అక్కడ నిప్పు... ఇక్కడ గాయం | Sakshi
Sakshi News home page

అక్కడ నిప్పు... ఇక్కడ గాయం

Published Tue, Aug 11 2015 11:57 PM

అక్కడ నిప్పు...  ఇక్కడ గాయం - Sakshi

బిక్కుబిక్కుమంటున్న  బస్తీ వాసులు
పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనలో 35 మంది అరెస్ట్
పరారీలో మరికొందరు
కుట్రతో సంబంధం లేని వ్యక్తులపైనా కేసులు
కన్నీటి పర్యంతమవుతున్న నిందితుల కుటుంబ సభ్యులు

 
ఆవేశమో... ఆగ్రహమో... రగిల్చిన మంటలు... ఇప్పుడు కొన్ని గుండెలను దహించేస్తున్నాయి. క డుపులను కాల్చేస్తున్నాయి. అమాయక జనం కళ్లలో కన్నీటి వర్షానికి కారణమవుతున్నాయి. మంటలకు కారణం     ఒకరైతే... ఇప్పుడు గాయపడుతున్నది మరొకరు. ఆగ్రహం ఒకరిదైతే...ఆవేదన మరొకరిది. భర్త, పిల్లలు దూర మై ఇల్లాలు... కన్నబిడ్డను పోలీసులు తీసుకెళ్తుంటే... నిస్సహాయంగా నిలబడిన తల్లి.. ఆధారమైన తమ్ముడు అరెస్టయితే... ఆకలితో అలమటిస్తున్న అక్క...ఇలా ప్రతి ఇల్లూ ఇప్పుడు ఓ శోక సంద్రం. ఇదీ మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటన ఫలితం.
 
మారేడుపల్లి: ఒకరిద్దరు నేరస్తులు, రౌడీషీటర్ల కుట్ర వల్ల ఇప్పుడు మహత్మాగాంధీ నగర్, వాల్మీకి నగర్, దుర్గయ్య గార్డెన్ బస్తీలు శిక్ష అనుభవిస్తున్నాయి. ఏ క్షణంలో ఏ ఇంటిపై పోలీసులు దాడి చేస్తారో... ఎవరిని అరెస్టు చే సి తీసుకెళ్తారోనని భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. అంతా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు. ఏ రోజుకు ఆ రోజు పని చే స్తే తప్ప పూట గడవదు. అలాంటి ఇళ్లలో సంపాదించే వ్యక్తులు అరె స్టవడంతో పిల్లలు, పెద్దలు, మహిళలు వీధిన పడ్డారు. ఇదీ మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి పరిణామం.  
 
భయం భయంగా...

 బన్నప్ప మృతితో పోలీస్ స్టేషన్‌పై దాడికి కుట్రకు పాల్పడింది కొందరైతే... ఫలితాన్ని మాత్రం అందరూ అనుభవించాల్సి వస్తోంది. మొత్తం 101 మంది దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 35 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 66 మంది అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేసులు ఎదుర్కొంటున్న వారిలో కొందరు పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు ఎప్పుడొస్తారో? ఎవరిని అరెస్టు చేస్తారోనన్న ఆందోళనతో స్థానికులు బితుకుబితుకుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దాడి  రోజు అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితుల్లో మద్యం మత్తులో కొందరు ఉన్నారు. గుంపుతో వెళ్లిన వారు మరికొందరు. ‘దాడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్లతో పాటు ఏమాత్రం సంబంధం లేని వారిని సైతం అరెస్టు చేస్తున్నారంటూ’ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒకే ఇంట్లో ముగ్గురు, నలుగురు మగవాళ్లు అరెస్టయ్యారు. వారంతా పనిచేసి సంపాదిస్తే తప్ప ఆ కుటుంబాలకు పూట గడవదు. ఎప్పుడొస్తారో తెలియని తమ వారి కోసం బాధిత కుటుంబాలు దీనంగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ‘సాక్షి’తో తమ గోడు వెళ్లబోసుకున్నారు.

 ఇంట్లో నలుగురినీ అరెస్టు చేశారు : లాల్ బీ
 స్టేషన్‌పై గొడవతో ఏమాత్రం సంబంధం లేకున్నా నా భర్తతో పాటు ముగ్గురు కుమారులనూ అరెస్టు చేశారు. బస్తీలో మటన్ షాపును నిర్వహిస్తూ బతుకుతున్నాం. బోనాల సందర్భంగా మాంసం విక్రయిస్తుండగా... బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు వెళ్తుంటే మావాళ్లూ వెళ్లారు. అప్పటికే స్టేషన్ వద్ద గొడవ సద్దుమణిగిందని మావాళ్లు చెప్పారు. అయినా పోలీసులు షాబోద్దీన్, రఫీక్, మహ్మద్ మౌలానా, చాంద్‌లను అరెస్టు చేసి జైలుకు పంపారు. మూడు రోజులగా మటన్‌షాపు మూసేసి రోడ్డున పడ్డాం. నా భర్త, కొడుకులు ఎప్పుడొస్తారో తెలియడం లేదు.
 
వాళ్లకు సంబంధం లేదు : గంగ, చందు సోదరి

దాడితో సంబంధం లేకున్నా పోలీసులు అక్రమంగా మా ఇంట్లో ఉన్న ముగ్గురు మగవారినీ అరెస్టు చేశారు. మా తమ్ముడు చందు ఆటో ద్వారా సంపాదించే ఆదాయంపైనే మా కుటుంబం ఆధారపడి ఉంది. మా అక్క కొడుకులు నవీన్, రవితేజ మా ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. నవీన్‌ను పోలీసులు అరెస్టు చేస్తుంటే అడ్డు పడినందుకు చందును అరెస్టు చేశారు. నాలుగు రోజులుగా సంపాదన లేక ఇల్లు గడవడం కష్టంగా మారింది. చందుకు 20 రోజుల క్రితమే బాబు పుట్టాడు. చంటి పిల్లాడితో మా మరదలు పడే వేదన మమ్మల్ని మరింత కలచివేస్తోంది.
 
చూడ్డానికి వెళ్లాం : లక్ష్మి, అజయ్ సోదరి
 బన్నప్ప చనిపోయాడని తెలియడంతో పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాం. అప్పటికే  స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. మరుసటి రోజు మాకు సంబంధం ఉందంటూ పోలీసులు మా బాబును తీసుకు వెళ్లారు. చిత్రహింసలకు గురి చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించండి. అమాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయొద్దు.
 
చిన్న పిల్లోడినీ అరెస్టు చేశారు : మల్లమ్మ, చంద్రశేఖర్ తల్లి
 పోలీసు స్టేషన్ దగ్గర గొడవని తెలిసి అప్పటిదాకా ఇంట్లోనే ఉన్న నా కొడుకు చంద్రశేఖర్ అక్కడికి వెళ్లాడు. గొడవలో మా కొడుకు పాల్గొనకపోయినా అరెస్టు చేశారు. 18 ఏళ్లు కూడా నిండని నా కొడుకును అన్యాయంగా ఇరికించారు.
 
 పోలీసులే చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా?:  జస్టిస్ చంద్రకుమార్
 ఈ కేసు వెనుక కొన్ని శక్తులు ఉన్నాయనే మాట బలంగా వినిపిస్తోంది.సమగ్ర విచారణ లేకుండానే పోలీసులు అమాయకులను  అరెస్టు చేస్తున్నారు. చనిపోయిన బన్నప్న తల్లిని, తమ్ముడిని సైతం కొట్టిన గుర్తులు ఉన్నాయి. అర్ధరాత్రి పూట అరెస్టులకు పాల్పడుతున్నారు. వాళ్లేమైనా దేశద్రోహులా? పగటి పూట స్టేషన్‌కు రప్పించవచ్చు. విచారణ చేయవచ్చు. చట్టవ్యతిరేకంగా అరెస్టులకు పాల్పడి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. పోలీసులే చట్టాలను ఉల్లంఘించడం మంచిది కాదు.  
 
 ఫ్రెండ్లీ పోలీస్‌కు విరుద్ధం : ఎస్.జీవన్‌కుమార్, అధ్యక్షులు, మానవ హక్కుల వేదిక
 మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడిన వారిలో పాతనేరస్తులు, రౌడీషీటర్లు ఉండవచ్చు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. కుట్రలతో సంబంధం లేని వారు కూడా అరెస్టవుతున్నారు. దీనివల్ల వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. పోలీసులు సంయమనంతో వ్యవహరించాలి. వారం రోజులుగా నగరంలో 5 చిత్రహింసల కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ‘స్నేహపూర్వకమైన పోలీసులు’అనే భావనకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇది సరికాదు.
 
 
 ఫోన్ కాల్స్‌పైనా ఆరా
 దాడిలో పాల్గొన్న బన్నప్ప కుటుంబ సభ్యులతో పాటు పాత నేరస్తుల కదలికలపై పోలీసులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిందితులు దాడి ఘటనకు ముందు, ఆ తర్వాత జరిపిన ఫోన్ సంభాషణల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది.   ఏ-4 నిందితుడిగా ఉన్న దశరథ్ దాడి సమయంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో నేత ఒకరితో ఫోన్‌లో సంభాషించినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు... మరికొందరు నిందితుల ఫోన్ కాల్స్ విషయంలోనూ ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
 

Advertisement
Advertisement