది.

మీరా నీతులు చెప్పేది: భానుప్రసాద్‌
రాజీవ్‌ స్వగృహ అనేది బోగస్‌ పథకం అని, ఇంతకు మించి అవినీతి కుంభకోణం మరొకటి ఉండదని టీఆర్‌ఎస్‌ సభ్యుడు భానుప్రసాద్‌ ఆరోపించారు. అమ్మ సంగతి మేనమామకు ఎరుక అన్న చందంగా గతంలో కాంగ్రెస్‌లో ఉన్న తమకు ఈ అవినీతి విషయాలన్నీ బాగా తెలుసన్నారు. ‘‘హౌసింగ్‌ అవినీతిని తార స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తే కాంగ్రెస్‌ అధ్యక్షు డిగా ఉన్నారు.. మీరా నీతులు చెప్పేది? అవినీతిలో భ్రష్టు పట్టిన కాంగ్రెస్‌లో ఉండలేకే నేను బయటకు వచ్చా’’ అని అన్నారు. తప్పు చేసిన టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీల సభ్యత్వాన్ని పంచాయతీరాజ్‌ శాఖరద్దు చేసిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలా చేయగలిగిందా అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.

ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చామని ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారని, లేకపోతే వారే తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. దీనిపై కడియం మండిపడ్డారు.  ‘‘గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయింది. మీ బతుకు, జీవితమే అవినీతిమయం. దేశంలో అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరు కాంగ్రెస్‌. అవినీతిలో కూరుకు పోయి ఢిల్లీ, హైదరాబాద్, నల్లగొండలో స్కాంలు, కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు’’ అని అన్నారు. సమయం మించిపోవడంతో శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ చర్చను బుధవారానికి వాయిదా వేశారు.

Advertisement
Advertisement