జీవో 28పై ముగిసిన వాదనలు | Sakshi
Sakshi News home page

జీవో 28పై ముగిసిన వాదనలు

Published Tue, Apr 19 2016 12:37 AM

జీవో 28పై ముగిసిన వాదనలు - Sakshi

నిర్ణయం రేపటికి వాయిదా

 సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండల పరిధిలోని మీర్‌పేట, జిల్లెలగూడ, కొత్తపేట, బాలాపూర్, జల్లపల్లి, పహాడీ షరీఫ్ గ్రామ పంచాయతీలను డీ నోటిఫై చేసి మునిసిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 28ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఉత్తర్వులను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఈ జీవోను కొట్టేసి, ఈ 6 గ్రామ పంచాయతీల విధుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సరూర్‌నగర్ మండల ప్రజా పరిషత్ సభ్యుడు తీగల విక్రంరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, ముందుగా పంచాయతీలకు నోటీసులు జారీ చేసి వారి అభిప్రాయం తెలుసుకున్న తరువాతనే మునిసిపాలిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు.

రెండేళ్ల క్రితం అంటే ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన షోకాజ్ నోటీసుల ఆధారంగా ఇప్పుడు డీ నోటిఫై నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఈ వాదనలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి తోసిపుచ్చారు. ప్రభుత్వం నిబంధనల మేరకే ఆరు గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీలుగా మార్చిందన్నారు. ఇలా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని తెలిపారు.  ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. బుధవారం ఈ వ్యాజ్యంపై నిర్ణయం వెలువరిస్తానని స్పష్టం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement