101 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ | Sakshi
Sakshi News home page

101 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ

Published Fri, Jun 24 2016 3:39 AM

101 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ

* నీటి నిల్వ ప్రస్తుతానికి 100 మీటర్ల ఎత్తులో..
* తర్వాత 101 మీటర్లకూ అనుమతి: ఫడ్నవిస్
* మహారాష్ట్ర సీఎంతో హరీశ్ చర్చలు సఫలం
* ఇతర బ్యారేజీలకు మహారాష్ట్ర ఓకే
* జూలై రెండోవారంలో హైదరాబాద్‌లో ఒప్పందాలు

సాక్షి, హైదరాబాద్: గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై తలపెట్టిన మూడు బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందాలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. జూలై రెండో వారంలో ఒప్పందం కుదుర్చుకునేందుకు మహారాష్ట్ర సమ్మతించింది. ఒప్పంద మార్గదర్శకాలపై ప్రాథమిక ప్రక్రియ పూర్తవగానే తేదీని నిర్ణయించనున్నారు.

నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో ఈ విషయమై జరిపిన భేటీ ఫలప్రదమైంది. బ్యారేజీల ఒప్పందాలు, ఇరు రాష్ట్రాల సీఎంలతో కూడిన అంతర్ రాష్ట్ర అపెక్స్ కమిటీ భేటీ తేదీ ల ఖరారుకు హరీశ్ గురువారం ఢిల్లీ నుంచి నేరుగా ముంబై వెళ్లి ఫడ్నవిస్‌తో గంటకుపైగా సమావేశమయ్యారు. ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి గిరీశ్ మహాజన్, ఇరు రాష్ట్రాల శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్‌కే జోషి, చాహాల్, కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ నల్లా వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఆదిలాబాద్ సీఈ భగవంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 
101 మీటర్ల మేడిగడ్డ డిజైన్‌కు ఓకే
మూడు బ్యారేజీల నిర్మాణ అవసరాన్ని హరీశ్ ఈ సందర్భంగా వివరించారు. గోదావరిలో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తి స్థాయి లో వినియోగించుకునేందుకు రూపొం దించుకున్న డిజైన్లపై స్పష్టత ఇచ్చారు. కాళేశ్వరం ద్వారా 160 టీఎంసీల నీటిని మళ్లిం చేందుకు మేడిగడ్డ అనువైన ప్రాంతమని, ఈ బ్యారేజీతో పెద్దగా ముంపు లేదని వివరించారు.

102 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో 399 హెక్టార్లు, 101.5 మీటర్లయితే 315 హెక్టార్లు, 101 మీటర్లయితే 240 హెక్టార్లు, 100 మీటర్లయితే 83 హెక్టార్ల ముంపునకు గురవుతుందని వివరించారు. బ్యారేజీ నిల్వ సామర్థ్యం 102 మీటర్ల ఎత్తుతో 22 టీఎంసీ, 101 మీటర్లయితే 19.73 టీఎంసీ, 100 మీటర్లకు 16.5 టీఎంసీల సామర్థ్యముంటుందని వివరించారు. మహారాష్ట్ర 101 మీటర్లకు అంగీకరిస్తే తమకు సహాయకారిగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు.

ఇందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఫడ్నవిస్ తెలిపారు. అయితే నీటిని 100 మీటర్ల ఎత్తులో నిల్వ చేయాలని సూచించారు. ముంపు ప్రాంతం, పరిహారం చెల్లింపు ప్రక్రియ ముగిశాక నీటి నిల్వను 101 మీటర్ల ఎత్తుకు పెంచే అంశమూ పరిశీలిస్తామని తెలిపారు. ఇక తమ్మిడిహెట్టి ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర సీఎం పూర్తి సమ్మతి తెలిపారు.

పర్యావరణ, అటవీ, కేంద్ర జల సంఘం అనుమతుల ప్రక్రియ కొలిక్కి వస్తున్నందున దీనిపై అభ్యంతరం లేదన్నారు. ఛనాఖా-కొరటకు అటవీ, వన్యప్రాణి, గనుల శాఖల అనుమతులొచ్చినందున 213 మీటర్ల ఎత్తులో నిర్మాణం తమకు అంగీకారమేనని ప్రకటించారు. ఈ బ్యారేజీల ఒప్పందాల ప్రక్రియ నిమిత్తం జూలై రెండో వారంలో హైదరాబాద్ వస్తానని కూడా హరీశ్‌కు ఫడ్నవిస్ హామీ ఇచ్చారు. దీనిపై హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement