సాక్షి,సిటీబ్యూరో: తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు అంతా కలిసి నిరుద్యోగుల నోట మట్టి కొడుతున్నారు. ఈ పాపంలో రవాణా అధికారులు ముందున్నారు. నిరుద్యోగుల ఉపాధి కోసం ప్రభుత్వం ఇచ్చిన 20 వేల ఆటో పర్మిట్లలో సింహభాగం అనర్హులకే దోచిపెడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.ఒక్కో ఆటోపై రూ. 2 వేల వరకు ముడుపులు అందుకొని తప్పుడు చిరునామాలు, ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆటోరిక్షాల కొనుగోళ్లకు అనుమతులు (ప్రొసీడింగ్స్) ఇచ్చేస్తున్నారని ఆటో సంఘాలు ఆరోపిస్తున్నాయి. రవాణాశాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం ‘గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన నిరుద్యోగి, ఇప్పటి వరకు తమ కుటుంబానికి ఎలాంటి ఆటో పర్మిట్ లేకపోతే.. తమకు ఉన్న ఏదో ఒక డ్రైవింగ్ లెసైన్స్ ఆధారంగా’ దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు.
ఈ నిబంధనను ఆర్టీఏ అధికారులే పాతరేసి.. ఇప్పటికే ఆటోలు ఉన్న వాళ్లకు, ‘గ్రేటర్’కు బయట నివసించే వాళ్లకు సైతం పర్మి ట్లు ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ ప్రహసనం కొనసాగుతోంది. తప్పుడు చిరునామాలు, నకిలీ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఫైనాన్సర్లు, పాత వాహనాల (ఆటో) అమ్మకందార్లు రంగ ప్రవేశం చేసి పెద్దఎత్తున పర్మిట్లను కొల్లగొడుతున్నారు. ఇలా ఇప్పటికే ఆటో ఉన్న ఒక వ్యక్తి మరో ఆటో కోసం దరఖాస్తు చేసుకొని ప్రొసీడింగ్స్ కూడా దక్కించుకున్న ఉదంతం మలక్‌పేట్ ఆర్టీఏ కార్యాలయంలో వెలుగు చూసింది. సింగరేణికాలనీకి చెందిన ఒక వ్యక్తికి ఇప్పటికే ఆటో ఉన్నప్పటికీ తప్పుడు చిరునామాపై మరో ఆటోకు ప్రొసీడింగ్స్ ఇచ్చారని ఆటో సంఘాల నాయకులు తెలిపారు. దీంతో అన్ని అర్హతలు ఉండి, ఆటో కొనుక్కునేందుకు ఆసక్తి చూపే వారికి అన్యాయం జరుగుతోందని వారు పేర్కొన్నారు.
జిరాక్స్ పత్రాలతో జిమ్మిక్కులు....
ఆటో పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తి దరఖాస్తుతో పాటు డ్రైవింగ్ లెసైన్స్, చిరునామా పత్రాల ఒరిజినల్స్‌ను పరిశీలించిన తర్వాతే అనమతిని ఇవ్వాలి. కానీ అందుకు విరుద్ధంగా దరఖాస్తుతో పాటు జత చేసిన జిరాక్స్ పత్రాలను మాత్రమే చూసి ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తున్నారు. దీంతో ఒకే వ్యక్తి రకరకాల అడ్రస్‌ల్లో ఉన్నట్లుగా జిరాక్స్ పత్రాలను సృష్టించి జత చేస్తున్నారు. మలక్‌పేట్, కర్మన్‌ఘాట్, తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో ఇలాంటి అనుమతులు ఎడాపెడా ఇచ్చేస్తున్నట్లు ఆటోసంఘాలు ఆరోపిస్తున్నాయి.
పాతవాహన అమ్మకందార్ల గుత్తాధిపత్యం...
నాంపల్లి, మొగల్పురా, సికింద్రాబాద్, చిలకలగూడ, బజార్‌ఘాట్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో గల సుమారు 400 మంది పాత ఆటో అమ్మకందార్లు కొత్త ఆటో పర్మిట్లలో తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. బినామీ పేర్లతో ఆటోలు కొనుగోలు చేసి, తర్వాత ఫైనాన్సర్ల ద్వారా వాటిని ఆటోడ్రైవర్లకు అప్పగిస్తున్నారు. ఈ వ్యాపారంలో అంతిమంగా నిరుపేద ఆటోడ్రైవర్ నష్టపోతున్నాడు.